SSC Evaluation: 83 శాతం పేపర్లలో మార్కులు మారలేదు
ABN , Publish Date - May 31 , 2025 | 04:06 AM
ఈ సంవత్సరం పదో తరగతి రీవెరిఫికేషన్‌లో 83.16% పేపర్లలో మార్కులు మారలేదు; ఇది మూల్యాంకనంలో నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది. గత ఏడేళ్లుగా విధానంలో మార్పులు లేకపోవడం వల్లే పొరపాట్లు కొనసాగుతున్నాయని విద్యావేత్తలు అంటున్నారు.
పదో తరగతి మూల్యాంకనంపై విద్యా శాఖ
16.32% పేపర్లలో 10లోపు మార్కులు తేడా.. 0.52 % పేపర్లలో 11-15 వ్యత్యాసం
మొత్తం దిద్దినా మార్కులు కలపలేదు
మూడంచెల పర్యవేక్షణలోనూ లోపాలు
పదో తరగతి మూల్యాంకనంపై విద్యాశాఖ
అమరావతి, మే 30(ఆంధ్రజ్యోతి): పదో తరగతి విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనంలో 83.16 శాతం పేపర్లలో మార్కులు మారలేదని పాఠశాల విద్యాశాఖ గుర్తించింది. 34,709 మంది విద్యార్థులు... 66,363 పేపర్లపై రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. 24,550 మంది విద్యార్థులకు సంబంధించిన 55,188(83.16శాతం) పేపర్లలో మార్కులు మారలేదు. 11,175 పేపర్లలో మాత్రమే మార్కులు మారాయి.

8,863 పేపర్లలో 1 నుంచి 5 మార్కులు, 1,506 పేపర్లలో 6 నుంచి 10 మార్కులు కలిశాయి.
గత ఏడేళ్ల నుంచీ ఇంతే!
గత పదేళ్లుగా మూల్యాంకనం విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో పొరపాట్లు కొనసాగుతున్నాయని విద్యావేత్తలు చెబుతున్నారు. 2019లో 19 శాతం, 2022లో 20శాతం, 2023లో 18శాతం, 2024లో 17శాతం, 2025లో 16.32శాతం మార్కులు మారాయి. మూల్యాంకనంలో పొరపాట్లు జరిగినా సంబంధిత టీచర్లు, ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. అయితే.. ఈ మూల్యాంకనంలో మూడంచెల వ్యవస్థ ఉంటుంది. ఏ పేపర్‌నైనా అసిస్టెంట్ ఎగ్జామినర్, స్పెషల్ ఎగ్జామినర్, చీఫ్ ఎగ్జామినర్ ముగ్గురూ పేపర్లను పరిశీలించి సంతకాలు చేయాలి. పేపర్లపై సంతకాలు చేస్తున్నా పరిశీలన పూర్తిస్థాయిలో జరగటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ పొరపాట్లకు కూడా మూల్యాంకనంలో లోపాలు ఎక్కడ జరిగాయో ప్రభుత్వ పరీక్షల విభాగం గుర్తించింది.
ప్రాథమిక కారణాలు
పేపర్లు పూర్తిగానే దిద్దినా కొన్ని విభాగాల మార్కులను తుది మార్కుల్లో కలపలేదు.
దిద్దిన సమాధాన పత్రాల్లోని మార్కులను ఓఎంఆర్ షీట్లలోకి మార్చే క్రమంలో పొరపాట్లు.
కొన్ని పేపర్లలో కొన్ని ప్రశ్నలను వదిలేయడం లేదా సున్నాలు వేయడం.
మూడంచెల పరిశీలన విధానం సమర్థంగా పనిచేయక పోవడం.
ఇవి కూడా చదవండి
ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
ఫేస్‌బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు
Read Latest AP News And Telugu News