Amaravati Smart City: ప్రపంచస్థాయి నగరంగా అమరావతి
ABN , Publish Date - May 06 , 2025 | 05:59 AM
అమరావతి ప్రపంచస్థాయి నగరంగా మారేందుకు కేంద్రం నుంచి అనేక ప్రాజెక్టులు కార్యరూపం దాలుస్తున్నాయి. మెట్రో, ఈ-బస్సులు, స్మార్ట్ సిటీలు, అవాజ్ యోజన వంటి పథకాలు వేగంగా అమలు అవుతున్నాయి.
కార్యరూపం దాలుస్తున్న పలు ప్రాజెక్టులు
విజయవాడ, విశాఖ మెట్రో రైలుకు చర్యలు
పీఎం ఈ-బస్ కింద ఏపీకి 750 ఏసీ బస్సులు
కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ డీజీ వెల్లడి
అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): ఏపీ రాజధాని అమరావతి ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ రాజీవ్ జైన్ అన్నారు. ఇప్పటికే వివిధ కేంద్ర పథకాలు, మిషన్‌ల కింద అనేక ప్రాజెక్టులు కార్యరూపం దాలుస్తున్నాయని వివరించారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వం, ఆయా మంత్రిత్వ శాఖలతో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలోనే అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ పథకాల కింద సుమారు 38 కిలోమీటర్ల మేర కొత్త రైలు నెట్‌వర్క్‌తోపాటు విజయవాడ, విశాఖపట్టణాల్లో ప్రతిపాదిత మెట్రో రైలు ప్రాజెక్టుల అమలుకు చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.
పీఎం ఈ-బస్ సేవ పథకం కింద సుమారు 750 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించామన్నారు. స్మార్ట్ సిటీస్ మిషన్ కింద అమరావతి, కాకినాడ, తిరుపతి, విశాఖల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇప్పటికే రూ. 5,701 కోట్ల విలువైన పనులు (84 శాతం కంటే ఎక్కువ) పూర్తయ్యాయని వివరించారు. ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి కింద లబ్ధిదారులకు 103 శాతం రుణాలు పంపిణీ చేసి ఏపీ మూడో స్థానంలో ఉందన్నారు. ప్రధానమంత్రి అవాజ్ యోజన (అర్బన్) పథకం కింద ఏపీలో ఇప్పటికే 3.5 లక్షల ఇళ్లు పూర్తి చేసినట్లు తెలిపారు. అటల్ మిషన్ (అమృత్, అమృత్ 2.0) కింద ఏపీలో రూ. 6,200 కోట్ల కంటే ఎక్కువ ప్రతిపాదనలతో కూడిన 367 ప్రాజెక్టుల డీపీఆర్‌కు కేంద్ర ఆమోదం లభించిందని, ఇప్పటికే రూ. 589 కోట్ల నిధులు విడుదలయ్యాయని వివరించారు.