TTD: ఇకపై ఆధార్ చూపితేనే వేంకటేశ్వరుడి లడ్డూలు
ABN, Publish Date - Aug 30 , 2024 | 01:33 PM
తిరుమల శ్రీవారి లడ్డూ విక్రయాల్లో టీటీడీ మార్పులు చేసింది. ఇకపై దర్శనం చేసుకోని భక్తులు లడ్డూలు పొందాలంటే తప్పనిసరిగా ఆఽధార్ కార్డు చూపాలని, వారికి కేవలం రెండు లడ్డూలు మాత్రమే విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది.
తిరుపతి: తిరుమల శ్రీవారి లడ్డూ విక్రయాల్లో టీటీడీ మార్పులు చేసింది. ఇకపై దర్శనం చేసుకోని భక్తులు లడ్డూలు పొందాలంటే తప్పనిసరిగా ఆఽధార్ కార్డు చూపాలని, వారికి కేవలం రెండు లడ్డూలు మాత్రమే విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం తిరుమలలోని లడ్డూకాంప్లెక్స్‌లో దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికీ ఓ లడ్డూను ఉచితంగా ఇవ్వడంతో పాటు అదనంగా లడ్డూలు కావాలంటే రూ.50 చొప్పున విక్రయించేది. దర్శనం చేసుకోకపోయినా రూ.50 చొప్పున అదనపు లడ్డూలు పొందే వెసులుబాటు ఉండేది. అయితే ఇటీవల లడ్డూలను బ్లాక్ మార్కెట్‌లో విక్రయించే దళారీల సంఖ్య పెరిగిపోయిందనే ఫిర్యాదులతో టీటీడీ మార్పులు చేపట్టింది.
గురువారం వేకువజాము నుంచి దర్శన టికెట్, టోకెన్ కలిగిన భక్తులకు ఉచిత లడ్డూతో పాటు అదనంగా రెండు లడ్డూలు విక్రయించారు. దర్శనం చేసుకోని భక్తుల నుంచి ఆధార్ కార్డు తీసుకుని ఆ వివరాలను నమోదు చేసిన తర్వాత రెండు లడ్డూలను రూ.50చొప్పున విక్రయించారు. దళారీలను అరికట్టేందుకు టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం మంచిదే అయినప్పటికీ రద్దీరోజుల్లో భక్తులు ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రద్దీరోజుల్లో చాలా మంది భక్తులు దర్శనం లభించకపోయినప్పటికీ కనీసం లడ్డూలైనా తీసుకువెళదామని భావిస్తారు. అయితే టీటీడీ తాజా నిర్ణయంతో అలాంటి భక్తులకు ఆధార్‌కార్డుపై కేవలం రెండు లడ్డూలు మాత్రమే అందనున్నాయి.
Updated at - Aug 30 , 2024 | 01:52 PM