Amaravati Reawakens: ప్రజారాజధానికి పునరుజ్జీవం
ABN , Publish Date - May 02 , 2025 | 06:40 AM
అమరావతి నిర్మాణ పునఃప్రారంభంతో ప్రజల కలలు నిజమవుతున్నాయి. రైతుల త్యాగం ఫలించి రాజధాని అభివృద్ధి మళ్లీ పట్టాలెక్కింది
కూటమి ప్రభుత్వం రాగానే కదలిక.. సీఎం చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ
రూ.36 కోట్లతో కంపచెట్ల తొలగింపు.. పునర్నిర్మాణానికి నిధుల సేకరణ
వరల్డ్ బ్యాంకు, ఏడీబీ సాయం.. కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్
ఏప్రిల్ 1న రాష్ట్రానికి 4,285 కోట్లు.. హడ్కో నుంచి 11 వేల కోట్ల రుణం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గతేడాది టీడీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం రాగానే రాజధాని పనులపై దృష్టి పెట్టారు. ముందుగా 25వేల ఎకరాల్లో రూ.36 కోట్లతో కంపచెట్ల తొలగింపు చేపట్టి పూర్తి చేశారు. గత ప్రభుత్వం నిలిపివేసిన పనుల పునఃప్రారంభం, వాటి పరిస్థితిపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 23 రకాల సూచనలు చేయగా, ప్రభుత్వం ఆమోదించింది. వరల్డ్ బ్యాంకు, ఏడీబీ నుంచి వచ్చిన మొత్తంతో పాటు కేంద్రం మ్యాచింగ్ గ్రాంట్ కలుపుకొని ఏప్రిల్ 1న రూ.4,285 కోట్లు అందాయి. హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు రుణంగా తీసుకోనున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మొత్తం 100 పనులను రూ.77,249కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే రూ.49,040కోట్ల పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
బ్రాండ్ అమరావతి పునరుద్ధరణ
జగన్ తీరుతో మసకబారిన బ్రాండ్ అమరావతి ఇమేజ్ను పునరుద్ధరించే పనిలో సీఎం చంద్రబాబు నిమగ్నమయ్యారు. ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలనిచ్చి పారిశ్రామికవేత్తలు తిరిగి అమరావతిలో తమ కార్యాలయాలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే విట్, ఎస్ఆర్ఎం, అమృత వర్సిటీలు ఏర్పాటయ్యాయి. రానున్న కాలంలో టాటా ఇన్నోవేషన్ హబ్, బిట్స్ పిలానీ లా స్కూల్, ఎక్స్ఎల్ఆర్ఐ వర్సిటీ వంటి సంస్థలు రాబోతున్నాయి. అమరావతిని పూర్తిస్థాయి ఏఐ నగరంగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. అడ్వాన్స్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్‌ని ఏర్పాటు చేయబోతున్నారు.
స్వయం సమృద్ధి నగరం
అమరావతిని స్వయం సమృద్ధి నగరంగా నిర్మించాలని చంద్రబాబు ఆలోచన. దీనికి అనుగుణంగా 8,603 చదరపు కిలోమీటర్ల పరిధిని రాజధాని ప్రాంతంగా గుర్తించారు. ఇందులో 217 చ.కి.మీ. పరిధిలో రాజధాని నగరం నిర్మితమవుతుంది. 16.9 చ.కి.మీ. పరిధిలో కోర్ క్యాపిటల్‌ను డిజైన్ చేశారు. విశాలమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ పవర్ లైన్స్, నీటి వసతి, బ్లూ అండ్ గ్రీన్ కాన్సె ప్ట్‌తో ఆహ్లాదకరమైన ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రభుత్వం, న్యాయ, వైద్యం, పర్యాటకం, నాలెడ్జ్ ఫైనాన్స్, స్పోర్ట్స్, మీడియా, టూరిజం వంటి 9 కార్యకలాపాలపై దృష్టి సారించి 9 థీమ్‌ల్లో 9 నగరాలు ప్లాన్ చేశారు. ప్రపంచ ప్రఖ్యాత డిజైనింగ్ సంస్థ నార్మన్ పోస్టర్‌తో ముఖ్య కార్యాలయాల డిజైన్లు చేయించారు. 2014-19 మధ్యకాలంలో మొదటి దశ పనులకు అయ్యే ఖర్చు రూ.55,343 కోట్లుగా అంచనా వేశారు. 55 పనులకు రూ.42,500 కోట్లతో టెండర్లు పిలిచారు. 2019 నాటికి రూ.5,587 కోట్ల విలువైన పనులు పూర్తికాగా, 4,318కోట్ల బిల్లులు చెల్లించారు. రాజధాని ప్రాంతంలో 30 శాతం పచ్చదనానికి, జలవనరులకు కేటాయించారు. ఐఆర్ఆర్, ఓఆర్ఆర్తో పాటు ఏడు జాతీయ రహదారులు అమరావతి అనుసంధానమయ్యేలా రూపకల్పన చేశారు. 3,300 కి.మీ.మేర సైక్లింగ్, వాకింగ్ ట్రాక్‌లతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుచేస్తారు. 131కేంద్ర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు 1277 ఎకరాలు కేటాయించారు.
