Share News

భారత్‌ రైస్‌ ఎక్కడ..?

ABN , Publish Date - Mar 29 , 2024 | 01:01 AM

బియ్యం ధరలు రోజు రోజుకు ఆకాశాన్నంటుతుండడంతో పేద ప్రజల కోసం భారత్‌ రైస్‌ పేర కేంద్ర ప్రభుత్వం అందిస్తా మని ప్రకటించింది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్‌ జిల్లాలో అలాంటి భారత్‌ రైస్‌ విక్రయ కేంద్రాలు ఎక్కడా కనిపించడం లేదు. సన్నబియ్యం కిలో రూ.29కే అందిస్తామని చెప్పి 50 రోజులు కావొస్తున్నా ఆ బియ్యం కేంద్రాల జాడే ఇప్పటి వరకు లేదు. తక్కువ ధరకు సబ్సిడీ బియ్యం ఎప్పుడు వస్తాయా.. అని సామాన్యులు, నిరుపేదలకు ఎదురుచూపులు తప్పడం లేదు.

భారత్‌ రైస్‌ ఎక్కడ..?

జిల్లాలో కనిపించని కేంద్రాలు

రూ.29కే సన్నబియ్యమంటూ కేంద్రం ప్రచారం

ఇంకా విధి విధానాలు రాలేదంటున్న ఎఫ్‌సీఐ

ఎదురుచూస్తున్న సామాన్య జనం

మహబూబాబాద్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : బియ్యం ధరలు రోజు రోజుకు ఆకాశాన్నంటుతుండడంతో పేద ప్రజల కోసం భారత్‌ రైస్‌ పేర కేంద్ర ప్రభుత్వం అందిస్తా మని ప్రకటించింది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్‌ జిల్లాలో అలాంటి భారత్‌ రైస్‌ విక్రయ కేంద్రాలు ఎక్కడా కనిపించడం లేదు. సన్నబియ్యం కిలో రూ.29కే అందిస్తామని చెప్పి 50 రోజులు కావొస్తున్నా ఆ బియ్యం కేంద్రాల జాడే ఇప్పటి వరకు లేదు. తక్కువ ధరకు సబ్సిడీ బియ్యం ఎప్పుడు వస్తాయా.. అని సామాన్యులు, నిరుపేదలకు ఎదురుచూపులు తప్పడం లేదు.

కొద్ది నెలల క్రితం నుంచి ధాన్యం ధరలు పెరుగుతుండడంతో బియ్యం ధరలు కూడా పోటీ పడుతూ.. అమాంతం పెరుగుతున్నాయి. నీటి సమస్య తీవ్రతరం కావడంతో వరి విస్తీర్ణం రాష్ట్రంలో తగ్గిపోయింది. దీంతో ముందే ఊహించిన వ్యాపారులు ధాన్యం ధరలు పెంచేసి తమకు అనుకూలంగా ఉన్న మండల కేంద్రాల నుంచి ధాన్యం కొనుగోలు చేసి గోదాంలలో దాచుకున్నారు. నాగార్జునసాగర్‌ ఆయకట్టు కింద పండించిన సన్నధాన్యం ద్వారా తయారైన బియ్యాన్ని అత్యధికంగా హైదరాబాద్‌ మహానగరానికి సరఫరా చేసేవారు. అలాంటిది నాగార్జునసాగర్‌లో ఈ ఏడాది నీటి నిల్వలు తగ్గిపోవడంతో వరి విస్తీర్ణం బాగా తగ్గింది. ఫలితంగా బియ్యానికి సంక్షోభం ఏర్పడుతుండడంతో వ్యాపారులు సన్నధాన్యం కొనుగోలుకు పక్క మండలాలు, రాష్ట్రాల వైపు ఖరీదులకు మొగ్గు చూపారు. మహబూబాబాద్‌ జిల్లాలోని కేసముద్రం లాంటి వ్యవసాయ మార్కెట్‌కు అత్యధికంగా ఎన్నడూలేని విధంగా ధాన్యం విపరీతంగా వస్తుండడంతో ఆ మార్కెట్‌పై వ్యాపారుల దృష్టి పడింది. వారితో పాటు పక్క రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు కూడా కేసముద్రం మార్కెట్‌ వ్యాపారులకు కమీషన్‌ ఇచ్చి సన్నధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. గత వానాకాలంలో పండించిన సన్నధాన్యం కేసముద్రం మార్కెట్‌కు విపరీతంగా వస్తుంది. రోజుకు 20-30 లారీల వరకు సన్నధాన్యం ఖరీదు చేసిన ఇక్కడి వ్యాపారులు నల్గొండ, సూర్యాపేట, కాకినాడ, మండపేట, చెన్నై, నాగ్‌పూర్‌ లాంటి ప్రాంతాలకు ఎగుమతి చేశారు.

