Share News

GAS CYLINDER: గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీకి ఐదురోజులా..?

ABN , Publish Date - Sep 06 , 2025 | 12:21 AM

మండలంలోని గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాకులు సిలిండర్‌ ధర మీద అదనంగా వసూలు చేస్తూ వినియోగదారులపై అదనపు భారం మోపుతున్నారు. గృహ వినియోగం కోసం సరఫరా చేసే సిలిండర్లను కమర్షియల్‌ కోసం వాడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్యాస్‌ లేనిదే ఇంట్లో ఎలాం టి పనులు జరగవు.

GAS CYLINDER: గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీకి ఐదురోజులా..?
A scene of gas cylinders being supplied

రసీదు రూ.922 వసూలు రూ.970

బుక్‌ చేయకపోతే రూ.1050

బొమ్మనహాళ్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాకులు సిలిండర్‌ ధర మీద అదనంగా వసూలు చేస్తూ వినియోగదారులపై అదనపు భారం మోపుతున్నారు. గృహ వినియోగం కోసం సరఫరా చేసే సిలిండర్లను కమర్షియల్‌ కోసం వాడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్యాస్‌ లేనిదే ఇంట్లో ఎలాం టి పనులు జరగవు. గ్యాస్‌ ఇంటికి రావడానికి ఐదు రోజులు సమయం పడుతోంది. ఫాస్టుఫుడ్‌ సెంటర్లు, హోటళ్లకు మాత్రం గంటలో డెలివరీ చేస్తున్నారు. ఇంటికి గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ కావాలంటే ఐదు రోజులు పడుతుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం సిలిండర్లను డెలివరీ బాయ్స్‌, ఏజెన్సీ నిర్వాహకులు బయట అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు నిద్రమత్తులో జోగుతున్నారని ప్రజలు ఆగ్రహిస్తున్నారు. మండలంలో 8 వేలకు పైగా గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతిరోజు 300 నుంచి 350 వరకు సిలిండర్లు సేల్స్‌ అవుతున్నాయి. ఏజెన్సీ నిర్వాహకులు ఆటోల ద్వారా గ్రామాలకు సరఫరా చేస్తుంటారు. నిర్వాహకులు మాత్రం డెలివరీ చార్జీల పేరుతో వినియోగదారులపై అదనపు భారం మోపుతున్నారు. ఇంటికి వచ్చి సిలిండర్‌ డెలివరీ చేస్తే బిల్‌ మీద ఉన్నదాని కంటే రూ. 50 నుంచి రూ.100 అదనంగా వసూలు చేస్తున్నారు. ఒకవేళ ఇవ్వకుంటే అలాస్యంగా డెలివరీ చేయడం, లేదా మీ ఇంటికి బీగం వేశారని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల సరైన సమయంలో సిలిండర్‌ అందడం లేదని సామాన్యులు వాపోతున్నారు.


మామూళ్ల మత్తులో అధికారులు

ఇంటి అవసరాలకు వాడుకునే వంట గ్యాస్‌ను కమర్షియల్‌కు వాడుతుంటే ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇందుకు అధికారులు కూడా మామూళ్లు తీసుకుని వదిలేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వంట గ్యాస్‌ అక్రమంగా అమ్ముతుంటే ఎందుకు అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అదనంగా వసూలు చేస్తున్నారు

- లక్ష్మి, శ్రీధరఘట్ట

గ్యాస్‌ సిలండర్‌ బుక్‌ చేసుకోగా డెలివరీకి రూ.1000 తీసుకున్నారు. రసీదులో రూ.922 మాత్రమే ఉంది. అదేమని అడిగితే బిల్లు ధర ఉండేది ఇస్తే డీజిల్‌ బావి మా ఇంట్లో ఉందా ఎదురు ప్రశ్నిస్తున్నారు. డీజిల్‌ రేట్లు పెరిగడంతో డెలివరీ చార్జీలు పెంచామని అంటున్నారు.

బుక్‌ చేసిన 5 రోజులకు వచ్చారు

- ఉమాదేవి, గోవిందవాడ

1వ తేదీన గ్యాస్‌ బుక్‌ చేశాను. ఐదురోజులకు ఇంటి వచ్చారు. నాలుగురోజులు డబ్బు ఉంచుకున్నా. 5వ రోజు వచ్చి సిలిండర్‌ తీసుకోవాలని అడిగారు. డబ్బు లేకపోవడంతో సిలిండ్‌ తీసుకోలేదు. అయితే సిలిండర్‌ డెలివరీ అయినట్లు ఫోనకు మేసేజ్‌ వచ్చింది. ఈ నెల సిలిండర్‌ రానట్లే.

అదనంగా వసూలు చేస్తే చర్యలు

- మునివేలు, తహసీల్దార్‌

వినియోగదారుల నుంచి గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ చార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం. అలా వసూలు చేసినట్లు తమ దృష్టికి వస్తే కేసులు నమోదు చేస్తాం. వినియోగదారులు బాయ్స్‌కు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు.

Updated Date - Sep 06 , 2025 | 12:21 AM