Medical Reports : గుంటూరులో మరో 3 జీబీఎస్ కేసులు
ABN , Publish Date - Feb 23 , 2025 | 03:30 AM
గుంటూరులో మరో మూడు గులియన్ బారీ సిండ్రోమ్(జీబీఎస్) కేసులు వెలుగు చూశాయి.

బాధితుల్లో గర్భిణి.. 13కు చేరిన కేసులు
ప్రకాశం జిల్లాలో ఏఎన్‌ఎంకు వైరస్ లక్షణాలు
విజయవాడ ఆసుపత్రికి తరలించిన వైద్యులు
గుంటూరు(మెడికల్)/కనిగిరి, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): గుంటూరులో మరో మూడు గులియన్ బారీ సిండ్రోమ్(జీబీఎస్) కేసులు వెలుగు చూశాయి. బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రి న్యూరాలజీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గడిచిన మూడు రోజుల్లో కొత్తగా ఈ మూడు కేసులు నమోదైనట్లు ఆసుపత్రి అధికార వర్గాలు తెలిపాయి. జీబీఎస్ బాధితుల్లో గర్భిణి కూడా ఉన్నట్టు పేర్కొన్నాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా ఉందని న్యూరాలజీ వైద్యులు తెలిపారు. మిగిలిన ఇద్దరు సాధారణ వార్డుల్లోనే చికిత్సలు పొందుతున్నారు. దీంతో ఈ నెలలో గుంటూరు జీజీహెచ్‌లో చేరిన జీబీఎస్ కేసుల సంఖ్య 13కి చేరింది. బాధితులలో ప్రకాశం జిల్లాకు చెందిన కమలమ్మ(55), గుంటూరు నెహ్రూనగర్‌కు చెందిన షేక్ గోవర్‌జాన్‌బీ(60) మృతి చెందారు. మిగిలిన వారిలో ఆరుగురు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఐదుగురు చికిత్స పొందుతుండగా, వీరిలో గర్భిణి ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో ఆమె కోసం వెంటిలేటర్‌ను సిద్ధం చేశారు. ఇక ప్రకాశం జిల్లా కనిగిరి మండలం బొమ్మిరెడ్డిపల్లి గ్రామ వైద్య సేవా కేంద్రం ఏఎన్‌ఎంకు జీబీఎస్ లక్షణాలు కనిపించాయి. దీంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు క్లినిక్ వైద్యురాలు డాక్టర్ స్వప్న తెలిపారు.