Share News

జవాబు పత్రాలు మాయం..?

ABN , Publish Date - Sep 12 , 2025 | 12:20 AM

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ)లో కలకలం. జవాబు పత్రాలు మాయమయ్యాయన్న చర్చ జోరుగా సాగుతోంది. వర్సిటీలోని ఓ కళాశాలలోని ఓ కోర్సు సబ్జెక్టుకు సంబంధించిన జవాబు పత్రాలు మాయమైనట్లు తెలుస్తోంది. రెండు నెలలు గడిచినా అవి ఎక్కడున్నాయి? ఏమయ్యాయి? అన్నది తెలియకపోవడం శోచనీయం. విషయాన్ని బయటకు పొక్కకుండా ...

జవాబు పత్రాలు మాయం..?
SKU entrance

ఎస్కేయూలో కలకలం..!

బయటకు పొక్కకుండా సద్దుమణిచే ప్రయత్నాలు

రహస్య విచారణ చేయిస్తున్నారన్న చర్చ

అనంతపురం రూరల్‌, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ)లో కలకలం. జవాబు పత్రాలు మాయమయ్యాయన్న చర్చ జోరుగా సాగుతోంది. వర్సిటీలోని ఓ కళాశాలలోని ఓ కోర్సు సబ్జెక్టుకు సంబంధించిన జవాబు పత్రాలు మాయమైనట్లు తెలుస్తోంది. రెండు నెలలు గడిచినా అవి ఎక్కడున్నాయి? ఏమయ్యాయి? అన్నది తెలియకపోవడం శోచనీయం. విషయాన్ని బయటకు పొక్కకుండా సద్దుమణిచేందుకు సంబంధిత అఽధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయావర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే వర్సిటీ ఉన్నతాధికారులు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, విచారణ చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎక్కడికెళ్లాయో..?

ఈ ఏడాది మే నెలలో వివిధ సెమిస్టర్‌ పరీక్షలు వర్సిటీ పరీక్షల విభాగం నిర్వహించింది. వర్సిటీలోని ఓ కళాశాలలో పరీక్షలు జరిగాయి. అక్కడి నుంచి జవాబు పత్రాలు పరీక్షల విభాగానికి చేరాయి. అన్ని పరీక్షల అనంతరం జవాబు పత్రాల కోడింగ్‌.. డీ కోడింగ్‌ పూర్తి చేసినట్లు సమాచారం. జూలై మొదటి వారంలో జవాబు పత్రాల మూల్యాంకనం కోసం వివిధ కళాశాలలకు తరలించారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ కళాశాలకు పంపిన జవాబు పత్రాల్లో ఒక కోర్సు నాలుగో సెమిస్టర్‌లో ఒక సబ్జెక్టుకు సంబంధించినవి మాయమైనట్లు సంబంధిత వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో 60 మంది విద్యార్థులకుపైగా జవాబు పత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. సంబంధిత విభాగ ఉద్యోగులు.. విషయం వర్సిటీ ఉన్నతాధికారులకు తెలియకుండా గుట్టుగా ఉంచినట్లు సమాచారం. ఈక్రమంలోనే సదరు విభాగంతోపాటు ఇతరత్రా చోట్ల జవాబు పత్రాల కోసం వెతికినట్లు తెలుస్తోంది. దొరక్కపోవడంతో సదరు ఉద్యోగులు మిన్నకుండిపోయినట్లు సమాచారం. కొన్నిరోజుల కిందట మార్కుల కంప్యూటరీకరణ నేపథ్యంలో విషయం బయటికొచ్చినట్లు ఆయావర్గాల్లో చర్చ సాగుతోంది. సంబంధిత సబ్జెక్టు మార్కుల వివరాలు లేకపోవడంతో విషయం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమచారం. ఈక్రమంలోనే వ్యవహారం వర్సిటీ ఉన్నతాధికారులు చేరడంతో విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆ మేరకు ప్రత్యేక కమిటీని నియమించినట్లు ఆయావర్గాల్లో చర్చ జరుగుతోంది.

బయటకు పొక్కకుండా..

జవాబు పత్రాల మాయం విషయం బయటకు పొక్కకుండా వర్సిటీ అధికారులు జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. విషయం బయటకు తెలిస్తే వర్సిటీ ప్రతిష్ట దిగజారడంతోపాటు విమర్శలు, ఆందోళనలు తలెత్తుతాయని గుట్టుగా సద్దుమణిచే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు వర్సిటీలో చర్చ సాగుతోంది. అధికారులు అలాంటిదేమీ లేదని కొట్టి పారేసుండడం గమనార్హం. రహస్య విచారణ చేస్తున్నారన్న వాదనలు ఆయావర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

ఇటీవలే బాధ్యతలు తీసుకున్నా

పరీక్షల విభాగ కంట్రోలర్‌గా ఇటీవలే బాధ్యతలు తీసుకున్నా. జవాబు పత్రాలు కనిపించడం లేదన్న విషయం నా దృష్టికి రాలేదు. అలాంటిది ఏమైనా ఉంటే విచారణ చేయిస్తాం.

-శ్రీరాములు నాయక్‌, పరీక్షల విభాగ కంట్రోలర్‌, ఎస్కేయూ

మా దృష్టికి రాలేదు..

వర్సిటీలో జవాబు పత్రాలు కనిపించడం లేదన్న విషయం మా దృష్టికి రాలేదు. విచారణ నిమిత్తం ప్రత్యేక కమిటీని కూడా నియమించ లేదు. కమిటీని నియమిస్తే కచ్చితంగా చెబుతాం. అందులో రహస్యం ఏముంటుంది?

-రాజశేఖర్‌ బాబు, రిజిసా్ట్రర్‌, ఎస్కేయూ

Updated Date - Sep 12 , 2025 | 12:20 AM