THEFTS: గోరంట్లలో వరుస చోరీలు..!
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:06 AM
గోరంట్లలో వరుస చోరీలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. పట్టణంలోని బేతేలు చర్చి వీధి, పెన్షనర్స్ భవనం వెనుక వీధుల్లో వరస చోరీలు జరగడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
నిద్రమత్తులో పోలీసులు
గోరంట్ల, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): గోరంట్లలో వరుస చోరీలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. పట్టణంలోని బేతేలు చర్చి వీధి, పెన్షనర్స్ భవనం వెనుక వీధుల్లో వరస చోరీలు జరగడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బెతేలు చర్చి వీధిలోని కూరగాయల వ్యాపారి వెంకటరత్నమ్మ నివాసంలో 12తులాల బంగారు నగలు, అరకిలో వెండి వస్తువులు రూ.1.50 లక్షలు చోరీ జరిగినట్లు బాధితురాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోరంట్లకు చెందిన హరినాథ్ ఆరేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఆయన భార్య వెంకటరత్నమ్మ కూరగాయల వ్యాపారం ద్వారా ఇద్దరు కుమార్తెలను పోషిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున కూరగాయాల కోసం బాగేపల్లికి వెళ్లి, అనంతరం గోరంట్లకు వచ్చి దుకాణంలో వ్యాపారం చూసుకుని రాత్రి ఇంటికి పోగా, చోరీ జరిగిన విషయం తెలిసి స్పృహతప్పి పడిపోయినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం ఉదయం బంధువుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం ఇంటికి తాళం లేసి అంగడిలో కూరగాయాల వ్యాపారం చూసుకుని రాత్రి ఇంటికి వస్తానన్నారు. ఇది తెలిసిన వ్యక్తులే నకిలీ తాళాలతో లోనికి ప్రవేశించి, బీరువాలోని నెక్లెస్, ఆరు ఉంగరాలు, ఐదు జతల కమ్మలు, తాళిబోట్టు, గిన్నిబిట్టు, లక్ష్మీ డాలర్‌తోపాటు అరకిలో వెండి వస్తువులతోపాటు పిల్లల అవసరాలకోసం దాచుకున్న రూ.1.5 లక్షల నగదు ఎత్తుకెళ్లిన్నట్లు ఆవేదన చెందారు. శనివారం రాత్రి విశ్రాంత ఉపాధ్యాయుడు చలపతి నివాసంలో తాళం పగలకొట్టి 15తులాల బంగారం, రూ.7.5 లక్ష నగదు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఆ నివాసం పక్కనే మల్లాపల్లి ఏఎనఎం నూర్జహాన ఉంటున్నారు. శనివారం ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లారు. సోమవారం తెలిసిన వ్యక్తులు ఇంటి వద్దకు రాగా, తలుపు తెరచిఉండడంతో అనుమానం వచ్చి ఆమెకు ఫోన చేసి విషయం తెలపగా, వెంటనే ఆమె గోరంట్లకు చేరుకుని పరిశీలించారు. తలుపులు పగలకొట్టి బీరువాలోని ఐదుతులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లినట్లు చెప్పారు. ఇలావరస చోరీలతో గోరంట్ల ప్రజలు ఇంటికి తాళం వేయాలంటేనే భయపడుతున్నారు. పోలీసులు చోరీజరిగిన ఇళ్లను పరిశీలించి, దర్యాప్తు చేస్తున్నారు. కూరగాయాల వ్యాపారి ఇంట్లో తలుపులుకానీ, బీరువాకానీ ఎలాంటి నష్టం కలగకపోవడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు నిఘాను పెంచి చోరీలను అరికట్టాలను పట్టణ ప్రజలు కోరుతున్నారు.
బ్యాంక్ దోపిడీ కేసు చిక్కుముడి వీడేనా..?
ఫ ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లిన డీఎస్పీ, సీఐలు
హిందూపురం, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన బ్యాంక్ దోపిడీ కేసు చిక్కుముడి వీడేలా కనిపిస్తోంది. గతనెల 26న రాత్రి తూమకుంట చెక్‌పోస్టులో ఉన్న ఎస్‌బీఐ బ్యాంకులో రూ.10కోట్లు విలువచేసే ఖాతాదారులు కుదువుపెట్టిన బంగారాన్ని, నగదును ఎత్తుకెళ్లిన సంఘటన తెలిసిందే. చోరీకి పాల్పడిన దుండగులు ఎలాంటి ఆధారంలేకుండా చాకచక్యంగా బ్యాంకును దోచుకెళ్లారు. దీనిపై రాష్ట్రస్థాయి పోలీసు అధికారులతోపాటు జిల్లా అధికారుల నుంచి ఒత్తిడి రావడంతో డీఎస్పీ మహేష్, సీఐలు 15రోజులుగా నిందితుల కోసం గాలిస్తున్నారు. పోలీసులకు లభించిన ఆధారాలతో నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో ఎనిమిది బృందాలు గాలిస్తుండగా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన నేరస్తులే బ్యాంక్ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు భావించి ఆదిశగా దర్యాప్తు చేపట్టారు. పోలీసులకు దొరికిన చిన్నపాటి క్లూతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఓ అనుమానితున్ని అదుపులోకి తీసుకుని విచారించగా దోపిడీ కేసుకు సంబంధించి కొంత ఆధారం దొరికినట్లు సమాచారం. దీంతో ఈ కేసును ఎలాగైనా వారంలోపు ఛేదిస్తామని డీఎస్పీ మహేష్ ఆంధ్రజ్యోతితో అన్నారు. ఇప్పటికే డీఎస్పీ, మరికొంతమంది సీఐలు దేశ రాజధానికి తరలి వెళ్లారు. దీంతో ఈ వారంలోపు కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం మెండుగా ఉన్నట్లు సమాచారం.