Share News

LAND DISPUTE: తీరని రస్తా వివాదం

ABN , Publish Date - Nov 29 , 2025 | 12:06 AM

అసలే ఆ గ్రామం ప్యాక్షనతో ఇబ్బందుల పాలైంది. ఇటీవలి కాలంలో ఎలాంటి తగాదాలు, సమస్యలు లేకుండా ప్రజలు సుఖశాంతులతో జీవించారు. ఇలాంటి తరుణంలో మళ్లీ గ్రామప్రజలకు కునుకు లేకుండా చేస్తోంది రస్తా సమస్య. మండలంలోని చిల్లకొండయ్యపల్లి గ్రామంలో గడచిన 50 సంవత్సరాలుగా వాడుతున్న రస్తాను వారం రోజులక్రితం గ్రామానికి చెందిన ఒక మహిళా రైతు రస్తాలేదంటూ దారికి అడ్డుగా గుంత తీయించింది.

LAND DISPUTE: తీరని రస్తా వివాదం
Police inspecting the problematic road

ఫ్యాక్షన గ్రామంలో మళ్లీ సమస్యలు వచ్చేనా?

తాడిమర్రి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): అసలే ఆ గ్రామం ప్యాక్షనతో ఇబ్బందుల పాలైంది. ఇటీవలి కాలంలో ఎలాంటి తగాదాలు, సమస్యలు లేకుండా ప్రజలు సుఖశాంతులతో జీవించారు. ఇలాంటి తరుణంలో మళ్లీ గ్రామప్రజలకు కునుకు లేకుండా చేస్తోంది రస్తా సమస్య. మండలంలోని చిల్లకొండయ్యపల్లి గ్రామంలో గడచిన 50 సంవత్సరాలుగా వాడుతున్న రస్తాను వారం రోజులక్రితం గ్రామానికి చెందిన ఒక మహిళా రైతు రస్తాలేదంటూ దారికి అడ్డుగా గుంత తీయించింది. ఆలస్యంగా స్పందించిన రెవెన్యూ సిబ్బంది గురువారం అక్కడికి చేరుకుని సమస్యపై ఆరాతీసి ఇక్కడ రస్తా ఉందని తెలియజేసి అడ్డుగా వేసిన మట్టిని తొలగించి మహిళా రైతుకు చెప్పివచ్చారు. సాయంత్రానికే మళ్లీ ఆ రైతు దారికి అడ్డుగా కంపవేయించి మట్టివేసింది. ఈ దారి లేకపోవడం వల్ల 70 మంది రైతులు పొలాలకు వెళ్లడానికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రెవెన్యూ సిబ్బంది స్పందించి సదరు రైతుపై ఫిర్యాదు చేస్తే తాము రెవెన్యూ సిబ్బందికి తోడుగా వచ్చి సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నా పోలీసులకు ఎందుకో ఫిర్యాదు చేయడంలేదు. అసలే ప్యాక్షన గ్రామం కావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. పోలీసులు మాత్రం రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేస్తే తప్ప.. సమస్యను పరిష్కరించలేమని అంటున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అఽధికారులు స్పందించి ఒకరిపై ఒకరు చెప్పుకోకుండా సమస్యను పరిష్కరించి గ్రామంలో ప్రశాంతంగా ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Nov 29 , 2025 | 12:06 AM