ENCROACHMENTS: చెరువు ఆక్రమణదారులపై చర్యలేవీ?
ABN , Publish Date - Nov 25 , 2025 | 12:20 AM
ఉమ్మడి జిల్లాలో రెండో అతిపెద్ద చెరువుగా ప్రసిద్ధి చెందిన పరిగి చెరువును కొందరు ఆక్రమించుకుంటున్నా పట్టించుకునేవారు కరువయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రియల్ వ్యాపారులు చెరువును చదును చేసి ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.
పరిగి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో రెండో అతిపెద్ద చెరువుగా ప్రసిద్ధి చెందిన పరిగి చెరువును కొందరు ఆక్రమించుకుంటున్నా పట్టించుకునేవారు కరువయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రియల్ వ్యాపారులు చెరువును చదును చేసి ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. దీనికి తోడు ఇటుకల బట్టీ పరిశ్రమలు వెలుస్తున్నా అడిగేవారు కరువయ్యారని అంటున్నారు. దీనిపై పలుమార్లు పత్రికల్లో కథనాలు వెలువడినా సంబంధిత అధికారులు సర్వేలు చేస్తున్నారు తప్ప చర్యలు తీసుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆక్రమణదారులు ఆడిందే ఆటగా పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారు. పరిగికి చెందినవారేకాకుండా బయటి వ్యక్తులుకూడా చెరువును చదును చేసి రెండు, మూడు భవనాలు నిర్మించారు. దీనిపై విద్యుత, పంచాయతీలవారు విద్యుత చార్జీలు, గుత్తలు, డ్రైనేజీలు, నీటి కొళాయిలు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. చెరువు ఎగువప్రాంతంలో కూల్చుకుంటూ పోతే చెరువుకట్ట పూర్తీగా దెబ్బతిని కట్టతెగిపోయే ప్రమాదం ఉందని, నీటిశాతం తగ్గి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానికులు అంటున్నారు. చెరువు కింద దాదాపు 20గ్రామాలున్నాయని, చెరువు నీటిని నమ్ముకుని రైతులు వ్యవసాయం చేస్తున్నారన్నారు. అక్రమార్కులు భవనాలు నిర్మిస్తే పెద్దచెరువు రాబోయే కాలంలో కనబడకుండా పోతుందంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చి భవనాలను కూల్చివేయాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి నారాయణను వివరణ కోరగా చెరువు భాగంలో అక్రమంగా నిర్మించుకున్న ఇంటికి నోటీసులు త్వరలోనే అందజేస్తాం. వారు నోటీసులకు స్పందించకుంటే వాటిని తొలగిస్తామని అన్నారు.