Share News

Amaravati: రాజధానిలో కొత్తగా 6 సంస్థలకు భూములు

ABN , Publish Date - Jun 24 , 2025 | 04:59 AM

రాజధాని అమరావతిలో మరో ఆరు సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయించింది. గతంలో నాలుగు సంస్థలకు జరిపిన భూ కేటాయింపుల్లో మార్పులు చేసింది. మరో రెండు సంస్థలకు రద్దు చేసింది.

Amaravati: రాజధానిలో కొత్తగా 6 సంస్థలకు భూములు

  • ఆదాయ పన్ను శాఖ, గ్రామీణ బ్యాంకుకు రెండేసి ఎకరాలు

  • మొత్తం 74 సంస్థలకు భూ కేటాయింపులు పూర్తి

  • గతంలోని 4 సంస్థలకు మార్పులు.. 2 సంస్థలకు రద్దు

  • 8సబ్‌ కమిటీ నిర్ణయం: మంత్రి నారాయణ

అమరావతి, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో మరో ఆరు సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయించింది. గతంలో నాలుగు సంస్థలకు జరిపిన భూ కేటాయింపుల్లో మార్పులు చేసింది. మరో రెండు సంస్థలకు రద్దు చేసింది. రాజధానిలో ఇప్పటి వరకు 74 సంస్థలకు భూ కేటాయింపులు పూర్తి చేసింది. రాజధానిలో భూ కేటాయింపుల సబ్‌ కమిటీ సమావేశం సోమవారం అమరావతి సచివాలయంలో జరిగింది. మంత్రులు నారాయణ, టీజీ భరత్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్‌, కందుల దుర్గేశ్‌ ఆన్‌లైన్‌ ద్వారా హాజరయ్యారు. ఈ సమావేశంలో 2014-19 మధ్య పలు సంస్థలకు జరిపిన భూ కేటాయింపుల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీబీఐకి రెండెకరాలు, జియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకు రెండెకరాలు, స్టేట్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు ఐదెకరాలు, ఏపీ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌(ఆప్కాబ్‌)కు మూడెకరాల కొనసాగింపునకు ఆమోదం తెలిపినట్లు మంత్రి నారాయణ మీడియాకు చెప్పారు.


ఈ నాలుగు సంస్థలకు గతంలో జరిపిన భూ కేటాయింపుల్లో సవరణలు చేసినట్లు తెలిపారు. అలాగే 2014-19లో గెయిల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, అంబికా అగర్‌ బత్తి సంస్థకు జరిపిన భూ కేటాయింపులను రద్దు చేసినట్లు ప్రకటించారు. తాజాగా ఆదాయ పన్ను శాఖకు రెండెకరాలు, ఏపీ గ్రామీణ బ్యాంకుకు రెండెకరాలు, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు 0.4 ఎకరాలు, ఎ్‌సఐబీకి 0.5 ఎకరాలు, బ్యూరో ఆఫ్‌ ఇమిగ్రేషన్‌కు 0.5 ఎకరాలు, బీజేపీ కార్యాలయానికి రెండెకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 2014-19 మధ్య 130 సంస్థలకు 1,270 ఎకరాలు కేటాయించగా, పలు సంస్థలు వెనక్కి వెళ్లిపోయానని, ఆయా సంస్థలతో మళ్లీ సంప్రదింపులు జరిపి, భూ కేటాయింపుల విషయంలో నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 64 సంస్థలకు 884 ఎకరాలు కేటాయించగా, తాజాగా 10 సంస్థలకు భూ కేటాయింపులు పూర్తి చేశామని చెప్పారు. భూ కేటాయింపులు చేసిన సంస్థలు వీలైనంత త్వరగా నిర్మాణాలు ప్రారంభిస్తాయన్నారు.

Updated Date - Jun 24 , 2025 | 04:59 AM