Share News

పాలన గాడిలో పడేనా.?!

ABN , Publish Date - Jan 01 , 2024 | 11:30 PM

సమగ్ర గిరిజ నాభివృద్ది సంస్థ(ఐటీడీఏ) పాలన అస్తవ్యస్తంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. కొన్నేళ్లుగా పాలకుల నిర్లక్ష్యానికి ఐటీడీఏ గురైంది. కాలక్రమేణా తన వైభవాన్ని కోల్పోతూ వస్తోంది. నిధులలేమి, శాఖ ల తరలింపు తదితర కారణాలతో ఐటీడీఏ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.

పాలన గాడిలో పడేనా.?!
ఏటూరునాగారంలోని ఐటీడీఏ కార్యాలయం

ఐటీడీఏలో ప్రక్షాళన జరిగేనా..

పూర్వ వైభవం దిశగా అడుగులు పడేనా..!

కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు

బతుకులు మారాలంటున్న గిరిజనులు

ఏటూరునాగారం రూరల్‌, జనవరి1: సమగ్ర గిరిజ నాభివృద్ది సంస్థ(ఐటీడీఏ) పాలన అస్తవ్యస్తంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. కొన్నేళ్లుగా పాలకుల నిర్లక్ష్యానికి ఐటీడీఏ గురైంది. కాలక్రమేణా తన వైభవాన్ని కోల్పోతూ వస్తోంది. నిధులలేమి, శాఖ ల తరలింపు తదితర కారణాలతో ఐటీడీఏ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న గిరిజనులకు నాణ్యమైన విద్య, వైద్యంతోపాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి వారి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన ఐటీడీఏ ప్రాధాన్యత తగ్గుతూ వస్తోందని తెలుస్తోంది. దశాబ్దాలుగా గిరిజనుల జీవ న ప్రమాణాలు అనుకున్నంత స్థాయిలో మెరుగుపడకపోవడానికి ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని ఆయా సంఘాల నేతలు ఆరోపిస్తు న్నారు. ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించాల్సిన పాలక మండలి సమావేశాలు మచ్చుకైనా లేకపోవ డం దారుణమని గిరిజన సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2019లో చివరిసారిగా జరిగిన సమావేశం ఊసు మళ్లీ కనిపించలేదు. అసలు దాని గురించి పాలకులు పట్టించుకున్న దాఖలాలు లేవని అంటున్నారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభు త్వమైనా ఐటీడీఏకు పూర్వ వైభవం తెస్తుందని గిరిజ నులు ఆశిస్తున్నారు. ఐటీడీఏను సమూలంగా ప్రక్షాళన చేసి గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపాలని ఆయా సంఘాలు కొత్త సర్కారును కోరుతున్నాయి.

ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 13 ఏజెన్సీ మండలాలు ఉన్నాయి. 177 ఏజెన్సీ గ్రామాలు ఉన్నాయి. ఐటీడీఏ పరిధిలో సుమారు లక్ష 25 వేల జనాభా ఉంది. ఈ ప్రాంతాల్లో ఐటీడీఏ పర్యవేక్షణలోనే పాలన కొనసాగుతోంది. ఆయా గ్రామాల్లో 90శాతం అభివృద్ధి పనులు దీని ద్వారానే చేపట్టాల్సి ఉంటుంది. అయితే.. ఐటీడీఏ పట్ల గత పాలకులు నిర్లక్ష్యం చేశారనే విమర్శలు ఉన్నాయి. దీంతో క్రమేణా దాని ప్రాధాన్యం తగ్గుతూ వస్తోంది. ముఖ్యంగా నాలుగేళ్లుగా పాలక మండలి సమావేశా లు జరగకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని గిరిపుత్రులు అంటున్నారు. కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం ఐటీడీఏ పాలనపై దృష్టి పెట్టాలని కోరుతు న్నారు. ఇందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేయాలంటున్నారు. గాడి తప్పిన పాలనను దారికి తెచ్చి గిరిజనుల్లో ఐటీడీఏపై భరోసాను పెంచాలని అంటున్నారు. నిధుల కేటాయింపుతోపాటు ఉద్యోగ ఖాళీల భర్తీకి కృషి చేయాలని కోరుతున్నారు.

అధికారుల ఇష్టారాజ్యం

ఐటీడీఏలో అధికారులు ఏళ్ల తరబడి తిష్ట వేసి ఉన్నారు. ఐదేళ్లుగా బదిలీలు లేక ఉన్నతా ధికారులు ఒకేచోట విధులు నిర్వర్తిస్తున్నారు. ఏపీవో, ఏవో వంటి కీలకస్థాయి అధికారులకు సైతం స్థానచలనం లేకపోవడంతో పాలనంతా ఇష్టానుసారంగా మారిందని పలు గిరిజన సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఒకచోట పనిచేయడంతో పాలననలో పారదర్శక లోపించిందని అంటున్నారు. దీనికితోడు ఐటీడీఏ ఉన్నతాధికారుల్లో గ్రూపు రాజకీయాలు బలంగా ఉండడంతో పాలనపై ప్రభావం పడుతోందని విమర్శిస్తున్నారు. దీంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. అంతేకాకుండా ఐటీడీఏలోని విద్య, వైద్యం, ఇంజనీరిం గ్‌ విభాగాల్లో భారీగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవ డంతో ఆ విభాగాల అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నరనే విమర్శలు ఉన్నాయి. ఇంజనీరింగ్‌ శాఖలో ఈ ఏడాది డీఈ, ఏఈలు ఐటీడీఏ కార్యాలయంలోనే లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడటం కలకలం సృష్టించింది. దీర్ఘకాలంగా విధుల్లో ఉన్న అధికారులను వెంటనే వారిని బదిలీ చేసి వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవాలని గిరిజన సంఘాలు ఈ క్రమంలో పలుమార్లు డిమాండ్‌ చేశాయి.

పథకాల అమలు ఎన్నడో..?

గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం ఐటీడీఏ ద్వారా చేపడుతున్న పథకాల అమలు నత్తనడకన సాగుతున్నాయి. గిరిజనులకు ఆర్థిక వెసులుబాటుతో పాటు ఉపాధికి ఊతమిచ్చే ఎకనామికల్‌ సపోర్ట్‌ స్కీం(ఈఎస్‌ఎస్‌) పనితీరు అధ్వానంగా మారింది. గిరివికాసం, డ్రైమిక్స్‌ యూనిట్‌, సబ్బుల తయారీ పరిశ్రమ, రూరల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ స్కీం, బ్యూటీషీయన్‌ స్కీం తదితర పథకాలు గిరిజనులకు సకాలంలో చేరువ కాక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా ఈ పథకాల అమలును వేగవంతం చేయాలని గిరిజనులు కోరుకుంటున్నారు.

ఆశలన్నీ మంత్రిపైనే..

కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఐటీడీఏను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి గిరిజనులకు మేలు జరగేలా కార్యాచరణను సిద్ధం చేయాలని పలు గిరిజన సంఘాలు కోరుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర గిరిజన అభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ధనసరి సీతక్కపై గిరిజనులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఐటీడీఏకు నిధుల కేటాయింపుతోపాటు ఖాళీలను భర్తీ చేసి ఐటీడీఏ పాలనన గాడిన పెట్టాలని కోరుతున్నారు. ఐటీడీఏకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా మంత్రి అడుగులు వేయాలని అంటున్నారు. భారీ స్థాయిలో నిధులను కేటాయించి ఐటీడీఏ బలోపేతానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Jan 01 , 2024 | 11:30 PM