TDP office attack: మా నేతల ప్రోద్బలంతోనే
ABN , Publish Date - Jun 01 , 2025 | 03:26 AM
టీడీపీ కార్యాలయం దాడి కేసులో సీఐడీ విచారణకు హాజరైన ఆళ్ల రామకృష్ణారెడ్డి తనపై ఆరోపణలను ఖండించారు. దాడికి తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ రోజు తాను పొలంలో ఉన్నానని వెల్లడించినట్లు సమాచారం.
టీడీపీ ఆఫీసుపై దాడి
వైసీపీ పరంగానే జరిగింది
నాకెలాంటి సమాచారం లేదు
అప్పుడు పొలం పనుల్లో ఉన్నా
నేను ఎమ్మెల్యేనైనా.. నాకు తెలీకుండా చాలానే చేశారు
సీఐడీ విచారణలో ఆళ్ల
మా నేతల ప్రోద్బలంతోనే
సీఐడీ అధికారుల విచారణలో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి
గుంటూరు, మే 31(ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకుల ప్రోద్బలంతోనే మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిందని వైసీపీ నేత, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వెల్లడించినట్లు తెలిసింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఇటీవల సీఐడీ అధికారులు ఆళ్ల రామకృష్ణారెడ్డిని 127వ నిందితుడిగా చేర్చారు. ఈ క్రమంలో ఆయనను గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. దీంతో శనివారం రామకృష్ణారెడ్డి విచారణకు హాజరయ్యారు. సీఐడీ డీఎస్పీ గోలి లక్ష్మయ్య ఆధ్వర్యంలో అధికారులు ఆయనను విచారించా రు. మొత్తం 38 ప్రశ్నలు సంధించగా అత్యధిక ప్రశ్నలకు ఆళ్ల స్పష్టమైన సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. గతంలో వైసీపీని ఎందుకు వీడారు? మళ్లీ తిరిగి ఎందుకు ఆ పార్టీలో చేరారు? వంటి అనేక ప్రశ్నలను మాత్రం ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.
పార్టీ పరంగానే..
పార్టీ పరంగానే టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిందనే విషయం అందరికీ తెలుసునని ఆళ్ల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పినట్లు తెలిసింది. ఈ దాడిని ఎవరైనా ఖండించాల్సిందేనని.. నేనైతే పూర్తిగా ఖండిస్తున్నానని చెప్పినట్లు సమాచారం. టీడీపీ కార్యాలయం పై దాడి జరిగిన రోజు తాను ఫిరంగిపురం మండలం పరిధిలోని వేమవరంలో ఉన్న తన పొలంలో ఉన్నట్లు రామకృష్ణారెడ్డి చెప్పారని సమాచారం. టీడీపీ ఆఫీసుపై దాడి జరిగినట్టు ఓ విలేకరి ఫోన్ చేసి చెప్పాకే.. తనకు తెలిసిందన్నారు. ‘‘మీరు సాక్షులను విచారించుకుంటే ఆ సమయంలో నేను ఎక్కడ ఉన్నదీ తెలిసిపోతుంది.’’ అని కూడా చెప్పినట్లు తెలిసింది. అయితే, ఈ దాడికి సంబంధించిన కుట్రతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. అంతేకాదు.. దాడికి సంబంధించి తనకు ‘పైనుంచి’ ఎలాంటి ఆదేశాలు కానీ, ముందస్తు సమాచారం కానీ లేదని ఆళ్ల వెల్లడించారు. ‘‘మీ నియోజకవర్గంలో మీకు తెలియకుండా ఎలా జరుగుతుంది.’’ అని సీఐడీ అధికారులు ప్రశ్నించగా.. నియోజకవర్గంలో నాకు తెలిసి జరిగినవి కొన్ని అయితే.. తెలియకుండా జరిగినవి కూడా చాలా ఉన్నాయని చెప్పినట్లు సమాచారం. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో తన అనుచరులు ఎవరూ పాల్గొనలేదని చెప్పారు. ‘‘దాడి కేసు విచారించిన పోలీసు అధికారుల సస్పెన్షన్ గురించి తెలుసా?.’’ అని ప్రశ్నించగా తాను పత్రికల్లో చదివి తెలుసుకున్నానని చెప్పారు. ‘‘ఏ అధికారి పైనా ఒత్తిడి చేయలేదు. కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోలేదు.’’ అని చెప్పినట్లు తెలిసింది.
ఇవి కూడా చదవండి
శ్రీకాంత్ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు
కలెక్టరేట్‌లో కరోనా.. ఐసోలేషన్‌కు ఉద్యోగులు
Read Latest AP News And Telugu News