Share News

యాసంగి పనులు షురూ

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:25 AM

యాసంగి సాగు పనులు జోరందుకున్నాయి. వరినాట్లు మొదలయ్యాయి. బోర్ల కింద రైతులు సాగుకు ఉపక్రమిస్తున్నారు. జిల్లాలోని అన్ని గ్రామీణ మండలాల్లో వ్యవసాయ బావులు, బోర్ల కింద ఆయకట్టు రైతులు ముందస్తుగానే యాసంగి వరి నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. చెరువులు, కుంటల కింద కూడా రైతులు నారు మడుల తయారీలో నిమగ్నమై ఉన్నారు. మేలైన, నాణ్యమైన విత్తనాల కోసం రైతులు ఆరా తీస్తున్నారు.

యాసంగి పనులు షురూ

ఊపందుకున్న వరి నాట్లు

అందుబాటులో ఎరువులు

పంట రుణాలకు ఏర్పాట్లు

వరివైపే అన్నదాతల మొగ్గు

సన్నాల సాగుకు ఆసక్తి

పెరగనున్న మొక్కజొన్న విస్తీర్ణం

సిద్ధమైన వ్యవసాయ ప్రణాళిక

హనుమకొండ, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): యాసంగి సాగు పనులు జోరందుకున్నాయి. వరినాట్లు మొదలయ్యాయి. బోర్ల కింద రైతులు సాగుకు ఉపక్రమిస్తున్నారు. జిల్లాలోని అన్ని గ్రామీణ మండలాల్లో వ్యవసాయ బావులు, బోర్ల కింద ఆయకట్టు రైతులు ముందస్తుగానే యాసంగి వరి నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. చెరువులు, కుంటల కింద కూడా రైతులు నారు మడుల తయారీలో నిమగ్నమై ఉన్నారు. మేలైన, నాణ్యమైన విత్తనాల కోసం రైతులు ఆరా తీస్తున్నారు. అధిక దిగుబడినిచ్చే వంగడాలు అందుబాటులో లేకపోవడంతో కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. వాటినే ప్రభుత్వం వ్యవసాయశాఖ అధ్వర్యంలో రాయితీపై అందచేయాలని కోరుతున్నారు. స్థానికంగా మార్కెట్లో లభిస్తున్న వాటిని కొనుగోలు చేసి విత్తుకుంటున్నా... చాలా సందర్భాల్లో ఆశించిన దిగుబడులు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం నీరు అందుబాటులో ఉండడంతో ఎక్కువగా వరి సాగుపైనే దృష్టి సారిస్తున్నారు. నారుమళ్లను సిద్ధం చేస్తున్నారు. వ్యవసాయశాఖ అన్నిరకాల ఎరువులను అందుబాటులో ఉంచింది. ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో విత్తన రాయితీపై ఆశలు పెరుగుతున్నాయి. జిల్లాలో యాసంగి సాగు నవంబరు నుంచి మొదలవుతుంది. ఇప్పటికే ఆరుతడి పంటలు పూర్వతున్నందువల్ల రైతులు నవంబరు చివరివారం నుంచే సాగు పనులు మొదలు పెట్టారు. మొదట ఆరుతడి పంటలు వేసిన తర్వాత వరి సాగు చేస్తారు.

పంటలు

జిల్లాలోని పన్నెండు మండలాల్లో సుమారు 1.85 లక్షల ఎకరాల్లో పంటలు సాగ అవుతుండగా ఈసారి కూడా యాసంగిలో ఇంచు మించు ఇదే విస్తీర్ణంలో రైతులు పంటలు వేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. పత్తితీతలు, మొక్కజొన్న కోతలు పూర్తికావచ్చాయి. రైతులు రబీపై పూర్తిగా దృష్టి సారిస్తున్నారు. ప్రధానంగా వరి సాగును చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈసారి యాసంగిలో లక్షా 30వేల ఎకరాల్లో వరి సాగు కావచ్చునని అంచనా. గతంలో 50వేల ఎకరాల్లో మక్కజొన్న సాగు చేయగా ఈ సారి 60 వేల ఎకరాల్లో వేయనున్నారు. 2వేల ఎకరాల్లో వేరు శనగ, 1500 ఎకరాల్లో పెసర్లు, ఇతర పప్పు దినుసులు సాగు కావచ్చునని భావిస్తున్నారు.

