TAHASILDAR: ఎన్నాళ్లీ ఇనచార్జిల పాలన..?
ABN , Publish Date - Sep 16 , 2025 | 12:00 AM
స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి రెగ్యులర్ తహసీల్దార్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్లుగా కార్యాలయంలో ఇనచార్జి అధికారులతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో ప్రజలు విసిగిపోతున్నారు. పెనుకొండ్ డివిజనలో చిలమత్తూరు మండలంలో రెవెన్యూ సమస్యలు అధికంగా ఉంటున్నాయి.
సమస్యలతో కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ప్రజలు
చిలమత్తూరు, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి రెగ్యులర్ తహసీల్దార్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్లుగా కార్యాలయంలో ఇనచార్జి అధికారులతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో ప్రజలు విసిగిపోతున్నారు. పెనుకొండ్ డివిజనలో చిలమత్తూరు మండలంలో రెవెన్యూ సమస్యలు అధికంగా ఉంటున్నాయి. ప్రధానంగా మండలం 2005 నుంచి సెజ్ పరిధిలోకి రావడంతో భూసేకరణ, పరిహారం వంటి సమస్యలు ఉంటూనే ఉన్నాయి. దానికి తోడు రియల్‌ఎస్టేట్ వ్యాపారాలు జోరుగా ఉండటంతో భూసమస్యలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. రెండేళ్లుగా కార్యాలయంలో రెగ్యులర్ తహసీల్దార్ వచ్చినా పట్టుపని నెలరోజులైనా పనిచేయడం లేదు. దాంతో కిందిస్థాయి ఉద్యోగులకు ఇనచార్జి బాధ్యతలు ఇవ్వడం, లేదా పక్క మండలాల తహసీల్దార్లకు ఉన్నతాధికారులు ఇనచార్జి బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో మండల ప్రజలు భూసమస్యల పరిష్కారం కోసం కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇటీవల రెగ్యులర్ తహసీల్దార్‌గా నటరాజ్‌ని నియమించారు. ప్రస్తుతం టేకులోడు రెవెన్యూ గ్రామంలో భూసేకరణ జరుగుతోంది. దానికి తోడు కోడూరు, శెట్టిపల్లి, చిలమత్తూరు గ్రామాల్లో భూసేకరణ పనులకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ తరుణంలో తహసీల్దార్ నటరాజ్ ఆరోగ్య సమస్యలతో 20 రోజులుగా సెలవులో ఉన్నారు. దాంతో హిందూపురం తహసీల్దార్ వెంకటేశులుకు ఇనచార్జి బాధ్యతలు అపగించారు. ఆయన హిందూపురం మండలంలో ప్రజల సమస్యలతో బీజీగా ఉంటున్నారు. ఇనచార్జి అధికారిగా చిలమత్తూరులో ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. దీనికి తోడు కార్యాలయంలో పనిచేసే కిందిస్థాయి ఉద్యోగులు సమయానికి రావడం లేదు. ఉన్న కొందరు భూసేకరణ పనుల్లో పెనుకొండ ఆర్డీఓ కార్యాలయానికి తిరగాల్సి వస్తోంది. దీంతో ప్రజలు సమస్యలతో వచ్చి అధికారుల కోసం కార్యాలయంలో పడిగాపులు పడాల్సి వస్తోంది. చిన్న పనైనా రోజుల తరబడి కార్యాలయానికి రావాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా రెగ్యులర్ తహసీల్దార్‌ని నియమించాలని మండల ప్రజలు కోరుతున్నారు.