Share News

YSRCP: ఐప్యాక్‌కు డబ్బుల్‌ ధమాకా

ABN , Publish Date - May 13 , 2025 | 04:30 AM

వైసీపీ ప్రభుత్వంలో వలంటీర్ల శిక్షణ, పర్యవేక్షణ పేరిట ఐప్యాక్‌కు చెందిన సంస్థలకే రూ.554 కోట్ల ప్రజాధనం చేరిందన్న అనుమానాలు వెల్లివిరిశాయి. రామ్‌ ఇన్ఫో, యూని కార్పొరేట్‌, అదాన్‌ డిస్టిలరీస్‌ మధ్య ఉన్న అనుబంధంపై సమగ్ర విచారణ జరిపితే అసలు నిజాలు వెలుగులోకి రావచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

YSRCP: ఐప్యాక్‌కు డబ్బుల్‌ ధమాకా

జగన్‌ సర్కారులో వలంటీర్ల ‘పేరిట’ వందల కోట్లు సరికొత్త దోపిడీ

ప్రజలకు సేవ పేరిట నియమించిన వలంటీర్లను వైసీపీ కోసం ఉపయోగించుకున్న జగన్‌ సర్కారు.. అస్మదీయ సంస్థలకు వందల కోట్లు దోచిపెట్టడానికి వారి ‘పేరు’ను కూడా బాగా వాడుకుంది. వలంటీర్లకు ‘శిక్షణ’ పేరిట రూ.274 కోట్లు దోపిడీ చేయగా.. అదే వలంటీర్లపై ‘పర్యవేక్షణ’ పేరిట మరో రూ.280 కోట్ల కాంట్రాక్టు అప్పనంగా ఇచ్చినట్టు తాజాగా బయటపడింది.

ఈ రెండు కాంట్రాక్టులూ పొందింది రామ్‌ ఇన్ఫో అనే సంస్థ. అయితే.. తెరవెనుక కథ నడిపించిందేమో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ఐప్యాక్‌ సంస్థ. రామ్‌ ఇన్ఫో ద్వారా ఈ మొత్తం రూ.554 కోట్లు ఐప్యాక్‌కు చేరినట్టు బలమైన ఆరోపణలు వస్తున్నాయి. ఇంత మొత్తం జనం సొమ్ము దోచిపెట్టి వైసీపీకి రాజకీయ లబ్ధి కలిగేలా వలంటీర్లు, ఐప్యాక్‌ను వాడుకున్నారు.

‘శిక్షణ’ పేరిట రూ.274 కోట్లు

అదనంగా ‘పర్యవేక్షణ’కు 280 కోట్లు

మానవ వనరుల పేరిట రామ్‌ ఇన్ఫోకు కాంట్రాక్టు

యూని కార్పొరేట్‌తో కన్సార్షియం

1045 మంది సేవలు.. వీరంతా ఐప్యాక్‌ వారే?

కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, ప్రతిపక్షాలపై నిఘా

వైసీపీ కోసం సాగిన ‘పర్యవేక్షణ’

రామ్‌ ఇన్ఫో ద్వారా సొమ్ము ఐప్యాక్‌కు?

2021లో యూని కార్పొరేట్‌,

అదాన్‌ డిస్టిలరీస్‌ చిరునామాలు ఒక్కటే వాటి లింక్‌ ఏమిటో?