జగన్ ఏలుబడిలో విధ్వంసం
2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ అమరావతిని కొనసాగిస్తానన్న హామీని తుంగలో తొక్కారు. ప్రజారాజధానిపై కక్ష సాధించారు. అమరావతి పనులను ఎక్కడికక్కడే ఆపేశారు. రాజధాని అమరావతిపై బురదజల్లి విష ప్రచారం చేశారు. పర్యావరణ విధ్వంసమని, ఆహార భద్రతకు ముప్పు అని ఆరోపణలు చేశారు. నిర్మాణాలకు అనుకూలం కాదని, భూకంపాల ప్రమాదం ఉందని ప్రచారం చేశారు. ఇవన్నీ తప్పుడు ప్రచారాలని తేలింది. వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన భవనాలను శిథిలాలుగా మార్చారు. 70 నుంచి 90 శాతం పూర్తయిన వాటినీ నిలిపివేశారు.
దేశ చరిత్రలోనే రికార్డు
గత టీడీపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు పిలుపు మేరకు ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా 29,373 మంది రైతులు 34,281 ఎకరాలను భూసమీకరణ ద్వారా అందించారు. భూములు త్యాగం చేసిన వారిలో 32 శాతం ఎస్సీలు, ఎస్టీలు కాగా, బీసీలు 14 శాతం, రెడ్డి సామాజికవర్గం 20 శాతం, కమ్మ 18 శాతం, కాపులు 9 శాతం, ముస్లింలు 3 శాతం ఉన్నారు. నాయకుడిపై నమ్మకంతో ఇంత మంది రైతులు ఇన్ని వేల ఎకరాలు భూసమీకరణలో ఇవ్వడం ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. రైతులు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి వేల ఎకరాలు ఇచ్చిన ఉదంతం దేశంలో అమరావతి ఒక్కటే. 58 రోజుల్లో భూసమీకరణ ప్రక్రియను ముగించేయడం మరో విజయం. భూసమీకరణ ద్వారా 34,281 ఎకరాలు, భూసేకరణ ద్వారా 4,300 ఎకరాలు తీసుకోగా, మిగిలిన 15,167 ఎకరాలు.. ప్రభుత్వ, అటవీ, కొండ, ఇతర భూములు. మొత్తం 54 వేల ఎకరాలు రాజధాని కోసం సమకూరింది. 2015 అక్టోబరు 22న రాజధానికి ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.
అమరావతీ అపురూపం
మేటి నగరంగా నిలిపే 11 ప్రాజెక్టులు.. నేడు ప్రధాని మోదీ శంకుస్థాపన
రాజధాని అమరావతిని మేటి నగరంగా తీర్చిదిద్దేందుకు మొత్తం 11 కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు. ప్రధాని మోదీ ఈ పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. రాజధానిలో రూ.75 వేల కోట్ల పనులు చేపట్టాలని నిర్ణయించగా.. ప్రస్తుతానికి రూ.49 వేల కోట్ల వ్యయంతో పనులు చేయడానికి టెండర్లు పిలిచారు. మోదీ శంకుస్థాపన చేసిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన పనులు చేయడానికి కాంట్రాక్టు సంస్థలన్నీ సంసిద్ధంగా ఉన్నాయి. రాజధానికి అసలైన రూపం మరో మూడేళ్ల తర్వాత కనిపిస్తుంది. ఐకానిక్ భవనాలుగా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్లను మూడేళ్లలో, ఇతర ప్రాజెక్టులను రెండేళ్ల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. రాజధానిలో సీఆర్డీఏ ఆధ్వర్యంలో చేపట్టే కీలక ప్రాజెక్టుల గురించి...
