Chief Minister Chandrababu Naidu: క్వాంటమ్‌తో భవిత బంగారం
ABN , Publish Date - Dec 24 , 2025 | 05:20 AM
గ్లోబల్ టెక్నాలజీని రాష్ట్రానికి పరిచయం చేస్తానని, దానిని అందిపుచ్చుకుని బంగారు భవిష్యత్తును సృష్టించుకోవాలని విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.....
కొత్త ఆవిష్కరణను అందించే పూచీ నాది: చంద్రబాబు
అందిపుచ్చుకునే బాధ్యత విద్యార్థులు, యువతది
ఏడేళ్లు కష్టపడితే భవిష్యత్తుకు తిరుగుండదు
లక్ష మంది క్వాంటమ్ నిపుణుల తయారీనే అమరావతి క్వాంటమ్ వ్యాలీ లక్ష్యం
ఇరవై ఏళ్ల భవిష్యత్‌కు ఇప్పటి నుంచే కార్యాచరణ
నాడు సిలికాన్ వ్యాలీ.. నేడు క్వాంటమ్ వ్యాలీ
రెండేళ్లలో క్వాంటమ్ కంప్యూటర్లను తయారుచేస్తాం
‘క్వాంటమ్ టాక్ బై సీబీఎన్’ కార్యక్రమంలో సీఎం
50 వేల మందికి పైగా టెక్ విద్యార్థుల హాజరు
అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ కేంద్రాన్ని స్థాపించడంతో పాటు వచ్చే రెండేళ్లలో క్వాంటమ్ కంప్యూటర్ తయారు చేసే స్థాయికి ఎదుగుతాం. ప్రపంచానికి మనం క్వాంటమ్ కంప్యూటర్లను సరఫరా చేయగలం. లక్ష మంది క్వాంటమ్ కంప్యూటింగ్ నిపుణులను తయారు చేయడమే అమరావతి క్వాంటమ్ వ్యాలీ లక్ష్యం
అమరావతి నాలెడ్జ్ ఎకానమీ, క్వాంటమ్ వ్యాలీగా ఉంటుంది. తిరుపతి స్పేస్ సిటీగా ఉంటుంది. అనంతపురం, కడప వంటి ప్రాంతాలు ఎలకా్ట్రనిక్ మాన్యుఫ్యాక్చరింగ్, ఏరోస్పేస్ క్లస్టర్‌గా మారబోతున్నాయి. విశాఖ-చెన్నై, బెంగళూరు-హైదరాబాద్, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్లు రానున్నాయి.
- సీఎం చంద్రబాబు
అమరావతి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): గ్లోబల్ టెక్నాలజీని రాష్ట్రానికి పరిచయం చేస్తానని, దానిని అందిపుచ్చుకుని బంగారు భవిష్యత్తును సృష్టించుకోవాలని విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఒకప్పుడు సిలికాన్ వ్యాలీ.. ఇప్పుడు అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఆధునిక సాంకేతిక నైపుణ్య దిశానిర్దేశాలని చెప్పారు. విద్యార్థులు ఏడేళ్ల పాటు క్వాంటమ్ కంప్యూటింగ్‌లో నిష్ణాతులైతే.. భవిష్యత్తు అంతా బంగారమేనని, కోరుకున్నవి అన్నీ దక్కుతాయని కర్తవ్యబోధ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆధారంగా క్వాంటమ్ కంప్యూటింగ్ నైపుణ్యంతో ఎవరైనా నోబెల్ బహుమతిని సాధిస్తే వారికి రూ.100 కోట్లు నజరానా ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అమరావతి వేదికగా మంగళవారం పలు ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు చెందిన 50,000 మందికిపైగా టెక్ విద్యార్థులతో ‘‘క్వాంటమ్ టాక్ బై సీఎం సీబీఎన్’’ కార్యక్రమాన్ని వర్చువల్‌గా నిర్వహించారు. విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. క్వాంటమ్ కంప్యూటింగ్‌తో సహా వివిధ ఆధునిక సాంకేతికతలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. ‘‘యువత రేపటి గురించి ఆలోచిస్తే.. నేను 20 ఏళ్ల ముందుకు ఆలోచిస్తాను. అందులో భాగమే అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ. క్వాంటమ్ కంప్యూటింగ్‌తో సహా పునరుత్పాదక విద్యుత్తు, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో కొత్త అవిష్కరణను అందించే పూచీ నాది. దానిని అందుకునే బాధ్యత విద్యార్థులు, యువతదే. ఆరునెలల్లోనే క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ భవనాన్ని నిర్మించాలని సీఆర్‌డీఏ సమావేశంలో దిశానిర్దేశం చేశాం. అమరావతి క్వాంటమ్‌వ్యాలీని అద్భుతంగా నిర్మిస్తున్నాం. గత నెల 13వ తేదీన క్వాంటమ్ కంప్యూటర్‌పై నేను చేసిన ప్రకటన ఎందరిలోనో విశ్వాసాన్ని పెంచింది. ఏపీ స్పీడ్ లెర్నర్. క్వాంటమ్ కంప్యూటింగ్ కంటే ఆంధ్రపదేశ్ స్పీడ్‌గా పరుగులు తీస్తోంది.
