Investment Opportunities: అంతరిక్ష, రక్షణ రంగాల్లో పెట్టుబడులకు మంచి అవకాశాలు
ABN , Publish Date - Apr 29 , 2025 | 03:57 AM
అంతరిక్ష మరియు రక్షణ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్ ఈ రంగాల్లో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
దేశంలో ఈ రంగాలు వేగంగా అభివృద్ధి
ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్
విజయవాడ, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): అంతరిక్ష, రక్షణ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, గత పదేళ్లలో ప్రపంచ దేశాల్లో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని ఏపీ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారు, ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు. విజయవాడ నగరంలో సోమవారం జరిగిన రక్షణ, పారిశ్రామిక క్లస్టర్ల రూపకల్పన భాగస్వాముల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని.. పారిశ్రామిక వేత్తలు, స్టార్టప్ కంపెనీలు వాటిపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని తెలిపారు. రాష్ట్రానికి చెందిన పలు కంపెనీలు శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రంతో భాగస్వామలయ్యాయని తెలిపారు. దేశంలో రక్షణ రంగ ఉత్పత్తులు పెరిగి, విదేశాలకు విక్రయించే స్థాయికి చేరుకున్నామని.. గతేడాది వాటి ఎగుమతుల ద్వారా రూ.1.75 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. విభిన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.
డిఫెన్స్ రంగాన్ని బలోపేతం చేయాలి: సతీశ్‌రెడ్డి
రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా గణనీయమైన వృద్ధి సాధించేందుకు అవ కాశాలు పుష్కలంగా ఉన్నాయని ఏరోస్పేస్ డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సతీశ్‌రెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబుతో గతంలో మాట్లాడినప్పుడు ఏపీని డిఫెన్స్, ఏరోస్పేస్ హబ్‌గా చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారన్నారు. ఆంధ్ర, తెలంగాణ ఆర్మీ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, వీసీఎ్‌సఎండీఏపీఐఐసీ ఐఏఎస్ కిశోర్, ఏపీ ఎంఎస్ఎంఈ సీఈవో విశ్వ, ప్రముఖ, యువ పారిశ్రామిక వేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.