Accident At Annadanam Event: అన్నదాన కార్యక్రమంలో విషాదం.. చిన్నారుల మీద పడ్డ గంజి
ABN , Publish Date - Oct 04 , 2025 | 05:26 PM
వంట చేస్తున్న ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకుంది. మరుగుతున్న గంజి 16 మంది చిన్నారులు, మహిళలపై పడింది. ఆ నొప్పి తట్టుకోలేక వారంతా విలవిల్లాడారు. గట్టిగా కేకలు పెట్టారు.
అన్నదాన కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. మరుగుతున్న గంజి మీద పడి 16 మంది చిన్నారులతో సహా మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన విశాఖలోని జాలరిపేట పిల్లా అప్పమ్మయ్య సంఘం వద్ద చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. శనివారం దుర్గాదేవి మండపం దగ్గర అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి పెద్దఎత్తున చిన్నారులు, మహిళలు వచ్చారు.
ఈ నేపథ్యంలోనే వంట చేస్తున్న ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకుంది. మరుగుతున్న గంజి 16 మంది చిన్నారులు, మహిళలపై పడింది. ఆ నొప్పి తట్టుకోలేక వారంతా విలవిల్లాడారు. గట్టిగా కేకలు పెట్టారు. అక్కడున్న వారంతా వెంటనే బాధితులను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఇక, గాయపడ్డ వారిలో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. తీవ్రగాయాలైన ఆరుగురిని ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు సిబ్బంది. మిగిలిన వారికి ప్రాథమిక చికిత్స అందించి ఇంటికి పంపించాలని వైద్యులు నిర్ణయించారు.
కాగా, ఈ ఘటనపై ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ స్పందించారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణితో ఫోన్‌లో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్ట్ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్ సైతం గాయపడ్డ చిన్నారులను విశాఖ కేజీహెచ్‌కు వెళ్లి పరామర్శించారు.
ఇవి కూడా చదవండి
హ్యాపీగా ఉండాలంటే షారుఖ్ చెప్పిన సీక్రెట్ ఫాలో అవ్వాల్సిందే..
టెక్సాస్‌లో కాల్పుల కలకలం.. తెలుగు వ్యక్తి మృతి