MANDAKRISHNA త్వరలోనే వర్గీకరణ ఫలాలు
ABN , Publish Date - Feb 23 , 2025 | 12:31 AM
ఎస్సీ వర్గీకరణ కోసం సాగించిన మూడు దశాబ్దాల పోరాట ఫలాలను త్వరలోనే అందుకోబోతున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియపై శనివారం రాష్ట్రస్థాయి సమావేశాన్ని నిర్వహించారు.

కమిషన నివేదిక పట్ల అప్రమత్తంగా ఉండాలి
ప్రజాప్రతినిధులు, ఉద్యోగులతో చర్చించాలి
మ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
అనంతపురం సెంట్రల్, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణ కోసం సాగించిన మూడు దశాబ్దాల పోరాట ఫలాలను త్వరలోనే అందుకోబోతున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియపై శనివారం రాష్ట్రస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. నగరంలో ఏర్పాటు చేసిన సమావేశానికి వివిధ జిల్లాల నుంచి ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ అనుబంధ సంఘాల ప్రతినిధులు తరలివచ్చారు. ముఖ్య అథితులుగా హాజరైన మందక్రిష్ణ మాదిగ, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజును గజమాలతో సత్కరించారు. అనంతరం మందక్రిష్ణ మాట్లాడుతూ.. వర్గీకరణ సాధనలో మాదిగల సాంప్రదాయ వాయిద్యమైన డప్పు ప్రధాన ప్రాత్ర పోషించిందన్నారు. కమిషన నివేదక ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం జాప్యాన్ని ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. లక్ష డప్పులు, వేల గొంతుకల కార్యక్రమానికి పిలుపునివ్వడంతో దిగివచ్చిన సర్కార్ వేగవంతం చేయడం ఇందుకు నిదర్శనం అన్నారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో అమరులైన కార్యకర్తల త్యాగాలను స్మరించుకునేందుకు మార్చి 1 మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు. నెలల తరబడి జిల్లావారిగా సదస్సులు నిర్వహించి అభిప్రాయాలను, వినతులను స్వీకరించిన కమిషన నివేదిక సమర్పణ చివరి అంకానికి చేరుకుందన్నారు. ఈ సమయంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరముందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ సామాజిక ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులతో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చొరవతో ముప్పై ఏళ్ల పోరాటం సాకారం కాబోతోందని హర్షాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. మాదిగలకు మందక్రిష్ణ ఆత్మస్థైర్యమని తెలిపారు. నమ్ముకున్న సిద్ధాంతాన్ని సాధించేందుకు మూడు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం చేసిన నాయకత్వం మందక్రిష్ణకే దక్కిందన్నారు. ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు నాగరాజు, రాష్ట్ర అధ్యక్షుడు సురేష్, ఎమ్మెస్పీ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్, ఎంఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బిక్షాలు, జాతీయ నాయకులు సురేంద్రబాబు, నాయకులు శంకర్, గంగాధర్, హరిగోపాల్, కదిరప్ప, రమేష్, ఆంజనేయులు, నాగేంద్ర, మధుసూదన పాల్గొన్నారు.
నిషార్ సేవలు చిరస్మరణీయం: ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ ఉద్యమాల్లో నిరంతరం పనిచేసిన నిషార్ సేవలు చిరస్మరణీయమని మందకృష్ణ మాదిగ కొనియాడారు. ఎర్రనేల కొట్టాలలోని నిషార్ ఇంటికెళ్లి అతడి భార్య, కుమారుడు, కూతురిని మందక్రిష్ణ పరామర్శించారు. ఇద్దరు పిల్లలకు చదువు, ఉద్యోగం బాధ్యతలను తీసుకుని ప్రయోజకులుగా తీర్చిదుద్దుతామని హామీ ఇచ్చారు. బీసీఆర్ దాస్‌తో కలిసి ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు శంకర్, సూరి, నరసింహులు, నాగమ్మ, శాంతి, పద్మావతి పాల్గొన్నారు.