Division ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపాలి
ABN , Publish Date - Jan 06 , 2025 | 11:44 PM
ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స)కు వచ్చే ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపాలని అధికారులను కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం డివిజన స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు.

కలెక్టర్ వినోద్‌కుమార్
శింగనమలలో డివిజన స్థాయి గ్రీవెన్స
శింగనమల, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స)కు వచ్చే ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపాలని అధికారులను కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం డివిజన స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈకార్యక్రమానికి కలెక్టర్‌తో పాటు జేసీ శివనారాయణ్ శర్మ, ఎమ్మెల్యే బండారు శ్రావణి, డీఆర్‌ఓ మలోల, అస్టిసెంట్ కలెక్టర్ వినూత్న, డిప్యూటి కలెక్టర్ శిరీష, ఆర్డీఓ కేశవనాయుడు ఇతర జిల్లా అధికారులు హాజరయ్యారు. వివిధ సమస్యలపై 510 ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, 45 రోజల్లోపు పరిష్కరిస్తామన్నారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యలు సులభవంగా పరిష్కరించుకోవడానికి ఇలాంటి వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
సమస్యలపై నాయకుల వినతులు
శింగనమల మరువకొమ్మ వద్ద జాతీయ రహదారిపై బ్రిడ్జి ఏర్పాటు చేయాలని రాష్ట్ర తెలుగుయవత అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు, శింగనమల గ్రామస్థులు అర్జీ ఇచ్చారు.
పంచాయతీ అభివృద్ధికి నిధులు కేటాయించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ చాంబర్ కార్యనిర్వహణ కార్యదర్శి డేగల కృష్ణమూర్తి అర్జీ అందజేశారు
రీసర్వేలో తప్పులు తడకగా చేశారని, మళ్లీ చేసే సర్వేను ఉచితంగా చేయాలని సీపీఎం నాయకులు ఓబుళు, భాస్కర్ అధికారులకు వినతి పత్రం అందజేశారు.
శింగనమలను కరువు మండలంగా ప్రకటించాలని సీపీఐ మండల నాయకులు నారాయణస్వామి చిన్నప్పయాదవ్ వినతి పత్రం అందజేశారు.
20 ఏళ్ల నుంచి సమస్య పరిష్కారం కాలేదు
: చిన్న జలాలపురం రైతులు
మండలంలోని వెస్టునరసాపురం రెవెన్యూ పొలంలో సర్వే నంబర్లు 179-1333,185,182,330లో చిన్నజలాలపురం గ్రామానికి చెందిన బీసీ రైతులు 15 మందికి 40 ఏళ్ల కిందట డీపట్టాలు ఇచ్చారు. అప్పటి నుంచి వారే సాగులో ఉన్నారు. అయితే 20ఏళ్ల కిందట ప్రస్తుత వైసీపీ నాయకుడు అంజిల్‌రెడ్డి గురుగుంట్ల గ్రామానికి చెందిన కొందరికి అదే భూమిపై రీసర్వే నంబర్లతో పట్టాలు ఇప్పించాడు. వారు ఆ పొలాన్ని ఆనలైనలోకి ఎక్కించుకుని బ్యాంకులో రుణాలు కూడా తీసుకున్నారు. రుణం కోసం మేము బ్యాంకుకు వెళితే ఈ విషయం బయటపడింది. దీంతో అప్పటి నుంచి మా భూములు మాకే చెందేటట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకుని పోయిన సమస్య పరిష్కారం కాలేదని రైతులు నరసింహులు, పెద్దన్న శేషాద్రి అధికారుల దృష్టి తీసుకుని వెళ్లారు.
12 ఎకరాల భూమిని ఆక్రమించారు: దాసరి లక్ష్మిదేవి, చింతకుంట గ్రామం, పుట్లూరు మండలం
మా 12 ఎకరాల భూమిని రామసుబ్బారెడ్డి అనే భూస్వామి 40 ఏళ్లుగా ఆక్రమించుకుని అనుభవిస్తున్నాడు. చింతకుంట రెవెన్యూ పొలం సర్వేనంబర్ 1278లో మా మామ దాసరి నరప్పపేరు మీద 13.75 ఎకరాల భూమి ఉంది. ఇందులో 77 సెంట్లు కాలువ ఉండేది. అయితే గత 40 ఏళ్ల కిందట గ్రామానికి చెందిన రామసుబ్బారెడ్డి మా మామ నుంచి అక్రమంగా లాక్కున్నాడు. అప్పటి నుంచి ఈ సమస్యపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదు. కలెక్టరే మా సమస్య పరిష్కరించాలి.
మా అన్నలే బెదిరిస్తున్నారు: అంధుడు మంజునాయక్, బొమ్మగాని తండా, బ్రహ్మసముద్రం మండలం
మా ఐదుగురు అన్నదమ్ములకు బొమ్మగాని తండాలో సర్వే నంబర్లు 118, 119లో 12.40 ఎకరాలు ఉంది గత ఐదేళ్ల కిందట నా అన్నలు నాకు రావలసిన 2.40 ఎకరాలను కూడా వారే తీసేసుకున్నారు. పొలం వద్దకు వెళితే కొట్టి, బెదిరిస్తున్నారు. నా భూమి నాకు ఇప్పించండి.