New Bar Rules: గీత కార్మికులకు 10% బార్లు
ABN , Publish Date - Aug 05 , 2025 | 04:58 AM
బార్ పాలసీలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం షాపుల తరహాలోనే బార్ లైసెన్స్‌ల కేటాయింపులో
లాటరీ విధానంలోనే లైసెన్స్‌ల కేటాయింపు
ఒక్కో బార్‌కు 4 దరఖాస్తులు తప్పనిసరి
ఆదాయం ఒక్కటే కాదు.. ఆరోగ్యమూ ముఖ్యమే
బార్ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): బార్ పాలసీలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం షాపుల తరహాలోనే బార్ లైసెన్స్‌ల కేటాయింపులో గీత కార్మికులకు 10 శాతం వాటా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో బార్ పాలసీపై ఆయన సమీక్ష నిర్వహించారు. కొత్త పాలసీపై క్యాబినెట్ సబ్‌కమిటీ ప్రతిపాదనలను అధికారులు సీఎంకు వివరించగా వాటికి ఆయన ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో 840 బార్లు ఉండగా.. లాటరీ విధానంలోనే లైసెన్స్‌లు కేటాయించాలని నిర్ణయించారు. 50 వేల లోపు జనాభా ఉండే ప్రాంతాల్లోని బార్లకు రూ.35 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉంటే రూ.55లక్షలు.., 5 లక్షల జనాభా దాటితే రూ.75లక్షలు లైసెన్స్ ఫీజులుగా నిర్ణయించారు. కొత్త పాలసీలో దరఖాస్తు రుసుములు, లైసెన్స్ ఫీజుల రూపంలో ప్రారంభంలోనే రూ.700 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. కాగా.. ప్రతి బార్‌కు కనీసం నాలుగు దరఖాస్తులు తప్పనిసరిగా రావాలనే నిబంధన పెట్టాలని మరో నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ... ‘‘మద్యం పాలసీ అనగానే దేశంలో ఏ ప్రభుత్వమైనా ఆదాయం గురించి చూసుకుంటుంది. కానీ, ఆదాయం మాత్రమే కాదు... ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమేనని గుర్తుపెట్టుకోవాలి. ఆల్కాహాల్ కంటెంట్ తక్కువ ఉన్న మద్యం ద్వారా వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. గత ప్రభుత్వంలో నాణ్యత లేని మద్యం వల్ల లక్షలాది కుటుంబాలు నష్టపోయాయి. పేదల ఇళ్లు, వళ్లు గుల్ల కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’’ అన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లోని షాపుల్లో మద్యం అమ్మకాలు పెరగాడానికి కారణాలను అధికారులు సీఎంకు వివరించారు. ఏపీలో ధరలు తగ్గడం, అన్ని బ్రాండ్లు అందుబాటులోకి రావడం, నాణ్యమైన మద్యం దొరకడంతో మన రాష్ట్రంలోని వినియోగదారులు ఇక్కడి మద్యమే కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. కాగా, ఇప్పటివరకూ 12 జిల్లాలను నాటుసారా రహితంగా ప్రకటించామని, ఈ నెలలో మరో 8 జిల్లాలు, సెప్టెంబరు నాటికి అన్ని జిల్లాలు నాటుసారా రహితమవుతాయని చెప్పారు. సమీక్షలో మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For More AP News and Telugu News