హైవే వెహికిల్స్..!
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:38 AM
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం ఉమ్మడి జిల్లావాసులను కంటతడి పెట్టించింది. ఉదయం లేవగానే ఈ విషాదకర సంఘటన గురించి తెలుసుకుని జనం ఆవేదన చెందారు. న్యూస్ చానళ్లు, సోషల్ మీడియాలో ప్రమాద దృశ్యాలను చూసి చలించిపోయారు. జాతీయ రహదారులపై ప్రైవేట్ ట్రావెల్ బస్సులలో ప్రయాణం ...
రాత్రి ప్రయాణాలకు భద్రత కరువు
హృదయాలను
కలిచివేసిన కర్నూలు ప్రమాదం
పన్నెండేళ్ల క్రితం 45 మంది..
ఇప్పుడు 19 మంది..
ఏసీ బస్సులో బుగ్గి అయిన ప్రాణాలు
ఉమ్మడి జిల్లా నుంచి
పెరిగిన వీకెండ్ ప్రయాణాలు
భద్రత గాలికి.. ఆదాయంపైనే ట్రావెల్స్ దృష్టి
’అనంతపురం క్రైం/నెట్‌వర్క, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం ఉమ్మడి జిల్లావాసులను కంటతడి పెట్టించింది. ఉదయం లేవగానే ఈ విషాదకర సంఘటన గురించి తెలుసుకుని జనం ఆవేదన చెందారు. న్యూస్ చానళ్లు, సోషల్ మీడియాలో ప్రమాద దృశ్యాలను చూసి చలించిపోయారు. జాతీయ రహదారులపై ప్రైవేట్ ట్రావెల్ బస్సులలో ప్రయాణం అంటేనే జంకే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. బెంగళూరు-హైదరాబాదు 2013 అక్టోబరులో మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు దగ్ధమై 45 మంది సజీవ దహనమయ్యారు. పుష్కర కాలం తరువాత ఇదే నెలలో కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద మరో ఘోరం జరిగింది. బస్సులో 19 మంది సజీవ దహనమయ్యారు. ఇవి కాక అనేక ప్రమాదాలు జరిగాయి. దీంతో ట్రావెల్ బస్సులలో భద్రత గురించి మరోమారు చర్చ మొదలైంది. ఏసీ బస్సుల్లో జాతీయ రహదారిపై ప్రయాణం చేయాలంటే ఆలోచించాల్సిందేనని జనం అంటున్నారు. కొన్ని బస్సుల్లో భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని, రవాణా శాఖ అధికారులు పట్టించుకోకపోవడం లేదని అంటున్నారు. ప్రయాణికుల భద్రత గాలికి వదిలేశారని మండిపడుతున్నారు. ఈ ప్రమాదంపై జిల్లా ప్రజాప్రతినిధులు విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.
పెరుగుతున్న వీకెండ్ జర్నీలు
ఉమ్మడి జిల్లాలో వీకెండ్ ప్రయాణాలు పెరుగుతున్నాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, బీటెక్, ఎంబీబీఎస్ తదితర ఉన్నత విద్యను అభ్యసించేవారు వారాంతపు సెలవుల్లో స్వస్థలాలకు వచ్చి తిరిగి వెళుతుంటారు. వ్యాపారులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఎక్కువగా బెంగళూరు, హైదరాబాద్ నడుమ ప్రయాణాలు సాగుతున్నాయి. ఈ మార్గంలో రాత్రిళ్లు హైవేపై ప్రైవేట్ ట్రావెల్ బస్సులు సర్రున దూసుకుపోతుంటాయి. చూసేవారికి ఒళ్లు గగుర్పొడిచేంత వేగంగా ప్రయాణిస్తుంటాయి. ఉమ్మడి జిల్లావాసులు బెంగళూరు-హైదరాబాద్, బెంగళూరు- అనంతపురం, హైదరాబాద్-అనంతపురం నడుమ ఎక్కువగా ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. రాత్రి పూట ప్రయాణానికి ఏసీ స్లీపర్ కోచ బస్సులను ఎంచుకుంటారు. కునుకుతీసి లేచేలోగా గమ్యస్థానంలో ఉండొచ్చని భావిస్తారు. వీరిద్వారా ట్రావెల్ నిర్వాహకులకు భారీగా ఆదాయం సమకూరుతోంది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు రూ.1200 వరకూ రూ.1500 వరకూ వసూలు చేస్తున్నారు. వీకెండ్స్, పండుగ పూట ఇది మరింత పెరుగుతుంది. బస్సుల రేటింగ్స్, ట్రావెల్స్ రేటింగ్స్ బట్టి రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకూ వసూలు చేస్తారు. కానీ భద్రత విషయం గురించి పట్టించుకోవడం లేదు.
