Buffello హమ్మయ్యా.. బతికిపోయా..!
ABN , Publish Date - Jan 06 , 2025 | 11:40 PM
దేవర దున్నపోతు వివాదం ఎస్పీ కార్యాలయం వరకూ వెళ్లింది. దీంతో రెండూళ్ల మధ్య నలిగిపోతున్న దున్నపోతు బతికిపోయింది. కడదరకుంటలో ఈ నెల 20, 21 తేదీలలో, ముద్దలాపురంలో 21, 22 తేదీలో గ్రామ దేవర ఉంది. ఈ నేపథ్యంలో రెండూళ్ల ప్రజలు అమ్మవార్లకు దున్నపోతులను వదిలారు.

అనంతపురం క్రైం/కూడేరు, జనవరి 6(ఆంధ్రజ్యోతి): దేవర దున్నపోతు వివాదం ఎస్పీ కార్యాలయం వరకూ వెళ్లింది. దీంతో రెండూళ్ల మధ్య నలిగిపోతున్న దున్నపోతు బతికిపోయింది. కడదరకుంటలో ఈ నెల 20, 21 తేదీలలో, ముద్దలాపురంలో 21, 22 తేదీలో గ్రామ దేవర ఉంది. ఈ నేపథ్యంలో రెండూళ్ల ప్రజలు అమ్మవార్లకు దున్నపోతులను వదిలారు. ఇందులో ఒకటి మాయంకాగా, ఉన్న ఒక్కదారి కోసం రెండూళ్ల ప్రజల మధ్య వివాదం ఏర్పడింది. ఆ ఒక్కటీ తమదేనని కడదరకుంట గ్రామస్థులు బంధించారు. ఈ వివాదం పోలీసుల వద్దకు చేరింది. అక్కడ పరిష్కారం లభించకపోవడంతో వివాదాన్ని ముద్దలాపురం ప్రజలు సోమవారం ఎస్పీ కార్యాలయం వరకూ తెచ్చారు. డీపీఓ వద్ద బైఠాయించారు. ప్రజా ఫిర్యాదుల వేదికలో కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబుకు సర్పంచ ధనుంజయ తదితరులు వినతిపత్రం అందజేశారు. వివాదాన్ని అక్కడే పరిష్కరించనందుకు ఉన్నతాధికారులు అక్షింతలు వేయడంతో కూడేరు పోలీసులు దున్నపోతును స్వాధీనం చేసుకున్నారు. కూడేరు పోలీస్ స్టేషనలో ముద్దలాపురం, కడదరకుంట గ్రామస్థులతో సీఐ రాజు చర్చించారు. దున్నపోతును ఇవ్వడం కుదరదని, స్టేషనలోనే ఉంటుందని రెండూళ్లవారికీ స్పష్టం చేశారు. దీంతో వివాదం సమసిపోయినట్లేనని భావిస్తున్నారు.