Anti Corruption Bureau conducted surprise: పరుగో పరుగు
ABN , Publish Date - Nov 06 , 2025 | 04:51 AM
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతిపై వరుస ఫిర్యాదులు అందుతుండటంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఒక్కసారిగా జూలు విదిల్చింది...
12 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు
ఆళ్లగడ్డ కార్యాలయానికి ఏసీబీ రావడంతోనే సామగ్రి వదిలి డాక్యుమెంట్ రైటర్లు పరార్
‘ఒంగోలు’లో డబ్బులు విసిరేసిన కొందరు
వాష్‌రూమ్ నుంచి నగదు స్వాధీనం
లంచం ఫిర్యాదులు ఎక్కువవడంతో జూలు విదిల్చిన ఏసీబీ అధికారులు
తలుపులు మూసి.. సెల్‌ఫోన్లు తీసుకుని..రాత్రి వరకు సోదాలు.. ఉలిక్కిపడ్డ ఎస్‌ఆర్‌వోలు
రూ.10 వేల నుంచి 75 వేల వరకు లెక్క చూపని నగదు లభ్యం.. నేడూ సోదాలు
అమరావతి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతిపై వరుస ఫిర్యాదులు అందుతుండటంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఒక్కసారిగా జూలు విదిల్చింది. రాష్ట్రంలోని కీలకమైన 12సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బుధవారం ముమ్మర తనిఖీలు చేపట్టింది. విజయనగరం నుంచి చిత్తూరు వరకూ పలు జిల్లాల్లో ఏసీబీ అధికారులు చేపట్టిన సోదాల్లో లెక్కకుమించి నగదుతోపాటు రిజిస్ట్రేషన్లలో అక్రమాలు, డాక్యుమెంట్లలో తేడాలు బయటపడ్డాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద నగరమైన విశాఖపట్నంలో పెదగంట్యాడ, మధురవాడ, జగదాంబ సెంటర్ ఆఫీసుల్లో సోదాలు జరిపారు. అలాగే, విజయనగరం జిల్లా భోగాపురం, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, పల్నాడు జిల్లా నరసరావుపేట, ప్రకాశం జిల్లా ఒంగోలు, నెల్లూరు జిల్లా స్టోన్ హౌస్ పేట, తిరుపతి జిల్లా రేణిగుంట, సత్యసాయి జిల్లా చిలమత్తూరు; అన్నమయ్య జిల్లా రాజంపేట, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డల్లో తనిఖీలు నిర్వహించారు. భోగాపురం, జగదాంబ సెంటర్, ఇబ్రహీంపట్నం, ఒంగోలు, నెల్లూరు, నరసరావుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పది వేల రూపాయల నుంచి 75వేల వరకూ అనధికారిక నగదు లభించిందని ఏసీబీ డీజీ అతుల్ సింగ్ తెలిపారు. అనధికారిక లావాదేవీలు, లంచాల రూపంలో ఈ సొమ్ము సేకరించినట్లు అనుమానిస్తోన్న ఏసీబీ అధికారులు....మరింత లోతుగా కూపీ లాగుతున్నారు.
బయటపడ్డ అక్రమాలు
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏనీవేర్ రిజిస్ట్రేషన్‌లో ఎక్కువ అవకతవకలు జరుగుతున్నట్లు ఏసీబీ తాజా తనిఖీల్లో గుర్తించింది. కొన్నిచోట్ల నిషేధిత భూములను కలెక్టర్ అనుమతి లేకుండానే రిజిస్టర్ చేయడం, లంచాలు ఇవ్వని కొందరి ఆస్తుల రిజిస్ట్రేషన్ పత్రాలు యజమానులకు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టడం, డాక్యుమెంట్లు సమగ్రంగా లేకపోవడం వంటి లోపాలను గుర్తించిన ఏసీబీ అధికారులు, నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ల విక్రయాల రిజిస్టర్లను తనిఖీ చేస్తున్నారు.
తనిఖీలు కొనసాగుతున్నాయి: ఏసీబీ డీజీ అతుల్ సింగ్
‘‘సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతిపై మాకు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. వాటి ఆధారంగా పన్నెండు చోట్ల తనిఖీలు చేపట్టాం. రికార్డుల పరిశీలనలో తేడాలు గుర్తించాం. పలు పత్రాల ధ్రువీకరణ జరగాల్సి ఉంది. అన్నీ నిర్ధారించుకున్నాక పూర్తి వివరాలను వెల్లడిస్తాం. అవినీతిపై ప్రజలు ఆధారాలతో ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం’’ అని ఏసీబీ డీజీ అతుల్ సింగ్ తెలిపారు.
