DRAIN: డ్రైనేజీలు అస్తవ్యస్తం
ABN , Publish Date - Sep 12 , 2025 | 12:06 AM
మండలంలోని పలు గ్రామాల్లో డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయి. మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తున్నాయి. దీంతో రోడ్డుంతా దుర్వాసతో వెదజల్లుతోందని ఆయా గ్రామస్థులు వాపోతున్నారు. నాగలూరు గ్రామంలో ఇళ్లమధ్యనే మురుగునీరు నిలిచాయి. డ్రైనేజీలో నీరు పారక ఎక్కడిక్కడ స్తంభించాయి.
దుర్వాసనతో గ్రామస్థుల ఇబ్బందులు
పట్టించుకోని అధికారులు
ధర్మవరంరూరల్, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయి. మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తున్నాయి. దీంతో రోడ్డుంతా దుర్వాసతో వెదజల్లుతోందని ఆయా గ్రామస్థులు వాపోతున్నారు. నాగలూరు గ్రామంలో ఇళ్లమధ్యనే మురుగునీరు నిలిచాయి. డ్రైనేజీలో నీరు పారక ఎక్కడిక్కడ స్తంభించాయి. మురుగునీరు పారక రోడ్డుపై ప్రవహిస్తోంది. దుర్వాసన భరించలేకున్నామని గ్రామస్థులు వాపోతున్నారు. దీనికితోడు దోమలు అధికమై అల్లాడుతున్నామని రాత్రివేళాల్లో నిద్రకూడా కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిగిచెర్ల గ్రామం లో రహదారిపై నీరు నిల్వఉండటంతో అడుగువేయలేని దుస్థితి నెలకొంది. మంచినీటి కొళాయిలు వద్ద మురుగునీరు నిలిచి తాగునీరు కలుషితమవుతున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. డ్రైనేజీల్లో మురుగునీరు ఎక్కడిక్కడ నిలిచిపోవడంతో దుర్వాసనతో పాటు దోమలు అధికమవుతున్నాయన్నారు. దోమలతో విషజ్వరాలబారిన పడే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులకు తెలిపినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సీజనల్ వ్యాధుల ప్రబలుతున్న దృష్ట్యా దోమలు ఉత్పత్తి కాకుండా చర్యలు తీసుకోవాలని, కనీసం బ్లీచింగ్ చల్లాలని ప్రజలు కోరుతున్నారు. మండల అధికారులు స్పందించి డ్రైనేజీలను శుభ్రం చేయించి మురుగునీరు రోడ్డుమీదకు రాకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు
-వెంకటేష్, డిప్యూటీ ఎంపీడీఓ, ధర్మవరం
గ్రామాల్లో డ్రైనేజీలు పరిశుభ్రం చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే పలు గ్రామాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాం. గ్రామాల్లో విషజ్వరాలు రాకుండా దోమల నివారణకు చర్యలు తీసుకుంటాం. సీజనల్ వ్యాధుల దృష్ట్యా ప్రతి గ్రామంలో పారిశుధ్య పనులు చేపడతాం.