భారతీయుల డీఎన్‌ఏలోనే విజ్ఞానం
విజ్ఞానం భారతీయుల డీఎన్‌ఏలోనే ఉంది. క్రీస్తు పూర్వం 2500లోనే పట్టణ ప్రణాళికలు రచించారు. భారత్‌కు బంగారు పిచ్చుక అనే పేరుంది. గణితంలో భారతీయులు చురుగ్గా ఉంటారు. 2000 ఏళ్ల కిందటే ప్రపంచ జీడీపీలో 40శాతం భారత్. ఇప్పుడు జీడీపీలో ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్నాం. ప్రధాని మోదీ సమర్థ నాయకత్వంలో 2047 నాటికి కచ్చితంగా మొదటి స్థానంలో ఉంటాం. వికసిత్ భారత్ దిశగా దేశం వేగంగా అడుగులు వేస్తోంది. 30 ట్రిలియన్ డాలర్ వ్యవస్థగా వృద్ధి చెందుతోంది. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, జీఎస్టీలాంటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. ప్రపంచంలో ప్రతి నలుగురు ఐటీ ప్రొఫెషనల్స్‌లో ఒకరు భారతీయులైతే.. నలుగురు భారతీయుల్లో ఒకరు ఉమ్మడి ఏపీకి చెందినవారు ఉన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అందిపుచ్చుకుని ప్రపంచానికి నిపుణులను అందించాం. సైబరాబాద్ హైటెక్ సిటీని ఎల్‌అండ్‌టీ 14 నెలల్లో నిర్మించింది. ఇప్పుడు అమరావతి క్వాంటమ్ వ్యాలీని కూడా నిర్మిస్తోంది. మన యువత భవిష్యత్తు తేజోవంతంగా కనిపిస్తోంది. సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, అరవింద్ కృష్ణలాంటి వారు దిగ్గజ కంపెనీలకు సారథ్యం వహిస్తున్నారు. గతంలో ఐటీ అనుబంధ సేవలను వివిధ దేశాలకు భారత్ నుంచే అందించాం. ముఖ్యంగా తెలుగువారే అందించారు. విశాఖలో ఇప్పుడు గూగుల్ వంటి అతిపెద్ద సంస్థ డేటా సెంటర్‌ను స్థాపిస్తోంది. అతిపెద్ద సీ-కేబుల్ వేను నిర్మిస్తోంది.
పలు రంగాల్లో క్వాంటమ్ పరిశోధనలు
‘రాష్ట్రాన్ని క్వాంటమ్ హబ్‌తో పాటు గ్రీన్‌హైడ్రోజన్ హబ్‌గా మారుస్తున్నాం. రాష్ట్ర ఇరవై ఏళ్ల భవిష్యత్తుకు కార్యాచరణను సిద్ధం చేశాం. ప్రధాని మోదీ చొరవతో స్థాపించిన నేషనల్ క్వాంటమ్ మిషన్ ద్వారా రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయి. ఐటీ విప్లవం తరహాలోనే క్వాంటమ్ కంప్యూటింగ్ విప్లవాన్ని కూడా భారతీయులు అందిపుచ్చుకోవాల్సి ఉంది. వైద్యం, విద్యుత్తు, సుస్థిర వ్యవసాయం, ఫైనాన్షియల్ మోడలింగ్, మెటీరియల్ డిస్కవరీ, వెదర్ ఫోర్ కాస్టింగ్ వంటి అంశాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధనలు అవసరమవుతాయి క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధనలకు ఆకాశమే హద్దు. వ్యక్తిగత ఔషధాలు, ప్రివెంటివ్ క్యూర్, హెల్త్‌కు సంబంధించి క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధనలు సహకరిస్తాయి’ అని చంద్రబాబు చెప్పారు.