చంద్రన్న అభయం
ABN , Publish Date - Sep 21 , 2025 | 12:48 AM
నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభయమిచ్చారు. కళ్యాణదుర్గానికి నీరిచ్చే భైరవానతిప్ప ప్రాజెక్టు (బీటీపీ) కాలువల నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామని అసెంబ్లీలో ప్రస్తావించారు. దీంతో నియోజకవర్గంలో ప్రజలు, రైతుల్లో హర్షాతిరేకాలు ...
రెండేళ్లలో బీటీపీ కాలువల నిర్మాణం పూర్తి చేస్తాం
అసెంబ్లీలో సీఎం ప్రకటన ఫ కళ్యాణదుర్గంలో హర్షాతిరేకాలు
కళ్యాణదుర్గం, సెప్టెంబరు20(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభయమిచ్చారు. కళ్యాణదుర్గానికి నీరిచ్చే భైరవానతిప్ప ప్రాజెక్టు (బీటీపీ) కాలువల నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామని అసెంబ్లీలో ప్రస్తావించారు. దీంతో నియోజకవర్గంలో ప్రజలు, రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సొంత నిధులు వెచ్చించి బ్రహ్మసముద్రం మండలం పడమటికోడిపల్లి సమీపాన బీటీపీ కాలువ పనులు పునఃప్రారంభించారు. అవి శరవేగంగా సాగుతున్నా యి. ఈ నేపథ్యంలో సీఎం అసెంబ్లీలో ప్రకటించడంతో కాలువ పనులు జోరందుకోనున్నాయి.
భైరవానతిప్పకు జవసత్వాలు
గత వైసీపీ ప్రభుత్వం బీటీపీ కాలువ పనులను గాలికొదిలేసింది. ఐదేళ్లలో గంప మట్టి కూడా తీయలేదు. కూటమి అధికారం చేపట్టగానే పెండింగ్ పనులపై దృష్టి సారించింది. తాజాగా కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసే జీడిపల్లి-భైరవానితిప్ప ఎత్తిపోతల పథకం పనులను సీఎం అసెంబ్లీలో ప్రస్తావించడంతో ఊపందుకోబోతున్నాయి. గుమ్మఘట్ట మండలంలోని భైరవానతిప్ప ప్రాజెక్టు కింద 12 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఎగువన కర్ణాటక రాష్ట్రం వేదవతిపై నాలుగు చెక్‌డ్యాంలు నిర్మించడంతో ఈ ప్రాజెక్టుకు వరద తగ్గిపోతూ వచ్చింది. ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. జీడిపల్లి నుంచి కృష్ణాజలాలను తరలించాలని గతంలోనే టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. 2018 అక్టోబరులో సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా గరుడాపురం వద్ద పనులకు శంకుస్థాపన చేసి రూ.968 కోట్లు కేటాయించారు. బెళుగుప్ప, కళ్యాణదుర్గం, కుందుర్పి, శెట్టూరు, బ్రహ్మసముద్రం మండలాల పరిధిలో భూసేకరణకు రూ.120 కోట్లు కేటాయించారు. కాలువ పనులు వేగంగా చేపట్టారు. అంతలోనే ఎన్నికల కోడ్ రావడంతో పనులు నిలిచిపోయాయి. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.
50 వేల ఎకరాలకు సాగునీరు
జీడిపల్లి-భైరవానతిప్ప ఎత్తిపోతల పథకంలో 14 లిప్టుల ద్వారా 114 చెరువులకు నీరు అందించాలనేది లక్ష్యం. వీటిలో 79 పెద్ద, 36 చిన్న చెరువులు ఉన్నాయి. చెరువులు నింపడంతోపాటు ఆయాప్రాంతాల్లోని 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశాలున్నాయి.
కర్షకుల ఆశలు నెరవేరుస్తాం
నియోజకవర్గంలోని 114 చెరువులను కృష్ణాజలాలతో నింపి, కర్షకుల ఆశలను నెరవేరుస్తాం. ఇదే నా ప్రధాన ఆశయం. భైరవానతిప్ప ప్రాజెక్టు కాలువ పనులను పూర్తి చేసి జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కృష్ణాజలాలు తీసుకొస్తాం. ఆ దిశగా ఇప్పటికే పనులన్నీ జోరుగా సాగుతున్నాయి. సాగు, తాగునీరు అందించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం. అసెంబ్లీలో కూడా సీఎం చంద్రబాబునాయుడు ఈ ప్రాజెక్టు కాలువ పనులను ప్రస్తావించడంతో ఇక్కడున్న రైతులు, ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
- అమిలినేని సురేంద్రబాబు, ఎమ్మెల్యే, కళ్యాణదుర్గం