బియ్యం ధరలు ఇలా...

జిల్లాలో సన్నధాన్యానికి డిమాండ్‌ ఏర్పడడంతో బియ్యం ధరలు పెరిగి పోతున్నాయి. నిన్న, మొన్నటి వరకు జైశ్రీరాం బియ్యం కొత్తవి క్వింటాకు రూ.5,500 వరకు విక్రయించగా గత రెండ్రోజుల నుంచి ఆ బియ్యం ధరలు తగ్గుముఖం పట్టాయి. జైశ్రీరాం కొత్త బియ్యం ధరలు ప్రస్తుతం రూ.5,100 వరకు విక్రయిస్తున్నారు. ఆర్‌ఎన్‌ఆర్‌, బీపీటీ, హెచ్‌ఎంటీ రకాలు(కొత్తవి) క్వింటాకు రూ.4,600 నుంచి రూ.4,800 విక్రయించినప్పటికి ప్రస్తుతం రూ.4,200 వరకు అమ్ముతున్నారు. అయితే పాత బియ్యం ధరలు మాత్రం రోజు రోజుకు పెరుగుతున్నాయి. జైశ్రీరాం పాతవి క్వింటాకు రూ.7,200 వరకు పలుకుతుండగా, ఆర్‌ఎన్‌ఆర్‌, హెచ్‌ఎంటీ, బీపీటీ రకాలు రూ.6,200 వరకు విక్రయిస్తున్నారు.

భారత్‌ రైస్‌ పేరుతో...

ధరలు పెరుగుతుండడంతో సామాన్యులకు బియ్యం కొనుగోళ్లు పెద్ద సమస్యగా మారింది. పెరిగిన ధరలతో బియ్యం కొనుగోలు చేయలేక రేషన్‌ బియ్యం తినలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యుల బాధలు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వారికి సన్నబియ్యం అందించాలన్న లక్ష్యంతో భారత్‌ రైస్‌ పేరిట కిలో రూ.29కే విక్రయించాలని నిర్ణయించింది. గత ఫిబ్రవరి 7న ఈ పథకం ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 5కిలోలు, 10 కిలోల సంచి పేరిట విక్రయించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. నాఫెడ్‌, కేంద్రీయ బండార్‌, ఎన్‌సీసీఎఫ్‌ కేంద్రాల్లో కొనుగోలు చేసుకోవచ్చని కేంద్రం ప్రచారం చేసింది. అయితే ఇప్పటి వరకు ఏ విక్రయ కేంద్రాలు జిల్లాలో ఏర్పాటు చేయలేదు. కేంద్రం ప్రకటించి 48 రోజులు గడుస్తున్నప్పటికి మహబూబాబాద్‌ జిల్లాలో భారత్‌ రైస్‌ పేరిట షాపులు ఎక్కడా కనిపించలేదు. ఇలాంటి బియ్యం అమ్మకాలపై జిల్లా సివిల్‌సప్లై అధికారి రాజేందర్‌ను వివరణ కోరగా రూ.29కే బియ్యం విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు తమకు అందలేదని, ఇప్పటి వరకు ఈ పథకం గురించి స్పష్టంగా తెలియదని చెబుతున్నారు. అలాగే ఎఫ్‌సీఐ ఉన్నతాధికారులను ప్రశ్నించగా త్వరలోనే బియ్యం కేంద్రాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని, కేంద్రం నుంచి విధి విధానాలు, ఉత్తర్వులు తమ శాఖకు అందలేదని స్పష్టం చేశారు. కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కూడా ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఇది ఎన్నికల జిమ్మిక్కనే కావచ్చంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలు మాత్రం తక్కువ ధరకే సన్నబియ్యం వస్తుందనే ఆశతో కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభమవుతాయని ఎదురుచూస్తున్నారు.

Updated Date - Mar 29 , 2024 | 01:01 AM