విచారిస్తే అసలు గుట్టు వెలుగులోకి

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సత్యాలు, అబద్ధాలు, ఫేక్‌ ప్రచారాలతో 2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి ఐప్యాక్‌ వ్యూహరచన చేసింది. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఇందుకు ప్రతిఫలంగా.. ఐప్యాక్‌కు మేళ్లు జరిగేలా భారీ ప్రణాళికనే అమలు చేశారు. ఎక్కడా ఆ సంస్థకు నేరుగా డబ్బులు చెల్లించినట్లు కనిపించకుండా కొత్త రకం కనికట్టు విద్యను ప్రదర్శించారు. ఫీల్డ్‌ ఆపరేటింగ్‌ ఏజెన్సీ (ఎఫ్‌ఓఏ)ని ఏర్పాటు చేసి తన చాతుర్యాన్ని ప్రదర్శించారు. వలంటీర్లకు శిక్షణ పేరిట రామ్‌ ఇన్ఫో సంస్థకు నాలుగేళ్లలో రూ.274 కోట్లు సమర్పించిన విషయం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఆ డబ్బు మరో మార్గంలో ఐప్యాక్‌ కే చేరిందన్న అనుమానాలున్నాయి. ఇప్పుడు మరో దందా వెలుగులోకి వచ్చింది. వలంటీర్లపై పర్యవేక్షణ పేరిట రామ్‌ ఇన్ఫోకు మరో కాంట్రాక్టు ఇచ్చి రూ.280 కోట్లు సమర్పించారు. ఈ డబ్బు కూడా రూట్‌ మారి ఐప్యాక్‌కే చేరిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తమ్మీద జగన్‌ ప్రభుత్వంలో వలంటీర్లకు శిక్షణ, పర్యవేక్షణ పేరిట నాలుగేళ్లలో నికరంగా రూ.554 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని సమర్పించారు.


పర్యవేక్షణ అంటూ నిఘా

వలంటీర్లపై పర్యవేక్షణ అంటే.. వారు ఏం పని చేస్తున్నారు? ఎక్కడికి వెళ్లాలి? ఎలాంటి డేటా సేకరించాలి? ఆ డేటాను ఎవరికి అందించాలి? అన్న అంశాలపై దిశానిర్దేశం చేసేందుకు జగన్‌ ప్రభుత్వంలో రామ్‌ ఇన్ఫోకు రూ.280 కోట్లకు మరో కాంట్రాక్టు ఇచ్చారు. దానిపేరు మానవ వనరుల కాంట్రాక్ట్‌. రామ్‌ ఇన్ఫో యూని కార్పొరేట్‌ అనే సంస్థతో కన్సార్షియంగా ఏర్పడింది. ఆ సంస్థ పేరిట పర్యవేక్షణ వ్యవహారాలు నడిపించింది. మానవ వనరుల కింద రాష్ట్ర వ్యాప్తంగా 1045 మందిని ఆ సంస్థ దింపింది. మండలం, రెవెన్యూ డివిజన్‌, జిల్లా కేంద్రాల్లో ఒక్కొక్కరు చొప్పున పనిచేశారు. పైకి రామ్‌ ఇన్ఫో ప్రతినిధులుగా చెలామణి అయినా వీరంతా ఐప్యాక్‌కు చెందినవారని అధికార వర్గాలు అనుమానిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో సూపర్‌బా్‌సలుగా వ్యవహరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఇతర అధికార యంత్రాంగం దగ్గరికి వెళ్లి తాము ఫలానా ప్రతినిధులమని చెప్పి డేటా సేకరించేవారు. వీరు ఇచ్చే సమాచారాన్నే జగన్‌ ఎక్కువగా పరిగణనలోకి తీసుకునేవారు. దీంతో వీరంటే.. కలెక్టర్లు, ఇతర అధికారులు భయపడేవారు. వీరు వస్తున్నారంటే వీఐపీ ట్రీట్‌మెంట్‌ ఇచ్చేవారు. వీరు వైసీపీ ప్రభుత్వంలో ప్రత్యేక నిఘా వ్యవస్థలా పనిచేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, జిల్లా కలెక్టర్లు నిర్వహించే సమావేశాల్లో సైతం అనధికార ప్రతినిధులుగా కూర్చొనేవారు. నిజానికి రామ్‌ ఇన్ఫోతో ప్రభుత్వం చేసుకున్న కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం.. వలంటీర్ల పనితీరును పర్యవేక్షించడం వారి బాధ్యత. కానీ ప్రభుత్వ పనితీరునే పర్యవేక్షించి నివేదికలు ఇచ్చేవారు. ఆ నివేదికలు నేరుగా ఐప్యాక్‌కు చేరేవి. ఇలా జిల్లాల నుంచి వచ్చే నివేదికలను ఐప్యాక్‌ క్రోడీకరించి అంశాల వారీగా జగన్‌కు అందించేది. ఒక దశలో ఇంటెలిజెన్స్‌ ఇచ్చే నివేదికల కన్నా వీరు ఇచ్చే రిపోర్టులపైనే ఎక్కువగా ఆధారపడి సీఎం హోదాలో జగన్‌ నిర్ణయాలు తీసుకునేవారు. పేరుకు మాత్రమే రామ్‌ ఇన్ఫోకు కాంట్రాక్టు ఇచ్చారు. కానీ అసలు పని అంతా తెరవెనక ఐప్యాక్‌ నడిపించినట్టు తెలుస్తోంది. ఈ కాంట్రాక్టు కింద జగన్‌ సర్కారు చెల్లించిన రూ.280 కోట్లు వయా రామ్‌ ఇన్ఫో నుంచి ఐప్యాక్‌కు చేరి ఉంటాయన్న అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