సన్నాలపై ఆసక్తి

బియ్యం ధరలు ప్రతీ ఏటా అవకాశన్నంటుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో బియ్యం ధర రూ.5300 వరకు పలుకుతోంది. దీంతో చాలామంది రైతులు సన్నరకాలపై దృష్టి పెడుతున్నారు. ఈ కారణంగా హంస రకం బియ్యం దాదాపు మార్కెట్‌లో దొరికే పరిస్థితి లేకుండా పోయింది. ఈ రకం సాగు చేస్తే తినే వారు తక్కువగా ఉండడం, పైగా దిగుబడులు అంతగా రాకపోవడంతో సాగుకు స్వస్థి చెబుతున్నారు.

పుష్కలంగా ఎరువులు

యాసంగి సాగుకు వ్యవసాయ శాఖ సిద్దమవుతోంది. సాగు ప్రణాళికను రూపొందించడంతో పాటు రైతులు వేసే పంటల ఆధారంగా కావలసిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మార్క్‌ఫెడ్‌ గోదాముల్లో వివిధ రకాల ఎరువుల బఫర్‌ నిల్వలు ఉన్నాయి. ఈ ఏడాది వానాకాలంలో 8వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులను వినియోగించారు. ఇప్పటికే యాసంగి సీజన్‌ను దృష్లిలో పెట్టుకొని వ్యవసాయాధికారులు ఎరువులను అందుబాటులో ఉంచారు. ఆయా మండలాల్లో సుమారు 15వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేశారు. ఈ మేరకు వాటిలో ప్రస్తుతం అవసరాలకు అనుగుణంగా డీఏపీ, యూరియా, పొటాష్‌, కాంప్లెక్స్‌ వంటి 2వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు ఉన్నాయి. వినియోగాన్ని బట్టి ప్రతి నెలా సరఫరా జరిగేలా చూస్తామని కొరత ఉండదని అధికారులు చెబుతున్నారు. ఇదేకాకుండా ప్రైవేటు వ్యాపారుల వద్ద కూడా భారీగా ఎరువల నిల్వలు ఉన్నాయి.

చాలినంత సాగునీరు

ఈ సారి వర్షాలు తక్కువగా కురిసినా ఒకేసారి పడిన భారీ వర్షాల వల్ల చెరువులన్నీ పూర్తిస్థాయిలో నిండాయి. ఎస్సారెస్పీ, దేవాదుల ప్రాజెక్టుల్లో సాగు నీరు అందుబాటులో ఉంది. భూగర్భ జలాలు కూడా పుష్కలంగా ఉండడంతో బావులు, బోర్ల ద్వారా వచ్చే నీటితో రైతులు యాసంగి పంటలకు సరిపడా సాగునీరు అందుబాటులో ఉండనున్నది. ఎల్కతుర్తి, కమలాపూర్‌, హసన్‌పర్తి, దామెర, బీమదేవరపల్లి, వేలేరు, దర్మసాగర్‌, ఐనవోలు, హనుమకొండ, నడికూడ మండలాల్లో వరికోతలు పూర్తయ్యాయి. ముందస్తుగా నారు పోసుకున్న రైతులు ఏకంగా నాట్లు వేస్తున్నారు. పరకాల, శాయంపేట, ఆత్మకూరు మండలాల్లో కూడా వరికోతలు పూర్తయ్యాయి.

పంట రుణాలు

యాసంగి సాగు మొదలుకావడంతో డిసెంబర్‌ నెలనుంచే పంట రుణాలను బ్యాంకుల ద్వారా అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మార్చి వరకు యాసంగి సాగుకు పంట రుణాలను అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లాలో ఈ యాసంగిలో రూ.1,638.8 కోట్ల రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. రైతులు సాగుచేసే పంట ఆధారంగా స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం ఆయా బ్యాంకుల ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించారు.

యాసంగికి అన్ని ఏర్పాట్లు పూర్తి: దామెదర్‌ రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అదనపు సంచాలకుడు

జిల్లాలో వరి నాట్లు ఇప్పటికే మొదలయ్యాయి. జనవరి చివరి నాటికి నాట్లు పూర్తవుతాయి. ఈసారి కూడా రైతులు పెద్ద ఎత్తున వరివైపే మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో లక్షా 30వేల ఎకరాల్లో వరి సాగు, 50వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతుంది. జిల్లాలో యాసం గి సాగుకు కావలసిన ఏర్పాట్లు ముందే చేస్తున్నాం. కార్యప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి పంపించాం. విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా విత్తనాలను అందుబాటులో ఉంచే ఏర్పాట్లను చేస్తున్నాము. రైతులకు కావలసిన ఎరువులను ఇప్పటికే అందుబాటులో ఉంచాము.

Updated Date - Jan 12 , 2024 | 12:25 AM