HDP CHAIRMEN: ఏ విచారణకైనా సిద్ధం
ABN , Publish Date - Aug 30 , 2025 | 12:19 AM
పట్టణంలో ఇటీవల జరిగిన మురుగు కాలువల పూడికతీతలో ఏవిచారణకైనా సిద్ధమని మున్సిపల్ చైర్మన రమేష్ సవాల్ చేశారు. శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం చైర్మన అధ్యక్షతన నిర్వహించారు.
హిందూపురం, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): పట్టణంలో ఇటీవల జరిగిన మురుగు కాలువల పూడికతీతలో ఏవిచారణకైనా సిద్ధమని మున్సిపల్ చైర్మన రమేష్ సవాల్ చేశారు. శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం చైర్మన అధ్యక్షతన నిర్వహించారు. వైసీపీ కౌన్సిలర్ శివ మాట్లాడుతూ పూడికతీతపనుల్లో రూ.80లక్షలు అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఇందులో ఎవరెవరికి వాటాలు అందాయో అంటూ చెప్పడంతో చైర్మన స్పందిస్తూ కాలువ పూడికతీత పనుల్లో అక్రమాలు జరిగాయని నిరూపిస్తే ఏ విచారణకైనా సిద్ధమన్నారు. మీకు అనుకూల పత్రికల్లో వార్తలు వచ్చాయని ఏదో జరిగిపోయిందని మాట్లాడటం సరికాదన్నారు. దీనిపై కమిషనర్ మల్లికార్జున మాట్లాడుతూ ఇప్పటి వరకు రూ.30లక్షలకు సంబంధించిన బిల్లులు మాత్రమే ఇచ్చారని, అదికూడా కాలువలో పూడికతీతకు ముందు, తరువాత జియోట్యాగింగ్ ద్వారా ఫొటోలు తీశామన్నారు. రూ.30లక్షలు పనులు జరిగితే రూ.80లక్షలు అక్రమాలు ఎలా జరిగాయని ఆయన ప్రశ్నించారు. లోకాయుక్తకు ఫిర్యాదు చేశారుకానీ దానిని తోసిపుచ్చారన్నారు. చైర్మన మాట్లాడుతూ వైసీపీ హయాంలో గడప గడపకు కార్యక్రమంలో చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో ఒక్కొక్కరి బిల్లులే చెల్లిస్తూ వారిలో ధైర్యం నింపుతూ పనులు చేయడానికి ఒప్పిస్తున్నారన్నారు. మార్కెట్‌లో చాలావరకు ఖాళీగదులున్నాయని అయితే గతంలో ఎక్కువ మొత్తంలో వేలంలో గదులు దక్కించుకున్నారన్నారు. మరోసారి వేలం పెట్టాలని డిమాండ్ చేశారు. వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం అజెండాలోని అంశాలను ఆమోదిస్తూ సమావేశం ముగించారు.