Share News

హైదరాబాద్‌లో ఏ ప్రతిపాదికన ఓట్లు తొలగించారు?

ABN , Publish Date - Apr 20 , 2024 | 08:48 AM

హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపుపై పలు పార్టీల నేతలు అధికారులను ప్రశ్నించారు. ఏ ప్రతిపాదికన 5.41 లక్షల ఓట్లను తొలగించారు? బోగస్‌ ఓట్లకు సంబంధించి తాము చేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నారా? అని ప్రశ్నించారు.

హైదరాబాద్‌లో ఏ ప్రతిపాదికన ఓట్లు తొలగించారు?

- అధికారులను ప్రశ్నించిన పార్టీల నేతలు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపుపై పలు పార్టీల నేతలు అధికారులను ప్రశ్నించారు. ఏ ప్రతిపాదికన 5.41 లక్షల ఓట్లను తొలగించారు? బోగస్‌ ఓట్లకు సంబంధించి తాము చేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నారా? అని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో రాజకీయ పార్టీల నేతలతో జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రోస్‌ సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 8న జాబితా ప్రకటన అనంతరమూ ఓట్లు తొలగించారా? అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ ప్రశ్నించారు. తొలగింపులు జరిగాయని రోనాల్డ్‌ రోస్‌ సమాధానమిచ్చారని నిరంజన్‌ తెలిపారు. కాగా ఈ నెల 25న అనుబంధ జాబితా విడుదల చేయనున్నట్టు రోనాల్డ్‌రోస్‌ తెలిపారు. పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్‌ దాఖలులో పాటించాల్సిన నియమ నిబంధనలు వివరించారు. ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు, ర్యాలీలకు ముందస్తుగా ‘సువిధ’ పోర్టల్‌, యాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అందరూ సహకరించాలని కోరారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ కోసం మే 3 నుంచి 8వ తేదీ వరకు హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి సంబంధించి ఆల్‌ సెయింట్స్‌ స్కూల్‌లో, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఓటర్ల కోసం పికెట్‌లోని కేంద్రీయ విద్యాలయంలో, కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కంటోన్మెంట్‌ సీఈసీ ఆఫీ్‌సలో ఫెసిలిటేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

Updated Date - Apr 20 , 2024 | 08:48 AM