Share News

FARMERS: టమోటాకు గిట్టుబాటు ధర కల్పించాలి

ABN , Publish Date - Jan 06 , 2025 | 11:57 PM

టమోటాకు గిట్టుబాటు ధర కల్పించి, రైతులను ఆదుకోవాలని ఏపీ రైతుసంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు సోమవారం కలెక్టరేట్‌ ముందు టమోటాలు పోసి నిరసన తెలిపారు.

FARMERS: టమోటాకు గిట్టుబాటు ధర కల్పించాలి
Farmers are protesting by throwing tomatoes in front of the Collectorate

కలెక్టరేట్‌ ఎదుట టమోటాలు పోసి రైతుల ధర్నా

అనంతపురం కల్చరల్‌, జనవరి 6(ఆంధ్రజ్యోతి): టమోటాకు గిట్టుబాటు ధర కల్పించి, రైతులను ఆదుకోవాలని ఏపీ రైతుసంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు సోమవారం కలెక్టరేట్‌ ముందు టమోటాలు పోసి నిరసన తెలిపారు. జిల్లాలో దాదాపు 23 వేల హెక్టార్లలో టమోటా సాగు చేశారని, ప్రభుత్వ మార్కెట్‌ సౌకర్యం లేక ప్రైవేట్‌ మార్కెట్లలో తక్కువ ధరకే అమ్ముకుని రైతులు నష్టపోతున్నారని చంద్రశేఖర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ నీరున్నా, డ్రిప్‌ పరికరాలతో ఎన్నో ఇబ్బందుల నడుమ పంటను సాగు చేస్తున్నారని, తీరా మార్కెట్‌కు వచ్చాక గిట్టుబాటు ధర లభించడం లేదని అన్నారు. కూలీల ఖర్చులు కూడా రావడం లేదని, దీంతో రైతులు పొలాల్లోనే పంటను వదిలేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు మార్కెట్‌కు తెచ్చినా.. నో సేల్‌ అనడంతో వదిలేసి వెళుతున్నారని అన్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, టమోటా రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. మార్కెటింగ్‌ శాఖ అధికారులు టమోటా కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటనలు ఇచ్చి.. నామమాత్రంగా కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లాలో ప్రభుత్వం తరపున టమోటా మార్కెట్‌ ఏర్పాటు చేసి, రైతులకు పరిష్కారం చూపాలని కోరారు. టమోటా ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. గిట్టుబాటు ధర లేక నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50వేలు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తరిమెల నాగరాజు, సహాయ కార్యదర్శి బీహెచ రాయుడు, రైతులు పోతులయ్య, సుబ్బిరెడ్డి, నాగార్జున, చంద్రశేఖర్‌రెడ్డి, రవినారాయణరెడ్డి, ప్రతా్‌పరెడ్డి, రవితేజ, వెంకట్రామిరెడ్డి, పరమేష్‌, సుధాకర్‌, రామలింగారెడ్డి, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2025 | 11:57 PM