Share News

పునరావాసం ఏమైంది?

ABN , Publish Date - May 29 , 2024 | 11:20 PM

కొండాయి.. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల పరిధిలోని ఓ అడవిపల్లె. ప్రశాంతతకు మారుపేరుగా ఉండే ఈ గ్రామం గతేడాది జూలైలో జంపన్నవాగు జలవిలయానికి విలవిల్లాడింది. ఎనిమిది మంది గ్రామస్థులు వరదలో కొట్టుకుపోయి మరణించారు. హైలెవల్‌ వంతెన కూలి పోయింది. దాంతో ఆ గ్రామస్థులను ఎత్తైన సురక్షిత ప్రాంతానికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పునరావాసం ఏమైంది?
వరదలో మునిగిపోయిన కొండాయి గ్రామంలోని ఇళ్లు (ఫైల్‌), వరదలకు కొట్టుకుపోయిన హైలెవల్‌ వంతెన

కొండాయి వాసులకు తప్పని నిరీక్షణ

సర్కారు సాయం కోసం ఎదురుచూపు

గతేడాది జంపన్నవాగు వరదలకు అతలాకుతలమైన అడవి పల్లె

నాటి జలవిలయంలో ఎనిమిది మంది బలి

గ్రామ తరలింపుపై స్పష్టత కరువు

సమీపిస్తున్న వానాకాలం.. పొంచి ఉన్న వరద ప్రమాదం

ములుగు, మే 29: కొండాయి.. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల పరిధిలోని ఓ అడవిపల్లె. ప్రశాంతతకు మారుపేరుగా ఉండే ఈ గ్రామం గతేడాది జూలైలో జంపన్నవాగు జలవిలయానికి విలవిల్లాడింది. ఎనిమిది మంది గ్రామస్థులు వరదలో కొట్టుకుపోయి మరణించారు. హైలెవల్‌ వంతెన కూలి పోయింది. దాంతో ఆ గ్రామస్థులను ఎత్తైన సురక్షిత ప్రాంతానికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, ఆచరణలో ఎలాంటి పురోగతి కనిపించడంలేదు. మళ్లీ వర్షాకాలం సమీపిస్తున్న క్రమంలో ఆ గ్రామస్థుల్లో గుబులు మొదలైంది.

ఊరిపై ఉప్పెన

కొండాయివాసులకు 2023 జూలై 27వ తేదీ తీరని శోకాన్ని మిగిల్చింది. గ్రామం సమీపం నుంచి ప్రవ హించే జంపన్నవాగు ఉప్పెనలా వారిపై విరుచుకుప డింది. ప్రాణభయంతో జనమంతా డాబాలు, ఇళ్ల పైకెక్కారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు దబ్బకట్ల సమ్మక్క(70), పక్కనే ఉన్న మల్యాలకు వెళ్లి ప్రాణాలు కాపాడుకునేందుకు వెళ్తున్న ఎమ్డీ.అజ్జు (22), ఎమ్డీ.షరిఫ్‌(50), ఎమ్డీ. మహబూబ్‌ఖాన్‌(60), ఎమ్డీ.మజీద్‌ఖాన్‌(65), ఆయన భార్య లాల్‌బీ(40), రషీద్‌(55), ఆయన భార్య కరీమాబీ(45) వరదలో కొట్టుకుపోయి మరణించారు. వాగుపై ఉన్న హైలెవల్‌ వంతెన రెండు ముక్కలైంది. పొలాలన్నీ ఇసుక మేట లు వేసి పనికిరాకుండా పోయాయి. ఈ ఘటన ప్రకృతి ప్రకోపానికి సాక్షీభూతంగా నిలిచింది. హృద యవిదారక దృశాన్ని చూసి చలించిన స్థానిక ఎమ్మెల్యే సీతక్క కన్నీటిపర్యంతమయ్యారు. ఆమె డిమాండ్‌తో ప్రతికూల వాతావరణ పరిస్థితులున్నప్పటికీ ప్రభు త్వం ఆర్మీ హెలికాప్టర్లను పంపించడంతో సహాయక చర్యలు మొదలయ్యాయి. జిల్లా పోలీసు యంత్రాంగం సాహసం చేసి మరబోట్ల ద్వారా గ్రామానికి వెళ్లి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరా వాసం కల్పించారు. చరిత్రలో తొలిసారిగా జిల్లాలో 2023 జూలై 26, 27తేదీల్లో కలిపి 168 మి.మీ వర్షం కురిసింది. 27న వెంకటాపూర్‌(రామప్ప) మండలం లక్ష్మీదేవిపేటలో రాష్ట్రంలోనే అత్యధికంగా 649మి.మీ వర్షపాతం నమోదు కాగా మిగతా మండలాల్లో 100మి.మీకి తగ్గకుండా కుండపోత కురిసింది. ఫలితంగా జంపన్నవాగు ఊహకందని విధంగా 10మీ టర్ల ఎత్తులో ప్రవహించి కొండాయి గ్రామాన్ని మంచె త్తింది. ఆ సమయంలో గోదావరి నదిలో ఉధృతి తక్కు వగా ఉండటంతో వాగు వరదంతా ముందుకు పయనించింది. లేకుంటే జంపన్నవాగు పరీవాహకం లోని కొండాయితోపాటు మల్యాల, మేడారం, ఏటూ రునాగారం పరిసర గ్రామాలు తుడిచిపెట్టుకుపోయేవే.

