Share News

Income Growth Programs: 15 నుంచి ఆన్‌లైన్‌లో 700 సేవలు

ABN , Publish Date - Aug 05 , 2025 | 05:01 AM

విజన్‌, ప్రజలు, ప్రకృతి, సాంకేతికతలకు పాలనలో ప్రాధాన్యమిస్తే అత్యుత్తమ ఫలితాలు వస్తాయని సీఎం చంద్రబాబు చెప్పారు.

Income Growth Programs: 15 నుంచి ఆన్‌లైన్‌లో 700 సేవలు

  • తలసరి ఆదాయం పెంచడం ద్వారా జీవన ప్రమాణాలు పెంచాలి

  • పథకాల అమలుతోపాటు ఆదాయం పెరిగేలా చూడాలి

  • రాష్ట్ర స్థూల ఉత్పత్తిపై సమీక్షలో సీఎం

అమరావతి, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): విజన్‌, ప్రజలు, ప్రకృతి, సాంకేతికతలకు పాలనలో ప్రాధాన్యమిస్తే అత్యుత్తమ ఫలితాలు వస్తాయని సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి, పనితీరు సూచీలపై ప్రణాళికా శాఖతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో, ముఖ్యమంత్రి సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 15 నుంచి ఆన్‌లైన్‌లో 700 ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ‘కేవలం 60 లక్షల జనాభా, పరిమితమైన వనరులతో సింగపూర్‌ అంతర్జాతీయంగా విజయాలు సాధిస్తోంది. భారత్‌లో 140 కోట్లకు పైగా జనాభా, అపారమైన వనరులతో చాలా విజయాలు సాధించే అవకాశం ఉంది. ప్రతీ త్రైమాసికానికి సాధిస్తున్న పురోగతిపై ప్రభుత్వ శాఖలు సమీక్షించుకోవాలి. తలసరి ఆదాయం పెంచడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచా లి. 2025-26లో తలసరి ఆదాయం రూ.3,47,871 సాధించాలి. 2029 నాటికి రూ.5.42 లక్షల తలసరి ఆదాయం వచ్చేలా లక్ష్యంగా పెట్టుకోవాలి. ప్రస్తుతం అవేర్‌ ద్వారా వివిధ విభాగాలకు సంబంధించిన 42 సూచీలను పర్యవేక్షిస్తున్నాం. మిగతా ప్రభుత్వ విభాగాలు కూడా సూచీలను ఏర్పాటు చేసుకోవాలి. ప్రభుత్వ శాఖలు ఆయా రంగాల్లో ముందస్తు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి. కుటుంబం ఒక యూనిట్‌గా తీసుకుని పథకాలు, కార్యక్రమాలు రూపొందించాలి. పథకాలతో పాటు వారి ఆదాయాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలి. పర్యావరణానికి మేలు చేసే విధంగా ప్రభుత్వ విధానాలు, ప్రజలు ఆలోచనలు ఉండాలి. సహజ వనరులను రక్షించుకుంటూ ప్రకృతిని కాపాడుకోవాలి. ఒక పరిశ్రమలో తయారైన వ్యర్థాన్ని మరో పరిశ్రమకు ముడిసరుకు అయ్యేలా చేసి సర్క్యులర్‌ ఎకానమీకి నాంది పలకాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న మార్పుల మేరకు ప్రణాళికలు రూపొందించుకోవాలి. మన ఉత్పత్తులకు విలువ జోడింపు అనేదే కీలకం. దీంతోనే రాష్ట్ర స్థూల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. జీఎస్డీపీ వృద్ధి అయితేనే ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించగలం. ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు ముఖ్యం. ప్రతీ కుటుంబం ఆర్థిక, ప్రజారోగ్య వివరాలు నమోదు కావాలి. అడవుల విస్తరణ, నాణ్యమైన గాలి, తలసరి విద్యుత్‌ వినియోగాన్ని సంబంధిత శాఖలు నమోదు చేయాలి’ అని చంద్రబాబు ఆయా శాఖాధిపతులను ఆదేశించారు. ప్రస్తుతం ఉద్యాన పంటల ద్వారా రూ.1,26,098 కోట్ల జీవీఏ వచ్చిందనీ, ఆక్వా అనుబంధ పరిశ్రమలకు రూ.1.12 లక్షల కోట్ల మేర జీవీవో జోడించినట్టు అధికారులు చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మందు బాబులకు గుడ్ న్యూస్

కవితకు షాక్ ఇచ్చిన కోర్టు

For More AP News and Telugu News

Updated Date - Aug 05 , 2025 | 05:01 AM