Govt School Students: 95 శాతం ట్రిపుల్‌ఐటీ సీట్లు ‘ప్రభుత్వ’ విద్యార్థులకే
ABN , Publish Date - Jun 24 , 2025 | 04:37 AM
రాష్ట్ర ట్రిపుల్ ఐటీలుగా భావించే ఆర్జీయూకేటీల్లో అడ్మిషన్లకు ఎంపికైన విద్యార్థుల జాబితాను ఉన్నత విద్యామండలి సోమవారం ప్రకటించింది.
ప్రైవేటు బడుల్లో చదివిన వారికి 5 శాతం
4,240 మందికి ఆర్జీయూకేటీ సీట్లు కేటాయింపు
ఇతర రాష్ర్టాల విద్యార్థులకు 200 సీట్లు
మొత్తం విద్యార్థుల్లో 69 శాతం అమ్మాయిలే
ఈనెల 30 నుంచి జూలై 5 వరకు కౌన్సెలింగ్
అమరావతి/వేంపల్లె, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ట్రిపుల్ ఐటీలుగా భావించే ఆర్జీయూకేటీల్లో అడ్మిషన్లకు ఎంపికైన విద్యార్థుల జాబితాను ఉన్నత విద్యామండలి సోమవారం ప్రకటించింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ ఈ లిస్టును ‘ఎక్స్’ ద్వారా విడుదల చేశారు. ట్రిపుల్ ఐటీల్లో మొత్తం 4,400 సీట్లు అందుబాటులో ఉండగా.. ప్రత్యేక క్యాటగిరి సీట్లు మినహాయించి 4,040 మంది రాష్ట్ర విద్యార్థులను, 200 మంది ఇతర రాష్ర్టాల విద్యార్థులను ఎంపిక చేశారు. వీరిలో 94.78 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, 5.22 శాతం మంది ప్రైవేటులో చదివిన వారు ఉన్నారు.
69.01 శాతం అమ్మాయిలు, 30.99 శాతం అబ్బాయిలు ఎంపికయ్యారు. 2025-26 విద్యాసంవత్సరంలో ఆరు సంవత్సరాల సమీకృత ఇంజనీరింగ్ కోర్సు కోసం ఆర్జీయూకేటీలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళంలో క్యాంప్‌సలకు 50,541 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు 27,713 మంది, ప్రైవేటులో చదివిన వారు 19,670 మంది, ఇతర రాష్ర్టాల వారు 3,158 మంది ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వెయిటేజీ మార్కులు కేటాయించి మెరిట్, రిజర్వేషన్ ప్రాతిపదికన జాబితాను తయారు చేసి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
ఎంపికైన విద్యార్థులు ఆర్జీయూకేటీ వెబ్‌సైట్ లేదా మనమిత్ర వాట్సాప్ నంబరు ద్వారా కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆర్జీయూకేటీ ఇన్‌చార్జ్ చాన్స్‌లర్ కె.మధుమూర్తి తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఈనెల 30 నుంచి జూలై 5వరకు జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలన్నారు. జూలై 14 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. నాలుగు క్యాంప్‌సలకు వేర్వేరుగా కౌన్సెలింగ్ తేదీలను నిర్ణయించారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాకు 8.69 శాతం, ప్రకాశంకు 7.3 శాతం, నెల్లూరుకు 6.53 శాతం, అనకాపల్లికి 6.34 శాతం సీట్లు దక్కాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాకు అత్యల్పంగా 7 సీట్లు (0.17 శాతం) మాత్రమే వచ్చాయి.