Banakacharla Project: బనకచర్ల పై ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించండి
ABN , Publish Date - Jun 28 , 2025 | 03:36 AM
పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకంపై సీఎం చంద్రబాబు నిరంకుశంగా గాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్లాలని ఆలోచనాపరుల వేదిక డిమాండ్ చేసింది.
అఖిలపక్షం, మేధావుల అభిప్రాయాలు తెలుసుకోండి
పోలవరం-సోమశిల అనుసంధానంగా చేపట్టండి
సీఎంకు ఆలోచనాపరుల వేదిక బహిరంగ లేఖ
అమరావతి, జూన్ 27(ఆంధ్రజ్యోతి): పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకంపై సీఎం చంద్రబాబు నిరంకుశంగా గాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్లాలని ‘ఆలోచనాపరుల వేదిక’ డిమాండ్ చేసింది. ఈ వేదిక తరఫున రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, సాగునీటి రంగ నిపుణుడు, విశ్లేషకుడు టి.లక్ష్మీనారాయణ, రైతు సేవా సంస్థ అధ్యక్షుడు అక్కినేని భవానీప్రసాద్, రిటైర్డ్ ఈఎన్‌సీ కంభంపాటి పాపారావు శుక్రవారం ఆయనకు లేఖ రాశారు. కీలకమైన సమస్యలపై సంబంధిత రంగాల నిపుణులు, మేధావులు, రాజకీయపక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవలసిందేనని స్పష్టం చేశారు. పోలవరం-బనకచర్లపై తమ ఆలోచనలను ముఖ్యమంత్రికి వెల్లడించాలనుకుంటుంటే ఆయన సమయం దొరకడం లేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రధానమైన 12 అంశాలతో బహిరంగ లేఖ రాస్తున్నామన్నారు.
బనకచర్ల పథకాన్ని విరమించుకుని దానిని పోలవరం-సోమశిల అనుసంధా పథకంగా చేపట్టాలని కోరారు. బొల్లాపల్లి రిజర్వాయరు మీదుగా ప్రకాశం జిల్లాలోని నాగార్జున సాగర్ రెండో దశ ప్రతిపాదిత ఆయకట్టుకు, వెలిగొండ ప్రాజెక్టు ప్రధాన రిజర్వాయరు నల్లమల సాగర్‌కు నీటిని అందిస్తూ సోమశిలకు అనుసంధానించి సోమశిల ఆయకట్టుకు.. కండలేరు ద్వారా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని తెలుగుగంగ, గాలేరు-నగరి ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన ఆయకట్టుకు నీటిని అందించవచ్చని పేర్కొన్నారరు. తద్వారా కృష్ణాజలాలపై ఒత్తిడి తగ్గించవచ్చని సూచించారు. పెన్నా నీటిని ఆదా చేసి, రాయలసీమ ప్రాజెక్టులకు అందించవచ్చని తెలిపారు. ఈ అంశంపై సానుకూలంగా స్పందించి సముచిత నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబును వేదిక కోరింది.