Share News

Amaravati: ప్రపంచ టాప్‌-5 నగరాల్లో అమరావతి

ABN , Publish Date - Jan 25 , 2025 | 05:09 AM

కోటి 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐకానిక్‌ భవనాలు నిర్మిస్తున్నాం. 250 అడుగుల ఎత్తులో వ్యూ పాయింట్‌ ఉండేలా అసెంబ్లీని నిర్మిస్తున్నాం. నవ నగర శౌరభాన్ని వీక్షించే అవకాశాన్ని సామాన్య ప్రజలకు కూడా కల్పించబోతున్నాం. మరో మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం’ అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టంచేశారు.

Amaravati: ప్రపంచ టాప్‌-5 నగరాల్లో అమరావతి

కోటి 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐకానిక్‌ భవనాలు

నెల రోజుల్లో నిర్మాణ పనులు పరుగులు

మూడేళ్లలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తాం

250 అడుగుల ఎత్తులో వ్యూ పాయింట్‌ ఉండేలా అసెంబ్లీ

గత ప్రభుత్వ కక్షసాధింపుతో అడవిలా మారిన అమరావతి

చంద్రబాబు, లోకేశ్‌ల సారథ్యంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు

రాజధానిలో మున్సిపల్‌ మంత్రి నారాయణ పర్యటన

జీఏడీ టవర్ల వద్ద నీటి తోడకం పరిశీలన

గుంటూరు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ‘ప్రపంచంలో టాప్‌-5 నగరాల్లో ఒకటిగా అమరావతిని నిర్మిస్తాం. మరో నెల రోజుల్లో రాజధానిలో నిర్మాణ పనులు పరుగులు పెట్టబోతున్నాయి. కోటి 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐకానిక్‌ భవనాలు నిర్మిస్తున్నాం. 250 అడుగుల ఎత్తులో వ్యూ పాయింట్‌ ఉండేలా అసెంబ్లీని నిర్మిస్తున్నాం. నవ నగర శౌరభాన్ని వీక్షించే అవకాశాన్ని సామాన్య ప్రజలకు కూడా కల్పించబోతున్నాం. మరో మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం’ అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టంచేశారు. నేలపాడులో జరుగుతున్న పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమై, వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన అడ్మినిస్ట్రేటివ్‌(జీఏడీ టవర్‌తో పాటు మరో నాలుగు) టవర్లు, హైకోర్టు రాఫ్ట్‌ ఫౌండేషన్ల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. నెల రోజులుగా నీటిని తోడుతుండగా, భవనాల పునాదులు ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే. నారాయణ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి అమరావతిని అడవిగా మార్చిందన్నారు.

అమరావతిలో గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ పరిధిలో నిర్మించే అసెంబ్లీ, అడ్మినిస్ట్రేటివ్‌ టవర్లు, హైకోర్టు భవనాలను ఐకానిక్‌ బిల్డింగ్‌లుగా నిర్మించాలని నిర్ణయించామన్నారు. జీఏడీ టవర్‌ను 48 అంతస్తులతో 17,03,433 చదరపు అడుగుల విస్తీర్ణంలో, టవర్‌-1, టవర్‌-2లను 40 అంతస్తులతో 28.41 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, టవర్‌-3, 4లను 40 అంతస్తుల్లో 23 లక్షల 42,956 చదరపు అడుగుల్లో నిర్మించేలా డిజైన్‌ చేశామని చెప్పారు. హైకోర్టును 8 అంతస్థుల్లో 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, అసెంబ్లీని 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 250 మీటర్ల ఎత్తులో వ్యూపాయింట్‌ వచ్చేలా డిజైన్‌ చేశామని వివరించారు. అసెంబ్లీ లేని రోజుల్లో టూరిజం ప్రాంతంగా ఉండేలా పక్కా ప్రణాళికతో నిర్మాణాలను రూపొందించామని మంత్రి చెప్పారు. వీటితో పాటు మరో కోటి 24 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులకు సంబంధించిన 4,053 అపార్ట్‌మెంట్ల నిర్మాణం కూడా గతంలోనే ప్రారంభించామని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమపై కక్షతో ఈ నిర్మాణాలన్నీ నిలిపివేసిందని ఆరోపించారు. ఐకానిక్‌ భవనాల పునాదులు ఏళ్ల తరబడి నీటిలోనే ఉండిపోవడంతో.. ఐఐటీ నిపుణల నివేదిక ఆధారంగా కొనసాగిస్తున్నామని తెలిపారు.


న్యాయపర సమస్యలతోనే పనులు జాప్యం

గత ప్రభుత్వ అస్తవ్యస్థ పాలనతో రాజధానికి అనేక న్యాయపరమైన సమస్యలు వచ్చాయని మంత్రి అన్నారు. సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటించే నాటికి అంతా అడవిగా ఉందని, వెంటనే జంగిల్‌ క్లియరెన్స్‌ చేయాలని ఆదేశించారని తెలిపారు. తనకు రెండోసారీ మున్సిపల్‌ శాఖ బాధ్యతలు అప్పగించి, అమరావతి నిర్మాణంపై కీలక ఆదేశాలు ఇచ్చారన్నారు. న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం కమిటీలు వేసి ముందుకెళ్లామన్నారు. రైతులకు గత ప్రభుత్వం బకాయి పెట్టిన రెండు విడతల కౌలు కూడా జమ చేశామన్నారు. ఇప్పటివరకు అమరావతి నిర్మాణానికి రూ.38,571 కోట్ల విలువైన 40 పనులకు టెండర్లు పిలిచామని చెప్పారు. ఈ నెలాఖరుకి అన్ని పనులకు టెండర్లను పిలిచి ఫిబ్రవరి రెండో వారం నుంచి పనులను వేగవంతం చేస్తామన్నారు.

వైసీపీ అరాచక పాలనతో ప్రజల్లో భయభ్రాంతులు

గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారో తెలియక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని మంత్రి అన్నారు. కనీసం స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటేనే పరిశ్రమలు వస్తాయని పేర్కొన్నారు. వైసీపీ పాలనతో విసిగిన ప్రజలు ఎన్నికల్లో ఆ పార్టీని 11 సీట్లకు పరిమితం చేసి బుద్ధి చెప్పారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని నారాయణ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం నాశనం కాగా.. సీఎం చంద్రబాబు తన అపార అనుభవంతో మళ్లీ వ్యవస్థలను గాడిలో పెడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ రూ.లక్ష కోట్ల మేరకు పెట్టుబడులకు అంగీకారం కుదిరిందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, లోకేశ్‌ల దావోస్‌ పర్యటనలో పారిశ్రామికవేత్తలు వేల కోట్ల పెట్టుబడులకు ఆసక్తి చూపారని మంత్రి చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP News: ఈ బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత కల్పించండి: సీఎంచంద్రబాబు..

Visakha: కోడికత్తి కేసులో ఎన్ఐఏ కోర్టుకు శ్రీను.. మరి జగన్ వెళ్లారా..

Supreme Court: వైసీపీ నేత గౌతంరెడ్డికి సుప్రీంలో ఊరట

Read Latest AP News and Telugu News

Updated Date - Jan 25 , 2025 | 05:10 AM