Annamaiah District: మూడు ప్రాణాల్ని బలిగొన్న నిద్ర మత్తు
ABN , Publish Date - May 19 , 2025 | 04:40 AM
అన్నమయ్య జిల్లా పీలేరు వద్ద కారులో ప్రయాణిస్తుండగా నిద్రమత్తులో డ్రైవర్ అదుపు తప్పడంతో కారు బావిలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కర్ణాటక వాసులు మృతి చెందారు.
బావిలోకి దూసుకెళ్లిన కారు
ముగ్గురు కర్ణాటక వాసులు దుర్మరణం
అన్నమయ్య జిల్లా పీలేరు వద్ద ఘటన
పీలేరు, మే 18 (ఆంధ్రజ్యోతి): నిద్రమత్తు రూపంలో మృత్యువు ముగ్గురిని కబళించిన సంఘటన ఆదివారం వేకువజామున అన్నమయ్య జిల్లా పీలేరు మండలం జి.కురవపల్లె వద్ద జరిగింది. పీలేరు అర్బన్ సీఐ యుగంధర్ కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రం చింతామణి, కోలారు, కైవారం ప్రాంతాలకు చెందిన ఎన్.లోకేశ్(36), సీఎం శివానంద(44), ఎన్.చలపతి(48), జి.తిప్పారెడ్డి(43), సీవీ సునీల్ (29) వంటమాస్టర్లుగా పనిచేస్తున్నారు. తమ ప్రాంతాలకు చెందిన మరికొందరితో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో క్యాటరింగ్ కాంట్రాక్ట్ సర్వీసులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం పీలేరులో క్యాటరింగ్ చేసేందుకు తమిళనాడు రాష్ట్రం హోసూరులో శనివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో శివానంద కారులో బయలుదేరారు. కారును లోకేశ్ నడుపుతుండగా మార్గమధ్యంలోని పీలేరు మండలం బాలంవారిపల్లె పంచాయతీ జి.కురవపల్లె వద్దకు వచ్చేసరికి అతను నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో కారు అదుపు తప్పి రోడ్డుపక్కనే ఉన్న పాడుబడిన వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. కారు వెనుక సీటులో కూర్చున్న తిప్పారెడ్డి, సునీల్ అద్దాలు పగలగొట్టుకుని బయటకు వచ్చి సమీపంలోని వారికి సమాచారం అందించారు. వారు స్థానికులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, పీలేరు అగ్నిమాపక సిబ్బంది, గ్రామస్థులు క్రేన్ సాయంతో కారును బావిలో నుంచి బయటకు తీశారు. అప్పటికే నీటిలో మునిగి ఊపిరాడక లోకేశ్, శివానంద, చలపతి మరణించారు.