Share News

CM Chandrababu Naidu: అమరావతిలో బలిదాన విగ్రహం

ABN , Publish Date - Dec 16 , 2025 | 04:00 AM

మరావతిలో నిర్మిస్తున్న? అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల నిలువెత్తు విగ్రహానికి ‘స్టాట్యూ ఆఫ్‌ శాక్రిఫైస్‌ బలిదాన విగ్రహం గా నామకరణం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు....

CM Chandrababu Naidu: అమరావతిలో బలిదాన విగ్రహం

  • 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహానికి ‘స్టాట్యూ ఆఫ్‌ శాక్రిఫై్‌స’గా నామకరణం: సీఎం

పొట్టి శ్రీరాములును గుర్తించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్‌. 1985లో తెలుగు విశ్వవిద్యాలయానికి ఆయన పేరే పెట్టారు. ఆయన నెల్లూరు జిల్లాలో పుట్టడంతో ఆ జిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు నేనే పెట్టాను.తెలుగుజాతికి ఎంతోమంది మహనీయులు ఎంతో వన్నె తీసుకొచ్చారు. అయినా దురదృష్టవశాత్తూ మనం శాశ్వత చిరునామా లేకుండా తిరుగుతున్నాం.

- ముఖ్యమంత్రి చంద్రబాబు

  • త్యాగ భవనంగా చెన్నైలోని ఆయన ఇల్లు

  • వచ్చే మార్చి 16న ఘనంగా 125వ జయంతి

  • ‘ఆత్మార్పణ దినం’ సభలో చంద్రబాబు వెల్లడి

విజయవాడ, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): అమరావతిలో నిర్మిస్తున్న? అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల నిలువెత్తు విగ్రహానికి ‘స్టాట్యూ ఆఫ్‌ శాక్రిఫైస్‌ (బలిదాన విగ్రహం)’గా నామకరణం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అన్నారు. చెన్నైలో శ్రీరాములు ఆత్మార్పణం చేసిన భవనాన్ని పునర్నిర్మించి దానికి త్యాగ భవనంగా పేరు పెడతామని తెలిపారు. సోమవారం సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత పొట్టి శ్రీరాములు జీవిత చరిత్రకు సంబంధించి ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను వీక్షించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రాజధాని అమరావతిలో శ్రీరాములు 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసే ప్రదేశానికి సంబంధించిన ఏవీని ప్రదర్శించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడారు. ఈ విగ్రహం ఏర్పాటుకు అమరావతిలో 6.8 ఎకరాల భూమి కేటాయించామన్నారు. శ్రీరాములు జీవిత విశేషాలను భావితరాలకు తెలియజేసేలా స్మృతివనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆయన తెలుగు జాతి గుర్తింపు కోసం ప్రాణత్యాగం చేసిన ఏకైక నాయకుడని కొనియాడారు. ‘తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడి, ప్రాణాలు అర్పించారు. 124 ఏళ్ల క్రితం దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు లేవు. కొన్ని రాష్ర్టాలు మాత్రమే ఉండేవి. 1952 డిసెంబరు 15న పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం చేసిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. పొట్టి శ్రీరాములు మొదట స్వాతంత్య్రం కోసం పోరాడారు. తర్వాత తెలుగు జాతి కోసం పోరాటం మొదలుపెట్టారు.


50 ఏళ్ల స్వప్నం ఆయన 58 రోజుల ఆమరణ దీక్షతో సాధ్యమైంది. ప్రత్యేక రాష్ట్రం కోసం 1952 అక్టోబరు 19న మద్రాసులో బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించారు. అందరూ దీనిని ఆషామాషిగా తీసుకున్నా 58 రోజులపాటు పట్టుదలతో దీక్ష చేసి డిసెంబరు 15న ప్రాణాలు విడిచారు. ఆ తర్వాత డిసెంబరు 19న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ప్రకటన చేశారు. ఇది పొట్టి శ్రీరాములు సాధించిన ఘనవిజయం. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు నుంచి విశాలాంధ్ర, తర్వాత విభజన.. ఇలా అన్ని అంశాలపై చర్చించిన తర్వాత పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం చేసిన డిసెంబరు 15వ తేదీని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించాం. 2026 మార్చి 16న ఆయన 125వ జయంతిని ఘనంగా నిర్వహిస్తాం. ఈ ఏడాది మార్చి 16 నుంచి వచ్చే మార్చి 16 వరకు జయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించుకుంటున్నాం. చెన్నైలో ఆయన ఆత్మార్పణం చేసిన భవనాన్ని పరిరక్షిస్తాం. దానికి త్యాగభవనం అని నామకరణం చేస్తాం. భావితరాలకు గుర్తుండేలా దానిని తయారు చేస్తాం.

