Karivepaku వ్యాపారుల దోపిడీ
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:23 PM
కరివేపాకు రైతులను కొందరు వ్యాపారులు నమ్మించి నట్టేట ముంచుతున్నారు. కష్టపడి పండించిన పంటను కోసుకువెళ్లి.. డబ్బులు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు.

కరివేపాకు రైతులకు దగా
పంట కొని.. డబ్బులు చెల్లించని వైనం
అడిగితే బెదిరింపులు.. సెటిల్‌మెంట్లు
రూ.15 కోట్లకు పైగా ఎగవేత
పుట్లూరు, జనవరి 16(ఆంధ్రజ్యోతి): కరివేపాకు రైతులను కొందరు వ్యాపారులు నమ్మించి నట్టేట ముంచుతున్నారు. కష్టపడి పండించిన పంటను కోసుకువెళ్లి.. డబ్బులు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. పుట్లూరు మండలంలో సుమారు 20 మంది రైతులకు రూ.15కోట్ల వరకూ ఎగవేశారు. పుట్లూరు మండలంలోని చింతకుంట, బాలాపురం, పుట్లూరు, పెద్దపప్పూరు మండలం శింగనగుట్టపల్లి, చాగల్లు, ఉల్లికల్లు, తాడిపత్రి మండలం యర్రగుంటపల్లి, రావివెంకటాంపల్లి, నార్పల మండలం నార్పల, మంగపట్నం తదితర గ్రామాల రైతులకు వ్యాపారులు భారీగా బకాయిలు ఉన్నారు. ఫోన చేసినా స్పందించడం లేదని, మరికొందరు బకాయి లేదని బెదిరిస్తున్నారని రైతులు వాపోతున్నారు.
నమ్మకంతో అమ్మకం
కరివేపాకు రైతులు అడ్వాన్స తీసుకోకుండా వ్యాపారులతో విక్రయ ఒప్పందాలు చేసుకుంటారు. టన్నుకు ఇంత ధర అని ముందుగానే మాట్లాడుకుంటారు. పంటను కోసేందుకు కూలీల ఖర్చు వ్యాపారులే పెట్టుకుంటాడు. మార్కెట్‌లో పంట విక్రయించి, వారంలోగా డబ్బులు చెల్లిస్తామని నమ్మబలుకుతారు. ఆ తరువాత ఏళ్ల తరబడి డబ్బులు చెల్లించకుండా వేధిస్తున్నారు. బకాయి సొమ్ము అడిగితే.. ‘బకాయి ఉన్నట్లు బాండ్ పేపర్లు ఉన్నాయా?’ అని రైతులను దబాయిస్తున్నట్లు సమాచారం. గతంలో టన్ను కరివేపాకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకూ పలికింది. అప్పట్లో వ్యాపారులు గ్రామాలకు వచ్చి పంటను కోసుకువెళ్లారు. ఇతర రాష్ట్రాలకు తరలించి అమ్ముకున్నారు. కానీ రైతులకు పైసా చెల్లించకుండా మోసగించారు.
సెలిట్‌మెంట్లు.. బెదిరింపులు..
పంటను విక్రయించిన రైతులకు వ్యాపారులు చుక్కలు చూపిస్తున్నారు. ఒక్కో రైతుకు లక్షల్లో బకాయి ఉన్నా, ఫోనలు ఎత్తడం లేదు. ఒకే రైతుకు ఇద్దరు వ్యాపారుల నుంచి రూ.39 లక్షలకు పైగా రావాల్సి ఉంది. మరో రైతుకు ఒకే వ్యాపారి నుంచి రూ.18 లక్షలు రావాల్సి ఉంది. బాధిత రైతు అడిగితే, తాను ఇబ్బందుల్లో ఉన్నానని, రూ.లక్షకు రూ.18వేల ప్రకారం ఇస్తానని ఒప్పుకున్నట్లు సమాచారం. తాడిపత్రి మండలంలోని ఓ గ్రామంలో రైతుకు రూ.20 లక్షలు రావాల్సి ఉండగా, రూరల్ పోలీస్‌స్టేషనలో పంచాయితీ పెట్టారు. తనకు నష్టం వచ్చిందని, అంత ఇవ్వలేనని చెప్పిన వ్యాపారి.. తక్కువ మొత్తం ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు తెలిసింది. బెంగళూరుకు చెందిన వ్యాపారులే ఎక్కువగా బకాయి ఉన్నారని సమాచారం. రైతులు ఫోన చేస్తే.. కొందరు వ్యాపారులు బెదిరిస్తున్నారని సమాచారం.
బెదిరిస్తున్నారు..
తొమ్మిది ఎకరాల్లో కరివేపాకు సాగుచేశాను. మూడేళ్లపాటు బెంగళూరుకు చెందిన ఇద్దరు వ్యాపారులకు విక్రయించాను. వారి నుంచి రూ.40 లక్షలు రావాల్సి ఉంది. ఏటా రూ.10 లక్షలకు గాను రూ.లక్ష ఇచ్చి కాలం గడుపుతున్నారు. బెంగళూరుకు చెందిన కాట్రాజ్, మంజు కంపెనీ యజమానులకు ఫోన చేస్తే నన్నే బెదిరిస్తున్నారు. బాకీ లేదని, డబ్బులు ఇవ్వాలంటే బాండ్లు తెచ్చుకోవాలని దబాయిస్తున్నారు. ఈ ఏడాది కూడా పంటను సాగుచేశాను. కానీ వ్యాపారులు రాక దున్నేశాను.
- జయరామిరెడ్డి, చింతకుంట
రూ.18 లక్షలు రావాలి..
ఐదెకరాలను కౌలుకు తీసుకుని కరివేపాకు పంటను సాగుచేస్తున్నాను. బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తికి పంటను విక్రయించాను. రెండేళ్ల పంట డబ్బులు రూ.18లక్షల రావాల్సి ఉంది. అడిగితే అదిగో ఇదిగో అంటున్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఎలా అని గట్టిగా దబాయిస్తే లక్షకు రూ.10వేలు ఇస్తానని చెబుతున్నాడు. ఆ డబ్బులతో అప్పులు సగం కూడా తీరవు. ఏం చేయాలో తోచడం లేదు. పంట సాగును విడిచిపెడదామని అనుకుంటున్నాను. ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి.
- నాగరంగయ్య, బాలాపురం