Share News

Disabled pensions దివ్యాంగ పింఛన్లను పునరుద్ధరించాలి

ABN , Publish Date - Aug 26 , 2025 | 12:39 AM

తొలగించిన తమ పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని దివ్యాంగులు డిమాండ్‌ చేశారు. మండలంలోని పింఛన తొలిగిస్తున్నట్లు 370 మంది దివ్యాంగులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దీంతో దివ్యాంగులు ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు లోనై సోమవారం మండలకేంద్రానికి తరలివచ్చి అనంతపురం - తాడిపత్రి రహదారిపై బైఠాయించి పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు.

Disabled pensions  దివ్యాంగ పింఛన్లను పునరుద్ధరించాలి

బుక్కరాయసముద్రం, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): తొలగించిన తమ పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని దివ్యాంగులు డిమాండ్‌ చేశారు. మండలంలోని పింఛన తొలిగిస్తున్నట్లు 370 మంది దివ్యాంగులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దీంతో దివ్యాంగులు ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు లోనై సోమవారం మండలకేంద్రానికి తరలివచ్చి అనంతపురం - తాడిపత్రి రహదారిపై బైఠాయించి పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు.


దాదాపు గంటకు పైగా రోడ్డుపై బైఠాయించడంతో భారీగా స్తంభించిపోయాయి. నిరసన విరమించి సహకరించాలని సీఐ పుల్లన్న, ఎస్‌ఐ రామ్‌ప్రసాద్‌, తహసీల్దార్‌ శ్రీధర్‌మూర్తి దివ్యాంగులను కోరారు. అయితే వారు ససేమిరా అంటూ భీష్మించుకు కూర్చున్నారు. వెంటనే మా పింఛన్లు పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. అంతవరకు ధర్నా విరమించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు వికలాంగుల సంఘం యూనియన అధ్యక్షుడు నరసింహారెడ్డితో పాటు మరికొంతమంది దివ్యాంగులను బలవంతంగా అరెస్టు చేశారు. దీంతో పో లీసులకు , దివ్యాంగులకు మధ్య ఉధ్రిక్తత వాతావరణం ఏర్పడింది. తమ పింఛన్లు తొలిగించడం న్యాయమంటారా అంటూ దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ కారణాలను సాకుగా చూపుతూ తొలిగించిన పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. పింఛన్ల ద్వారా వచ్చే డబ్బుతోనే జీవనం సాగిసున్నామని, ఇప్పుడు ప్రభుత్వం తమ పొట్టకొట్టడం ఎంత వరకు సమంజసమని వాపోయారు. దివ్యాంగులను ఇబ్బంది పెట్టేలా సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సరైనది కాదన్నారు. అనంతరం పోలీసులు వారిని వదలిపెట్టగా.. వారు తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు వెళ్లారు. అక్కడ వారితో ఎంపీడీఓ సాల్మన రాజ్‌ మాట్లాడారు. అర్హత ఉన్న వారి పింఛన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించమన్నారు. అర్హులు సదరం సర్టిఫికెట్‌ కోసం తాజాగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. నోటీసులు వచ్చి 100 శాతం లేదా 40 శాతం పైన వికలత్వం కలిగిన దివ్యాంగులందరూ ఎంపీడీఓ కార్యాలయంలో వినతి పత్రాలు ఇవ్వాలని సూచించారు. అర్హులందరికీ న్యాయం చేస్తామన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని సూ చించారు. కార్యక్రమంలో మండలంలోని దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Aug 26 , 2025 | 12:39 AM