అదాన్‌ డిస్టిలరీ్‌సతో లింకేమిటి?

మానవ వనరుల కాంట్రాక్ట్‌ కింద రామ్‌ ఇన్ఫోతో కలిసి పనిచేసిన యూని కార్పొరేట్‌ సంస్థకు అదాన్‌ డిస్టిలరీ్‌సతో ఉన్న అనుబంధం ఏమిటో తెలియాల్సి ఉంది. 2021లో ఈ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో దాని అడ్రస్‌ అదాన్‌ డిస్టిలరీస్‌ అడ్రస్‌ ఒక్కటిగానే ఉండింది. ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ అప్పట్లోనే ఆధారాలతో సహా బయటపెట్టింది. అదాన్‌ డిస్టిలరీస్‌, యూని కార్పొరేట్‌ సొల్యూషన్‌ చిరునామాలు అప్పట్లో హైదరాబాద్‌లోని ప్రశాంతి హిల్స్‌లో ఉన్నాయి. ఇది ఖాజాగూడలో ఉంది. ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన తర్వాత రెండు కంపెనీలు అడ్ర స్‌లు మార్చాయి. ఇప్పుడు ఇదే అదాన్‌ డిస్టిలరీస్‌ వేల కోట్ల మద్యం కుంభకోణంలో ఇరుక్కుంది. ఆ సంస్థకు యూని కార్పొరేట్‌ సంస్థతో ఉన్న అనుబంధం ఏమిటో తేలితే అసలు గుట్టు బయటకొస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ నేతలు ఇలాంటి కంపెనీలు పుట్టించి వాటికి టెండర్లు కట్టబెట్టి ప్రభుత్వ సొమ్మును దోచుకొని ఉంటారన్న అనుమానాలున్నాయు. కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణ చేస్తే అసలు గుట్టు బయటపడుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.

వైసీపీ-ఐప్యాక్‌ ప్రత్యేక బంధం

వైసీపీతో ఐప్యాక్‌కు ఎనలేని అనుబంధం ఉంది. ప్రతిపక్షాలపై అబద్ధపు ప్రచారాలు చేయడం, వైసీపీకి లేని బలాన్ని ఉన్నట్లు చూపడం, అబద్ధాన్ని నిజంగా, సత్యాన్ని అవాస్తవంగా ప్రచారం చేయడం తనకు వెన్నతో పెట్టిన విద్య అన్నట్లుగా వ్యవహరించింది. ఇలా అబద్ధాల మేడలపై జగన్‌కు రాజకీయంగా మేలు చేసి 2019లో అధికార పీఠంపై కూర్చోబెట్టేలా ఆ సంస్థ పనిచేసింది. అందుకు ఆయన ఎంత రుణం తీర్చుకున్నారో బయటకు చెప్పలేదు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆ సంస్థ సేవలను అటు వైసీపీకి, ఇటు ప్రభుత్వం కోసం వినియోగించుకున్నారు. వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన ఆయన దాని శిక్షణ బాధ్యతలను ఆ సంస్థకే అప్పగించాలనుకున్నారు. అయితే రాజకీయ విమర్శలు వస్తాయని ముందు జాగ్రత్తగా రామ్‌ ఇన్ఫో అనే సంస్థను తెరపైకి తీసుకొచ్చారు. నిజానికి ఆ సంస్థ శిక్షణ ఇచ్చింది లేదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వారు ఐప్యాక్‌ కనుసన్నల్లోనే పనిచేశారు. ఇదే తరహాలో వలంటీర్లపై పర్యవేక్షణ కాంట్రాక్టు సాగింది.


ఇవి కూడా చదవండి..

Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..

Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల

Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 13 , 2025 | 05:58 AM