ఆయన జన్మించిన ఇంటిని స్మారక భవనం చేస్తాం. ఆయన ప్రారంభించిన ఆస్పత్రిని అభివృద్ధి చేస్తాం’ అని సీఎం వెల్లడించారు. పొట్టి శ్రీరాములు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదని, ఆయన తెలుగు ప్రజల ఆస్తి అని వ్యాఖ్యానించారు. ‘ఆయన ఒక సెంటిమెంట్‌. అటువంటి వ్యక్తిని ప్రజలు గుర్తు పెట్టుకోవలసిన అవసరం ఉంది’ అని చెప్పారు.

పెనుగొండ దివ్యక్షేత్రం కావడం ఖాయం

ఆర్యవైశ్యుల అభ్యర్థనతో వాసవీమాత జన్మించిన పెనుగొండను వాసవీ పెనుగొండగా మార్చామని సీఎం గుర్తుచేశారు. ఇది పర్యాటక కేంద్రంగానే కాకుండా దివ్యక్షేత్రంగానూ మారుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అమ్మవారికి అద్భుతమైన ఆలయం కట్టాలని ఆర్యవైశ్య సమాజాన్ని కోరారు. ‘ఆర్యవైశ్యులకు కుల ధ్రువీకరణ పత్రాలను శెట్టి, గుప్తా అని వేర్వేరుగా ఇచ్చేవారు. ఇక వాళ్లందరికీ ఆర్యవైశ్య అని కులధ్రువీకరణ జారీ చేసేలా చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు. ఈ సమయంలో వేదిక ముందు కూర్చున్న మహిళలు ‘థాంక్యూ సీఎం సార్‌’ అనే ప్లకార్డులను ప్రదర్శించారు. నినాదాలు చేశారు. దీనికి స్పందించిన సీఎం.. ‘ఈ ఘనత నా ఒక్కడిదే కాదు. నా మిత్రుడు పవన్‌ కల్యాణ్‌, ప్రధాని మోదీ, ఎన్‌డీఏది.’ అని వ్యాఖ్యానించారు.


శ్రీరాములు కుటుంబ సభ్యులకు సత్కారం

‘ప్రపంచం మెచ్చే విధంగా అమరావతి, విశాఖపట్నం, తిరుపతి నగరాలను తయారు చేస్తాం. అభివృద్ధి వికేంద్రీకరణ చేసి తెలుగుజాతికి అందిస్తాం.’ అని సీఎం తెలిపారు. కార్యక్రమం ప్రారంభంలో తొలుతగా విజయవాడ సత్యనారాయణపురం ఘంటసాల ప్రభుత్వ సంగీత కళాశాలకు చెందిన విద్యార్థులు ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులు గునుపూడి హనుమంతరావు, గునుపూడి సత్యనారాయణ, ప్రతిభ, గునుపూడి నరసింహారావు, గునుపూడి సుబ్రహ్మణ్యంను చంద్రబాబు సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు.

పీపీపీపై రాజకీయం: సీఎం

పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్మాణంపై కొంతమంది కావాలనే రాజకీయం చేస్తున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. ‘ఆస్పత్రులు, వైద్య కళాశాలల విషయంలో పీపీపీ విధానమే ఉండాలని కేంద్రమే పార్లమెంటులో చెప్పింది. నిర్వహించేది ప్రైవేటు వ్యక్తులే అయినా దానికి యజమానిగా ప్రభుత్వమే ఉంటుందని.. దానికే అన్ని హక్కులూ ఉంటాయి. పీపీపీలో అభివృద్ధి జరిగి, ఆదాయంపెరుగుతుంది’ అని స్పష్టం చేశారు.

Updated Date - Dec 16 , 2025 | 04:01 AM