EX MLC: కోటి సంతకాల సేకరణ.. ఒక నాటకం
ABN , Publish Date - Dec 20 , 2025 | 12:01 AM
వైసీపీ నేత జగన, ఆపార్టీ నాయకులు కోటి సంతకాల సేకరణ పేరిట చేస్తున్నది ఒక నాటకం అని, ప్రజల్లో విద్యార్థుల్లో స్పందన కరవయ్యిందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు.
మడకశిర టౌన, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత జగన, ఆపార్టీ నాయకులు కోటి సంతకాల సేకరణ పేరిట చేస్తున్నది ఒక నాటకం అని, ప్రజల్లో విద్యార్థుల్లో స్పందన కరవయ్యిందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు. శుక్రవారం పట్టణంలోని బాలాజీనగర్ టీడీపీ కార్యాలయ ఆవరణంలో అగళి మండలం బ్యాడిగెరెకు చెందిన 20 వైసీపీ కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఆయన మాట్లాడుతూ వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తున్నవారు వారి కష్టాలు చెబుతున్నారని, ఆ పార్టీలో ఉండి ఎంత కష్టపడి పనిచేసినా గుర్తింపు లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. జగన స్వార్థం కోసం మమ్మల్ని వాడుకొన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. జగన తప్పు మీద తప్పు చేస్తుండటం, ఆపార్టీ అవలంభిస్తున్న విధానాలు కార్యకర్తలకు నచ్చడం లేదని, పార్టీలో ఉంటే మనుగడ కష్టమని గ్రహించి టీడీపీలోకి వస్తున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు సారథ్యంలోనే రాష్ట్రానికి భవిష్యత్తు అని ప్రజలు విశ్వసిస్తున్నట్లు తెలిపారు. వైసీపీకి చెందిన శివన్న, రాజప్ప, నాగరాజు, లింగప్ప, కొల్లారప్ప, హనుమంతరాయప్ప, అశ్వర్థ, లింగరాజు, అజ్జయ్య, నాగరాజుతోపాటు 20 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకొన్నారు. జడ్పీటీసీ ఉమేష్, మండల కన్వీనర్ తిప్పేస్వామి, సింగిల్‌విండో అధ్యక్షుడు కుమారస్వామి పాల్గొన్నారు.