Share News

LAYOUTS: అసౌకర్యాల నడుమ ప్రభుత్వ లే అవుట్లు

ABN , Publish Date - Dec 16 , 2025 | 12:06 AM

మండల వ్యాప్తంగా ఐదేళ్ల క్రితం మంజూరైన ప్రభుత్వ లేఅవుట్లలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఏ లేఅవుట్‌లోచూసినా మట్టిరోడ్లు, ముళ్లకంపలు, పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయి. గత యేడాది ప్రభుత్వ లేఅవుట్లను పేరు మార్చుతూ ఎన్టీఆర్‌నగర్‌లుగా ప్రభుత్వం జీవో జారీచేసింది.

LAYOUTS: అసౌకర్యాల నడుమ ప్రభుత్వ లే అవుట్లు
Earthen road in the government layout at Chakarlapalli

ఇళ్ల నిర్మాణానికి ముందుకురాని పేదలు

నిరుపయోగంగా మారుతున్న కాలనీలు

సోమందేపల్లి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా ఐదేళ్ల క్రితం మంజూరైన ప్రభుత్వ లేఅవుట్లలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఏ లేఅవుట్‌లోచూసినా మట్టిరోడ్లు, ముళ్లకంపలు, పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయి. గత యేడాది ప్రభుత్వ లేఅవుట్లను పేరు మార్చుతూ ఎన్టీఆర్‌నగర్‌లుగా ప్రభుత్వం జీవో జారీచేసింది. ఇంతవరకు ఎన్టీఆర్‌ నగర్‌లో సీసీరోడ్లు, డ్రైనేజీలను ఏర్పాటు చేయలేదు. పల్లె పండుగలో భాగంగా సోమందేపల్లి మండల వ్యాప్తంగా రూ.4.37కోట్లుతో సీసీరోడ్లు, డ్రైనేజీలను నిర్మించారు. పట్టణంలో ప్రతి కాలనీలో వందకోట్లతో సీసీరోడ్లు, డ్రైనేజీలను కూటమి ప్రభుత్వం చేపడుతోంది. అయితే ప్రభుత్వ లేఅవుట్లను విస్మరించడంతో ఇల్లు నిర్మించేందుకు లబ్ధిదారులు ముందుకు రావడంలేదనే విమర్శలున్నాయి. ప్రభుత్వ లేఅవుట్లలో ఇప్పటికే ఇల్లు నిర్మించుకున్న పేదలు రోడ్లు, డ్రైనేజీలు లేక అవస్థలు పడుతున్నారు. విద్యుత, నీటి సౌకర్యం ఉన్నా రహదారులు లేకపోవడంతో సగానికిపైగా ఇళ్లు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు పూర్తీచేయించేందుకు మనఇల్లు మన గౌరవం పేరుతో కార్యక్రమం చేపట్టింది. అలాగే ఇల్లు కట్టుకోవడానికి ముందుకొస్తే లబ్ధిదారులకు అదనపు సహాయంకూడా అందిస్తామని ప్రకటించింది. అయినా పేదలు ఆసక్తిచూపడంలేదు. ఈ దశలో ఖాళీగా ఉన్న ప్లాట్లు, అర్ధాంతరంగా ఆగిన ఇళ్లను పూర్తీచేసుకోవాలని ఓ పక్క ప్రభుత్వం అధికారుల ద్వారా ఒత్తిళ్లు తెస్తుంది. అప్పోసప్పో చేసి ఇల్లుకట్టుకున్నవారు పరిసరాలు భయానకంగా ఉండటంతో అక్కడ కాపురం ఉండటానికి ఇష్టపడటంలేదు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని అంటున్నాయి. ఇలాంటి అసౌకర్యాల నడుమ ఎవరైనా ఎలా కాపురం ఉంటారని ప్రశ్నిస్తున్నారు. మండల వ్యాప్తంగా సోమందేపల్లిలో ప్రభుత్వం 9 లేఅవుట్లను ఏర్పాటుచేసింది. బుసయ్యగారిపల్లిలో 21ప్లాట్లు, మాగేచెరువులో 44, సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి 70ప్లాట్లు, సోమందేపల్లి నక్కలగుట్టకాలనీలో 70, చాకర్లపల్లి 693, పందిపర్తి 43, కేతగానిచెరువు 42, చాలకూరు-1లో 18, చాలకూరు-2లో 48 ప్లాట్లు కేటాయించింది. వీటిలో సగానికిపైగా నిర్మాణాలు వివిధ దశల్లో ఆగిపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ లేఅవుట్లలో సీసీరోడ్లు, డ్రైనేజీ నిర్మించాలని పేద ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Dec 16 , 2025 | 12:06 AM