Land Re servey పరిష్కారమే లక్ష్యం..!
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:21 PM
భూముల రీ సర్వే కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు మరోమారు సర్వే చేపడుతున్నారు. రైతుల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వచ్చిన గ్రామాలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు.

20 నుంచి భూముల రీ సర్వే
ప్రతి మండలంలో ఒక గ్రామం
వైసీపీ హయాంలో ఇష్టారాజ్యం
మారిన భూ విస్తీర్ణం.. హద్దులు
ఫిర్యాదులు స్వీకరించిన ప్రభుత్వం
అనంతపురం టౌన, జనవరి 16(ఆంధ్రజ్యోతి): భూముల రీ సర్వే కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు మరోమారు సర్వే చేపడుతున్నారు. రైతుల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వచ్చిన గ్రామాలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. రీ సర్వే సమస్యలను తెలుసుకునేందుకు అధికారులు ఇప్పటికే గ్రామ సభలను నిర్వహించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వీటి ఆధారంగా ఈ నెల 20 నుంచి రీ సర్వే ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది.
20వ తేదీ నుంచి..
జిల్లాలో ఈ నెల20 నుంచి రీ సర్వేను ప్రయోగాత్మకంగా చేపడుతున్నారు. జిల్లాలో 31 మండలాలు ఉండగా, ఒక్కో మండలంలో ఒక్కో గ్రామాన్ని పైలెట్‌గా ఎంపిక చేశారు. రాయదుర్గంలో జుంజరంపల్లి, కణేకల్లు మీన్లహళ్లి, డి.హీరేహాళ్ మండలంలో కడలూరు, బొమ్మనహాళ్‌లో కురవపల్లి, గుమ్మఘట్ట మండల కేంద్రం, ఉరవకొండలో వ్యాసాపురం, వజ్రకరూరులో గంజికుంట, విడపనకల్లులో ఉండబండ, బెళుగుప్పలో తగ్గుపర్తి, కూడేరులో జయపురం, కళ్యాణదుర్గంలో దురదకుంట, బ్రహ్మసముద్రంలో గుండెగానిపల్లి, కుందుర్పిలో అపిలేపల్లి, కంబదూరులో తిమ్మాపురం, శెట్టూరులో అయ్యగార్లపల్లి, గుంతకల్లులో శంకరబండ, గుత్తిలో శ్రీపురం, పామిడిలో కాళాపురం, బుక్కరాయసముద్రంలో రెడ్డిపల్లి గార్లదిన్నెలో కల్లూరు, శింగనమలలో మట్లగొంది, నార్పలలో బొందలవాడ, యల్లనూరులో గాండ్లపాడు, పుట్లూరులో పాతపల్లి, తాడిపత్రిలో ఊరుచింతల, పెద్దపప్పూరులో చిన్నఎక్కలూరు, పెద్దవడుగూరులో దిమ్మగుడి, యాడికిలో చందన, అనంతపురం రూరల్‌లో తాటిచెర్ల, ఆత్మకూరులో సనప, రాప్తాడులో బండమీదపల్లి గ్రామాలను రీ సర్వేకి ఎంపిక చేశారు.
పరిష్కారమే లక్ష్యం
వైసీపీ హయాంలో భూముల రీ సర్వే చేపట్టారు. రైతుల అభిప్రాయాలను తీసుకోకుండా, ఇష్టారాజ్యంగా వ్యవహరించి, రికార్డులకు ఎక్కించారు. దీంతో చాలామంది రైతులు పూర్వం నుంచి సాగు చేసుకుంటున్న భూములను కోల్పోయారు. భూముల విస్తీర్ణం, సరిహద్దులలో తేడాలు వచ్చాయి. బాధిత రైతులు నెత్తీనోరు కొట్టుకున్నా వైసీపీ పాలకులు, అధికారులు పట్టించుకోలేదు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే రీ సర్వేపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వీటి కోసం తొలుత ప్రత్యేక గ్రామసభలను ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా వేలల్లో ఫిర్యాదులు వచ్చాయి. ఇటీవల భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహించింది. ఆ సమయంలోనూ రీసర్వే సమస్యలపై వేలల్లోనే ఫిర్యాదులు వచ్చాయి. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 5 వేల వరకు ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో కొన్నింటిని ఇప్పటికే పరిష్కరించారు. సగానికి పైగా అలాగే ఉండిపోయాయని అధికారులు అంటున్నారు. రీ సర్వేతో ఆ సమస్యలు కూడా పరిష్కారమౌతాయని అంటున్నారు.
అత్యంత జాగ్రత్తగా..
రీ సర్వే కారణంగా భూ సమస్యలు తలెత్తాయి. వాటి పరిష్కారం కోసం మరోమారు రీ సర్వే చేపడుతున్నాం. జిల్లాలో పైలెట్‌గా 31 గ్రామాలను ఎంపిక చేశాము. ఈ నెల 20 నుంచి రీ సర్వే మొదలౌతుంది. ప్రతి గ్రామానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేశాము. ఈ సర్వేని అత్యంత జాగ్రత్తగా చేపడుతున్నాం.
- శివనారాయణశర్మ, జేసీ