కులవ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ..
ABN, Publish Date - Nov 05 , 2024 | 08:08 PM
భారతదేశంలో కులవ్యవస్థ బలంగా పాతుకుపోయిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. అగ్రకులాలకు ఎప్పుడూ నిమ్న కులాల వారు కనిపించరంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోనే ప్రజల మధ్య అత్యధిక అసమానతలు ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ విషయాన్ని ప్రపంచంలోనే నిష్ణాతుడైన ఆర్థికవేత్త తనకు చెప్పారని రాహుల్ వెల్లడించారు. అందుకు కారణం దేశంలో ఉన్న కుల వ్యవస్థ అని ఆ మేధాని చెప్పినట్లు తెలిపారు. హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రంలో కులగణనపై నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. మన దేశంలో కులవ్యవస్థ బలంగా పాతుకుపోయిందని ఆయన అన్నారు. అగ్రకులాలకు ఎప్పుడూ నిమ్న కులాల వారు కనిపించరని మండిపడ్డారు. నవంబర్ 6 నుంచి తెలంగాణలో చేపట్టే కులగణనతో అనేక మంది జీవితాలు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వేల సంవత్సరాలుగా నష్టపోతున్న వారికి తగిన న్యాయం జరుగుతుందని చెప్పారు. రాజకీయ, న్యాయ వ్యవస్థలు సహా దేశంలోని అన్ని రంగాల్లోనూ కుల వ్యవస్థ బలంగా ఉందని రాహుల్ తెలిపారు. కుల వ్యవస్థ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదని, కేవలం అది భారతదేశంలోనే ఉందని ధ్వజమెత్తారు. భారతదేశ ఆర్థికాభివృద్ధికి కుల వ్యవస్థ చాలా పెద్ద అవరోధంగా మారిందని అన్నారు. దాన్ని రూపు మాపాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో చేపట్టే కులగణన సమావేశానికి హాజరయ్యారు.
Updated at - Nov 05 , 2024 | 08:08 PM