హ్యాపీనెస్ట్
రాజధాని నేలపాడులో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు తిరిగి పురుడు పోసుకుంటోంది. రూ.856.31 కోట్ల వ్యయంతో తొలి రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో జీ + 18 అంతస్తులతో కూడిన 12 టవర్లను నిర్మించబోతున్నారు. మొత్తం 1200 అపార్ట్మెంట్లు ఉంటాయి. 2018లో ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రాతిపదికన మొదటి నుంచి 1200 వరకు దరఖాస్తు చేసిన లబ్ధిదారులను ఎంపిక చేశారు. అత్యాధునిక వసతులతో జిమ్, ఇండోర్ స్టేడియం, స్పా, షాపులు వంటి సదుపాయాలతో హ్యాపీనె్‌స్టను అభివృద్ధి చేయనున్నారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్‌ల భవనాలు
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల నివాసాల కోసం భారీ బహుళ అంతస్తుల భవన సముదాయాల నిర్మాణాల బ్యాలెన్స్ పనులను రూ.452.30 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. స్టిల్ట్ + 12 అంతస్తులతో కూడిన మొత్తం 18 టవర్లను పూర్తి చేయాల్సి ఉంటుంది. 432 అపార్ట్మెంట్లు సమకూరుతాయి. 30 శాతానికి పైగా ఉన్న బ్యాలెన్స్ పనులను పూర్తి చేయాలి.
మంత్రులు, జడ్జీల బంగ్లాలు
మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తుల కోసం గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియాలో రూ.419.07 కోట్ల వ్యయంతో జీ ప్లస్ 1 విధానంలో 5,82,161 చదరపు అడుగుల విస్తీర్ణంలో మొత్తం 71 బంగ్లాల బ్యాలెన్స్ పనులు చేపట్టనున్నారు.
ఐకానిక్ అసెంబ్లీ
అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీ స్థానంలో శాశ్వత ప్రాతిపదికన రూ.617.33 కోట్లతో ఐకానిక్ అసెంబ్లీ భవన నిర్మాణం చేపడుతున్నారు. బేస్మెంట్+గ్రౌండ్+3 ఫ్లోర్లతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, అత్యుత్తమ ఆర్కిటెక్చరల్ డిజైన్‌తో నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో ఈ అసెంబ్లీని సందర్శనీయ ప్రాంతంగా అందుబాటులోకి తీసుకువస్తారు.
ఐకానిక్ హైకోర్టు
రాజధానిలో తాత్కాలిక హైకోర్టు స్థానంలో శాశ్వత ప్రాతిపదికన ప్రపంచస్థాయి ఆర్కిటెక్చరల్ డిజైన్లతో ఐకానిక్ హైకోర్టు భవనాన్ని రూ.786.05 కోట్ల వ్యయంతో చేపడుతున్నారు. బేస్మెంట్+గ్రౌండ్+7 ఫ్లోర్లతో రాఫ్ట్ టెక్నాలజీతో నిర్మించనున్నారు. దీన్నీ సందర్శనీయ ప్రాంతంగా అందుబాటులోకి తెస్తారు.
ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఐఏఎస్‌ల బంగ్లాలు
వివిధ శాఖల విభాగాధిపతులైన ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఐఏఎస్ అధికారుల కోసం రాయపూడి గ్రామంలో రూ.429.23 కోట్ల వ్యయంతో జీ ప్లస్ 1 విధానంలో 5,90,761 చదరపు అడుగుల విస్తీర్ణంలో 115 బంగ్లాల బ్యాలెన్స్ పనులను చేపట్టనున్నారు.
ఎల్పీఎస్ ఇన్ర్ఫా
రాజధాని కోసం పైసా ఆశించకుండా భూములు ఇచ్చిన రైతులకు నివాస, కమర్షియల్ రిటర్నబుల్ ప్లాట్లను ప్రభుత్వం అందిస్తోంది. ఈ లే అవుట్లను అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేయనుంది. రోడ్లు, డ్రెయిన్లు, నీటి సరఫరా, సీవరేజ్, యుటిలిటీ డక్ట్స్, రీయూజ్ వాటర్ లైన్స్ వంటి పనులు చేపట్టనుంది. వివిధ జోన్లలో దాదాపు 15 వేల కోట్ల వ్యయంతో ఎల్పీఎస్ ఇన్ర్ఫా పనులు పెద్ద ఎత్తున చేపడుతోంది.
ఐకానిక్ సచివాలయ టవర్లు
రాష్ర్టానికే ప్రధాన పరిపాలన కేంద్రమైన సచివాలయం కోసం జీ ప్లస్ 40 విధానంలో రూ.4,668 కోట్ల వ్యయంతో ఐకానిక్ సచివాలయ టవర్ల నిర్మాణ పనులకు సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. మొత్తం 5 టవర్లను డయాగ్రిడ్ విధానంలో చే పట్టనున్నారు. ఇందులో నాలుగు టవర్లను బేస్మెంట్ + 39 అంతస్తులు + టెర్రస్ గాను, ముఖ్యమంత్రి ఉండే టవర్‌ను మాత్రం బేస్మెంట్ + 47 ఫ్లోర్లు + హెలిప్యాడ్‌తో నిర్మించనున్నారు.