ఆళ్లగడ్డ, అన్నమయ్యలో డాక్యుమెంట్ రైటర్లు పరార్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఏసీబీ అధికారులు రావడంతోనే, అక్కడి ఆవరణలో ఉన్న డాక్యుమెంట్ రైటర్లు ల్యాప్‌టాప్, ప్రింటర్, ఇతర సామగ్రి, దస్తావేజులు అక్కడే పడేసి పరారయ్యారు. ఒక్క ఉద్యోగి వద్ద తప్ప అందరి వద్దా లెక్క చూపని నగదు లభించినట్టు ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్ చైతన్య రాయల్ నుంచి రూ.5,580, స్టాంప్ వెండర్ అనిల్ నుంచి రూ.8,060, సీనియర్ అసిస్టెంట్ చింతల షంషుద్దీన్ నుంచి రూ.17,040, డాక్యుమెంట్ రైటర్లు చాంద్‌బాషా నుంచి రూ2,180, విశ్వనాథ్‌రెడ్డి నుంచి రూ 17,480.. ఇలా మొత్తం రూ. 50,340 స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
జగదాంబ సెంటర్ (విశాఖ): సబ్ రిజిస్ర్టార్ అధికారి వద్ద రూ.పది వేలు నగదు లభించినట్టు తెలిసింది. అలాగే.. పెదగంట్యాడ, మధురవాడల్లోని సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహించారు.
ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్ జిల్లా): సబ్ రిజిస్టర్ ఎస్కే మహమ్మద్ పక్కన ఉన్న బీరువాలో లెక్క చూపని రూ.74,600 బయటపడింది. వసూళ్ల కోసమే ఈ కార్యాలయంలో ఇద్దరు ప్రైవేటు ఉద్యోగులు పని చేస్తున్నట్టు గుర్తించారు. ఏసీబీ జిల్లా డీఎస్పీ బీవీ సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు సాగాయి.
స్టోన్‌హౌ్‌సపేట (నెల్లూరు): ఏసీబీ అధికారుల రాకతో కార్యాలయంలో ఉన్న దళారులు పరుగులుతీశారు. అధికారిని, సిబ్బందిని వేర్వేరుగా ప్రశ్నించారు. కొంత నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
భోగాపురం (విజయనగరం): ఎయిర్‌పోర్టు వచ్చాక చుట్టుపక్కల భూములకు సంబంధించి అధికంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. దీంతో ఏసీబీ డీఎస్పీ రమ్య ఆధ్వర్యంలో ఇక్కడ సోదాలు నిర్వహించారు. కార్యాలయ తలుపులు మూసి అక్కడున్నవారందరి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని...క్షుణ్ణంగా తనిఖీలు జరిపారు.
నరసరావుపేట (పల్నాడు): మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన తనిఖీలు రాత్రి 8గంటల వరకు సాగాయి. లెక్కల్లో చూపని రూ.35వేల నగదుతోపాటు పలు రికార్డులు స్వాధీనంచేసుకున్నట్లు ఏసీబీ ఏఎస్పీ మహేంద్రమాతే తెలిపారు.
చిలమత్తూరు (శ్రీసత్యసాయి): ఏసీబీ అధికారులు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కార్యాలయంలోకి ప్రవేశించి తలుపులు మూసేశారు. సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్, ఇతర ఉద్యోగుల నుంచి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని విస్తృతంగా సోదాలు జరిపారు. కొంత నగదు పట్టుబడినట్లు తెలిసింది.
రేణిగుంట (తిరుపతి): కార్యాలయ స్వీపర్ నుంచి ఏసీబీ అధికారులు రూ.6,500 స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్లు, ఓ బ్యాగుతో ఇన్‌చార్జి సబ్ రిజిస్ర్టార్ ఆనంద్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు మురళీమోహన్ బయటకు పోవడాన్ని గమనించారు. ఆయన ఆ బ్యాగును డాక్యుమెంట్ రైటర్ వద్ద పెట్టడం గమనించి దానిని స్వాదీనం చేసుకున్నారు. అందులోని ఫైళ్లను పరిశీలించారు.
రాజంపేట (అన్నమయ్య): కార్యాలయంలో అనధికారికంగా పనిచేస్తున్న ఇరువురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఏసీబీ అధికారులను చూడగానే కార్యాలయ ప్రాంగణంలో ఉన్న డాక్యుమెంట్ రైటర్లు పరారయ్యారు. సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులు సెలవులో ఉన్నారు.
‘ఒంగోలు’లో డబ్బులు విసిరేసి.. వాష్‌రూమ్‌లో దాచి..
ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ మొదటి అంతస్థులోని జాయింట్ -1, జాయింట్-2 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు జరిగాయి. ఈ క్రమంలో కొంతమంది మొదటి అంతస్థు నుంచి కిందకు నగదు విసిరేసారు. ఆ మొత్తం రూ.30వేలు దాకా ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. జనరల్ వాష్‌రూంలో మరో రూ.18వేలు వారు కనుగొన్నారు. ఇలా మొత్తం రూ.48వేలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటికి కార్యాలయంలో పూర్తి అయిన 36 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల వివరాలు.. వాటికి సంబంధించిన లావాదేవీలు, నగదును కిందికి విసిరింది ఎవరు... వాష్ రూంలో ఉన్న నగదు ఎవరిది.. ఎందుకు దాచారు... అన్న కోణాల్లో రాత్రి పొద్దుపోయే వరకూ విచారించారు.