Share News

Minister Atchannaidu: పొగాకు కొనుగోలుకు అదనపు కేంద్రాలు

ABN , Publish Date - Jul 15 , 2025 | 03:35 AM

నల్ల బర్లీ పొగాకు కొనుగోలుకు అదనపు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.

Minister Atchannaidu: పొగాకు కొనుగోలుకు అదనపు కేంద్రాలు

అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): నల్ల బర్లీ పొగాకు కొనుగోలుకు అదనపు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. సోమవారం గుంటూరు సమీపంలోని లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో బర్లీ పొగాకు కొనుగోలుపై అధికారులు, రైతు ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. విద్యుత్‌ శాఖ మంత్రి రవికుమార్‌ వర్చువల్‌గా పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ ‘గతేడాది 36వేల హెక్టార్లలో సాగైన బర్లీ పొగాకు 80మిలియన్‌ కిలోలు ఉత్పత్తి అవ్వగా, 36మిలియన్‌ కిలోల పొగాకును 22 కంపెనీలు, మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేశాయి. కొనుగోలును మరింత వేగవంతం చేసేందుకు గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కలెక్టర్లకు వెసులుబాటు కల్పిస్తున్నాం. ఈ నెల 21 నుంచి యాప్‌లో నమోదైన సన్నచిన్నకారు రైతుల నుంచి 1-20 క్వింటాళ్ల ఉత్పత్తిని నాణ్యత ప్రమాణాలతో వెంటనే కొనుగోలు చేస్తాం. 20 క్వింటాళ్లపైన ఉన్న రైతులకు కొనుగోలు తేదీల షెడ్యూల్‌ తెలియజేస్తాం. యాప్‌లో నమోదు కాని రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేయడానికి అధికారులు చర్యలు చేపడతారు. గ్రామాల్లో గోడౌన్లు నిండిపోయాయని రైతులు ఆందోళన చెందొద్దు. ప్రభుత్వమే పూర్తి రవాణా ఖర్చును భరించి, కొత్త గోడౌన్లకు పొగాకు చేరుస్తుంది. వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్ల గిడ్డంగుల్లో నిల్వ చేసేలా చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ప్రైవేట్‌ గోడౌన్లు అద్దెకు తీసుకుంటాం. ’ అని మంత్రి అన్నారు. ఎమ్మెల్యేలు పుల్లారావు, సాంబశివరావు, రామాంజనేయులు, పొగాకు బోర్డు, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2025 | 03:35 AM