వరద నివారణ పనులు
రాజధానిలో వరద సమస్యను శాశ్వతంగా నివారించటానికి వీలుగా రూ. 5,944.26 కోట్ల వ్యయంతో మొత్తం 13 ప్యాకేజీలలో పనులు చేపట్టనున్నారు. కొండవీడువాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్ విస్తరాభివృద్ధితో పాటు నీరుకొండ రిజర్వాయర్, ఇతర రిజర్వాయర్ల నిర్మాణం, పంపింగ్ స్టేషన్ల నిర్మాణం, వరదనీటి మళ్లింపు కాల్వలు, సంబంధిత ఇతర పనులను చేపట్టనున్నారు.
ట్రంక్ ఇన్ర్ఫా వర్క్స్
రాజధానిలో రోడ్లు, కేబుల్స్ రహిత డక్ట్స్, సైకిల్ ట్రాక్స్, ఈ-6, ఈ-5, ఈ-7, ఈ-11, ఈ-13, ఈ-15, ఎన్-13, ఈ-2, ఈ-4, ఎన్-8, ఎన్-4, ఈ-10, ఈ-12, ఎన్-7 రోడ్లకు సంబంధించిన పునరుద్ధరణ పనులను రూ.9,150 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు.
రోడ్డు అనుబంధ పనులు
రాజధానిలో ప్రధాన రోడ్లకు సంబంధించి సీఆర్డీఏ టెండర్లు ఖరారు చేసింది. వీటిలో ఈ-13, ఈ-15 రోడ్ల బ్యాలెన్స్ పనులతో పాటు వీటిని ఎన్‌హెచ్-16కు అనుసంధానించటానికి వీలుగా రూ.700 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు. దీంతో ఎన్‌హెచ్-16 మీదుగా నేరుగా అమరావతిలోకి ప్రవేశించవచ్చు.
మోదీ పర్యటన షెడ్యూల్ ఇదీ
ప్రధాని మోదీ శుక్రవారం మధ్యాహ్నం తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 2.55 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రధానికి మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలుకుతారు.
గన్నవరం నుంచి ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్లో వెలగపూడి సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. హెలీప్యాడ్ వద్ద ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలుకుతారు.
మధ్యాహ్నం 3.20 గంటలకు హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో సభావేదిక వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
అమరావతి పనుల పునఃప్రారంభోత్సవాన్ని సూచించేలా ఏ ఆకారంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ప్రధాని ఆవిష్కరిస్తారు. ప్రధాన వేదికపై 14మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, కేంద్ర మంత్రులు కె.రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస భూపతివర్మ, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు లోకేశ్, నారాయణ ఇతర వీఐపీలు కూర్చుంటారు.
ప్రధాని సభలో ఆరోగ్య శాఖ భారీ ఏర్పాట్లు
3 తాత్కాలిక ఆసుపత్రులు.. 27 అంబులెన్సులతో వైద్య బృందాలు
ప్రధాని మోదీ సభ నేపథ్యంలో ఆరోగ్య శాఖ అత్యవసర స్పందనకు భారీగా ఏర్పాట్లు చేసింది. సూపర్ స్పెషాలిటీ, స్పెషాలిటీ వైద్యులతో కూడిన 30 బృందాలని వివిధ పాయింట్లలో నియమించారు. అడ్వాన్స్డ్ లైఫ్ సిస్టమ్స్‌తో కూడిన ఆరు అంబులెన్సులు, బేసిక్ లైఫ్ సిస్టమ్స్‌తో కూడిన మరో 21 అంబులెన్సులు వివిధ చోట్ల అందుబాటులో ఉంటాయి. అంబులెన్సులతో కూడిన వైద్య బృందాలు విమానాశ్రయం, హెలీప్యాడ్, కాన్వాయ్ మార్గం, గ్యాలరీలు, పార్కింగ్ ప్రాంతాల్లో సేవలందిస్తాయి. సభాస్థలి వద్ద 10 పడకలతో కూడిన మూడు తాత్కాలిక ఆసుపత్రులనూ ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది. వైద్య సేవల ఏర్పాట్లను మంత్రి సత్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో రెండుసార్లు సమీక్ష చేశారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని సభకు హాజరయ్యే వారికి మజ్జిగ, ఓఆర్ఎస్ అందించడానికి ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో కూడి మరిన్ని వైద్య బృందాలను ఏర్పాటు చేశారు.