భద్రత ఉందా..?
అనంతపురం జిల్లాలో సుమారు 54 ప్రైవేట్ ట్రావెల్ బస్సులు నడుస్తున్నాయి. అనంతపురం నుంచి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాలకు వీటిని నడుపుతున్నారు. ఇవికాక బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన వందలాది బస్సులు జిల్లామీదుగా ప్రయాణిస్తాయి. వీటిలో భద్రతా ప్రమాణాల గురించి అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆర్టీఓ అధికారులు ప్రైవేట్ బస్సులపై మే నెలలో 31 కేసులు, జూనలో 46, జులైలో 30, ఆగస్టులో 20, సెప్టెంబరు 11, ఈ నెలలో ఇప్పటి వరకూ 26 కేసులు నమోదు చేశారు. పక్కాగా తనిఖీలు నిర్వహిస్తే మరిన్ని కేసులు నమోదవుతాయని ప్రయాణికులు అంటున్నారు.
అండగా ఉంటాం..
బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరం. ప్రయాణికులు సజీవదహనం కావడం కలచివేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా ఆదుకుంటాం. ఈ ప్రమాదం గురించి సీఎం చంద్రబాబు తెలుసుకున్నారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
-మంత్రి పయ్యావుల
అత్యంత విషాదకరం..
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రయాణికులు చనిపోవడం తీవ్రంగా కలచివేసింది. గాఢ నిద్రలో ఉన్నవారు సజీవదహనం కావడం అత్యంత విషాదకరం. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రమాద బాధిత కుటుంబాలను అదుకుంటుంది. - కాలవ శ్రీనివాసులు, ప్రభుత్వ విప్
బాధాకరం..
బస్సు ప్రమాదం బాధాకరం. ఈ ఘటన తీవ్రంగా కలవేసింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం బాధితులకు అన్ని విధాలుగా సాయం చేస్తుంది, అండగా నిలుస్తుంది.
-వెంకటశివుడు యాదవ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు
ప్రభుత్వం అండగా ఉంటుంది..
బస్సు ప్రమాదం అత్యంత బాధాకరం. ప్రయాణికులు సజీవ దహనం కావడం దురదృష్టకరం. క్షతగాత్రులు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాను. మరణించిన వారి కుటుంబీకులను ప్రభుత్వం అన్ని విధాలా అదుకుంటుంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాను.
- దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్, ఎమ్మెల్యే
అత్యంత బాధాకరం..
ప్రైవేట్ బస్సు దగ్ధమై ప్రయాణికులు మృతిచెందటం అత్యంత బాధాకరం. ప్రమాదం గురించి తెలియగానే హృదయం కలిచివేసింది. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.
- ఎంఎస్ రాజు, మడకశిర ఎమ్మెల్యే
మనోధైర్యంతో ఉండాలి..
బస్సు దుర్ఘటన అత్యంత విషాదకరం. భగవంతుడు ఆ కుటుంబాలకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా ను. ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుంది.
-గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్సీ
బస్సు ప్రమాదం కలిచివేసింది
మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్ రెడ్డి
తాడిపత్రి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం కలచివేసిందని మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. టౌన బ్యాంక్‌లో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. బస్సుల నిర్మాణంలో లోపంవల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని కొందరు మాట్లాడడం బాధాకరమని అన్నారు. తాము 1934 నుంచి బస్సులను నడుపుతున్నామని, దివాకర్ ట్రావెల్స్‌కు పేరు రావడంతోనే తాము ఈ స్థాయిలో ఉండగలిగామని అన్నారు. తమకు బస్సులంటే అమితమైన ప్రేమ అని, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా కాపాడుకుంటామని అన్నారు. గతంలో ఆలిండియా పర్మిట్ విధానం ఉండేదని, దాన్ని రద్దు చేయడంతో బస్సులపై అవగాహన లేనివారు కూడా ట్రావెల్స్‌ను నడుపుతున్నారన్నారు. సింగిల్ విధానం అమలు చేస్తే ట్రావెల్స్ తగ్గుముఖం పడతాయని అన్నారు. గతంలో కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ వారే ఎక్కువగా నడిపేవారని, ప్రస్తుతం ట్యాక్స్‌లు పెరగడంతో నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ నుంచే బస్సులు కొనుగోలు చేస్తున్నారని అన్నారు. సౌత ఇండియాలో బస్సుల నాణ్యత బాగుంటుందని, నార్త్ ఇండియాలో ప్రామాణికత సరిగా ఉండదని అన్నారు. గతంలో దివాకర్ ట్రావెల్స్ బస్సులు జబ్బార్ ట్రావెల్స్ వారికి లీజుకు ఇచ్చామని, అప్పట్లో దగ్ధమైన బస్సు తమ పేరిట ఉన్నందున చనిపోయినవారి కుటుంబాలకు పరిహారం చెల్లించామని అన్నారు.
వెనుకవైపు ద్వారం ఉండాలి..
దూరప్రాంతాలకు రాత్రిపూట ప్రయాణించే ఓల్వో బస్సులకు వెనుకవైపు కూడా డోర్ ఏర్పాటు చేయాలి. బస్సులోకి ఎక్కిన ప్రయాణికులకు ఎమర్జెన్సీ ద్వారం ఎక్కడుందో చూపించాలి. దాన్ని తెరిచే విధానం గురించి నేర్పించాలి. బస్సు తలుపుల వద్ద క్లీనర్ ఉండాలి. బస్సు ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ని ప్రయాణికుల టిక్కెట్‌తోపాటు అందించాలి. ఇద్దరు డ్రైవర్లు తప్పనిసరిగా ఉండాలి. బస్సుల కిందిభాగాన ఎక్కువ శాతం లగేజీతో నింపేసి ఉంటారు. అగ్ని ప్రమాదాలు జరిగితే వెంటనే బస్సు మొత్తం మంటలు వ్యాపిస్తాయి.
- నాగలత, హిందూపురం
దిగ్ర్భాంతికి గురి చేసింది..
బస్సు ప్రమాదం దిగ్ర్భాంతికి గురి చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
-లక్ష్మీనారాయణ, రాష్ట్ర వక్కలిగ కార్పొరేషన చైర్మన
అర్ధరాత్రి.. అతివేగం..
నేను పట్టుచీరల వ్యాపారం చేస్తుంటా. తరచూ వ్యాపారం నిమిత్తం విజయవాడ, హైదరాబాద్, బెంగళూరుకు వెళ్తుంటాను. ఎక్కువగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తుంటాను. అర్ధరాత్రి బస్సులు అతివేగంతో ప్రయాణిస్తుంటాయి. దీనివల్ల మంచి నిద్ర సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. బస్సు కండిషన గురించి అధికారులు, యజమానులు పట్టించుకోవడం లేదు. వేగ నియంత్రణపై దృష్టి పెట్టాలి. లేదంటే ప్రమాదాలు కొనసాగుతాయి.
-జింకా పురుషోత్తం, పట్టుచీరల వ్యాపారి, ధర్మవరం
ఓవర్ టేక్‌తోనే ప్రమాదాలు..
నేను బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాను. వారాంతపు సెలవుల్లో స్వగ్రామానికి వచ్చి వెళుతుంటాను. ప్రైవేటు బస్సులలో టిక్కెట్ ధర ఎక్కువ. కానీ అందుకు తగ్గట్టు వసతులు, భద్రత ఉండవు. ఓవర్ టేక్ చేసే క్రమంలో అతివేగంగా బస్సులు నడుపుతున్నారు. దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి, ప్రయాణికుల భద్రతకు చర్యలు చేపట్టాలి.
-ప్రకాశ, కొత్తచెరువు