Share News

Rain : దంచికొట్టిన వాన

ABN , Publish Date - Aug 11 , 2025 | 12:56 AM

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం రాత్రి, ఆదివారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. తాడిపత్రి నియోజకవర్గంలో కుండపోతగా కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలుచోట్ల రోడ్లు తెగిపోవడంతో ..

Rain : దంచికొట్టిన వాన
Rain Water in nitturu vanka

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వర్షం

తాడిపత్రిలో కుండపోత

పొంగిపొర్లిన వంకలు, వాగులు

తెగిన వంతెనలు

కూలిన ఇళ్లు

తాడిపత్రి/అనంతపురం అర్బన/పుట్టపర్తి రూరల్‌/కొత్తచెరువు/పెనుకొండ రూరల్‌/, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం రాత్రి, ఆదివారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. తాడిపత్రి నియోజకవర్గంలో కుండపోతగా కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలుచోట్ల రోడ్లు తెగిపోవడంతో వాహన రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. పలు ఇళ్లు కూలడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

తాడిపత్రిలో వర్ష బీభత్సం

తాడిపత్రి మండలంలో భారీ వర్షం కురిసింది. బుగ్గ సమీపంలో తాడిపత్రి-నంద్యాల రోడ్డు తెగిపోవడంతో ట్రాఫిక్‌ కిలోమీటర్ల మేర స్తంభించింది. 4గంటలపాటు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అనంతరం అధికారులు వాటిని పైపుల ద్వారా పూడ్చి రాకపోకలకు అంతరాయం లేకుండా చూశారు. ఆవులతిప్పాయపల్లి సమీపంలో జీపు వంక దాటుతుండగా కొట్టుకుపోయింది. డ్రైవర్‌ ఒడ్డుకు


చేరుకుని, ప్రాణాలు కాపడుకున్నాడు. ఆలూరుకోన రంగనాథస్వామి ఆలయ సమీపంలో తెల్లవారుజామున కురిసిన వర్షానికి కొండచరియలు విరిగిపడడంతో ఆ బురద మట్టిలో వాహనాలు కూరుకుపోయాయి. తాడిపత్రిలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. లక్ష్మీనారాయణటాకీ్‌సలోకి వర్షపునీరు చేరింది.

- పుట్లూరు మండలంలోని ఎస్‌. తిమ్మాపురం గోడౌన వద్ద తక్కళ్లపల్లికి వెళ్లే కల్వర్టు వర్షానికి కూలిపోయింది. దీంతో తక్కళ్లపల్లి నుంచి తాడిపత్రికి రాకపోకలు స్తంభించిపోయాయి. మండలవ్యాప్తంగా భారీ వర్షం కురవడంతో వంకలు పొంగి పొర్లాయి.

- పెద్దవడుగూరులో వర్షానికి పీర్లచావిడి పైభాగం ఆదివారం ఉదయం కూలిపోయింది. నిత్యం పీర్లచావిడి కట్ట వద్ద పదుల సంఖ్యలో జనం కూర్చునేవారు. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

- యల్లనూరు మండలంలో తాడిపత్రికి వెళ్లే ప్రధాన రహదారిపై నిట్టూరు గాండ్లపాడు, గన్నేరుపల్లి వంకలు ఉధృతంగా ప్రవహించడంతో ఉదయం 10 గంటల వరకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం మధ్యాహ్నం 1గంటల ప్రాంతంలో పెద్దపెద్ద ఉరుములతో కూడిన వర్షం కురవడంతో వంక మరోసారి ఉధృతంగా ప్రవహించింది. దీంతో చిత్రావతి నదిలో ప్రవాహం భారీగా పెరిగింది.

చిత్రావతి పరవళ్లు

ధర్మవరం: మండలంలోని పోతులనాగేపల్లి వద్ద చిత్రావతి నది ఉధృతంగా పారుతోంది. బుక్కపట్నం, చెన్నేకొత్తపల్లి మండలాల నుంచి వర్షపునీరు ధర్మవరం చెరువుకు చేరుతోంది. దీంతో నదికి నీటి ప్రవాహం పెరిగింది. పోతులనాగేపల్లి వద్ద నది ఉధృతంగా ప్రవహించడంతో కనంపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి.

- పెనుకొండ మండలంలోని మునిమడుగు గ్రామంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో గ్రామస్థులు ఇబ్బందులు పడ్డారు. ఇటీవల సీసీ రోడ్డు నిర్మించి, డ్రైనేజీ కాలువలు నిర్మించకపోవడమే ఈ దుస్థితికి కారణమని వారు వాపోయారు.

వర్షపాతం నమోదు ఇలా..

ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో శనివారం పదును వర్షం పడింది. కొత్తచెరువులో అత్యధికంగా 7.64 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తాడిపత్రి 7.2, నార్పల 6.6, నల్లమాడ మండలంలో 6.52 సెం.మీ., బుక్కపట్నంలో 5.90 సెం.మీ., పుట్టపర్తి 5.86, పుట్లూరు 5.8, యల్లనూరు 5.6, శెట్టూరు 5.5, గాండ్లపెంట 5.44, ఓబుళదేవరచెరువు 5.42, రొద్దం 5.16, తాడిమిర్రి 4.72, సోమందేపల్లి 4.70, పెనుకొండ 4.46, తనకల్లు 4.46, నల్లచెరువు 4.42, చెన్నేకొత్తపల్లి 4.26, గుడిబండ 4.12, గోరంట్ల 3.82, బత్తలపల్లి 3.62, మడకశిర 3.56, ధర్మవరం 3.46, ముదిగుబ్బ 3.22, పరిగి 3.04, గుమ్మఘట్ట 2.8, కదిరి 2.68, హిందూపురం 2.18, కంబదూరు 1.9, లేపాక్షి 1.82, రాయదుర్గం 1.7, రొళ్ల 1.54, తలుపుల 1.22, చిలమత్తూరు 1.20, అగళి 1.18, కనగానిపల్లి 1.02, రామగిరి 0.28 సెం.మీ. వర్షం కురిసిందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు.

Updated Date - Aug 11 , 2025 | 12:56 AM