ప్రతిపాదనలకే పరిమితం

కొండాయి వాసులకు పునరావాస ప్యాకేజీ ప్రతి పాదనలకే పరిమితమైంది. వరదల్లో జనం సర్వం కోల్పోయారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటుచేసి ఆధార్‌, రేషన్‌ కార్డులను తిరిగి ఇప్పించా రు. సర్టిఫికెట్లు, భూమి పత్రాలు అందాల్సి ఉంది. మరణించిన వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, వరద బాధితులకు రూ.10వేల చొప్పున నగదు సాయం, నిత్యావసరాలను అందజేశారు. స్వచ్ఛంద సంస్థలు చేయూతనిచ్చాయి. జంపన్నవాగు ఊరిపైకి ముంచెత్తకుండా గైడ్‌వాల్‌, కరకట్ట నిర్మిం చడమే కాకుండా మొత్తం గ్రామాన్ని ఎత్తయిన ప్రదేశానికి తరలించాలని అధికారులు ప్రతిపాదిం చారు. కలెక్టర్‌ నిర్వహించిన గ్రామసభలో ప్రజలు కూడా అంగీకారం తెలిపారు. అవసరమైన భూసేకర ణ కోసం రెవెన్యూ, అటవీశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కానీ, అసెంబ్లీ ఎన్నికలు రావడం, మేడారం మహాజాతర హడావిడి ముగిసిన తర్వాత లోక్‌సభ ఎన్నిలతో ఈ అంశం మరుగున పడింది.

దిగ్బంధంలో కొండాయి గ్రామం

భారీ వరదలకు జంపన్నవాగుపై ఉన్న హైలెవల్‌ వంతెన కొట్టుకుపోయింది. ఆ గ్రామానికి ప్రధాన మార్గంగా ఉన్న ఈ వంతెన పునర్నిర్మాణం కోసం రూ.9కోట్లు కేటాయిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత రూ.20లక్షల వ్యయంతో వాగులో పైపులతో నిర్మించిన మట్టి రోడ్డు కొంతమేరకు ధ్వంసమైంది. ఇప్పుడిదే ఆగ్రామానికి ఆధారంగా మారింది. ఊరట్టం, మేడారం మీదుగా మరో మార్గం ఉన్నప్పటికీ అడవిగుండా 15కిలోమీటర్లు ప్రయాణించాలి. మధ్యలో కొండొర్రెవాగు అడ్డుగా ఉంటుంది. వర్షాకాలంలో ఈ వాగు కూడా పొంగుతుంది. దీంతో కొండాయి పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకోక తప్పదు. మేడారం మహాజాతర దేవతల్లో ఒకరైన గోవిందరాజులు ఈగ్రామంలోనే కొలువై ఉన్నాడు. జాతర సమయంలో ప్రతిసారీ దేవుడిని అడవిదారి గుండా పూజారులు మేడారానికి తరలిస్తారు. కొండొర్రెవాగుపై వంతెన, పక్కా రోడ్డు నిర్మించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు అటవీశాఖ అభ్యంతరాలతో ఫలించలేదు. వరదలొస్తే రోజుల తరబడి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. నిత్యావసరాలే కాదు.. అత్యవసర వైద్యసేవలూ అందని పరిస్థితి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో వానాకాలం సమీపిస్తుండగా కొండాయి గ్రామస్థుల్లో భయం మొదలైంది.

ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారింది : సీతక్క, మంత్రి

కొండాయితోపాటు జంపన్నవాగు వరద ఉధృతికి గురయ్యే గ్రామాలను గుర్తించాం. జిల్లా అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం. రక్షణ, పునరావాసం కోసం చర్యలు తీసుకుంటున్నాం. కొండాయి వద్ద హైలెవల్‌ వంతెన కోసం రూ.9కోట్లను మంజూరు చేయడం జరిగింది. కానీ, ఎన్నికల కోడ్‌తో పనులు ప్రారంభం కాలేదు. జూన్‌ 6 నుంచి నిర్మాణ పనులు మొదలవుతాయి.

Updated Date - May 29 , 2024 | 11:20 PM