Share News

పరిహారంపై పట్టింపేది?

ABN , Publish Date - Jan 18 , 2024 | 11:54 PM

రైతులకు అందాల్సిన పంట నష్ట పరిహారంపై పట్టింపు కరువైంది. ఓవైపు పాత, కొత్త ప్రభుత్వాలు, మరోవైపు అధికారుల నిర్లక్ష్యం కారణంగా దాదాపు ఏడాది కావస్తున్నా రైతులకు రావాల్సిన పరిహారం డబ్బులు నేటికీ అందడం లేదు. గత ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలలో జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం కారణంగా వరి, మామిడి, మొక్కజొన్న తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

పరిహారంపై పట్టింపేది?
జనగామ మండలం పెద్దపహాడ్‌లో దెబ్బతిన్న వరి పంటను పరిశీలిస్తున్న కలెక్టర్‌ శివలింగయ్య (ఫైల్‌)

ఎదురుచూస్తున్న నష్టపోయిన రైతులు

గత ఏడాది మార్చి, ఏప్రిల్‌లో వడగళ్లతో దెబ్బతిన్న పంటలు

మొదటి విడత పంపిణీ చేసి చేతులు దులుపుకున్న అప్పటి ప్రభుత్వం

రెండో విడత సాయం కోసం నిరీక్షణ

ఖజానాలో నిధులు ఉన్నా అన్నదాతకు మొండిచేయి

మార్చిలోగా విడుదల చేయకపోతే వెనక్కి?

జనగామ, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): రైతులకు అందాల్సిన పంట నష్ట పరిహారంపై పట్టింపు కరువైంది. ఓవైపు పాత, కొత్త ప్రభుత్వాలు, మరోవైపు అధికారుల నిర్లక్ష్యం కారణంగా దాదాపు ఏడాది కావస్తున్నా రైతులకు రావాల్సిన పరిహారం డబ్బులు నేటికీ అందడం లేదు. గత ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలలో జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం కారణంగా వరి, మామిడి, మొక్కజొన్న తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అధికారులు వచ్చి క్షేత్ర స్థాయిలో సర్వే చేసి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. జిల్లాలో మార్చి, ఏప్రిల్‌లో వడగళ్లు బీభత్సం సృష్టించగా కేవలం మార్చిలో దెబ్బతిన్న పంటలకు సంబంధించి రూ.4.61 కోట్ల పరిహారం చెల్లించి అధికారులు చేతులు దులుపుకున్నారు. కాగా.. రెండో విడతకు సంబంధించిన రూ.36.69 కోట్లు రైతులకు అందాల్సి ఉంది. నష్ట పరిహారానికి సంబంధించి ఖజానాలో డబ్బులు ఉన్నప్పటికీ విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది.

జిల్లాలో 47,721 ఎకరాల్లో పంట నష్టం

గత ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలలో జనగామతో పాటు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వడగళ్లు, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో వేల ఎకరాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో అప్పటి సీఎం కేసీఆర్‌ మహబూబాబాద్‌ జిల్లాలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ.10 వేల సాయం ఇస్తామంటూ అప్పట్లో ప్రకటించారు. కానీ.. ఆ హామీ పూర్తి స్థాయిలో నెరవేరలేదు. జిల్లాలో మార్చి, ఏప్రిల్‌ నెలల్లో రెండు విడతలుగా వడగళ్లు బీభత్సం సృష్టించగా మొదటి విడత నష్టానికి సంంబధించి పరిహారం రాగా.. రెండో విడత నష్టపరిహారం ఇంకా రావాల్సి ఉంది. మార్చి నెల నష్టాన్ని మొదటి విడతగా, ఏప్రిల్‌లో జరిగిన నష్టాన్ని రెండో విడతగా అధికారులు నిర్ధారించారు. రెండు నెలల్లో కురిసిన వడగళ్ల వర్షాల కారణంగా జిల్లాలో 47,721 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో 44,220 ఎకరాల్లో వరి, 3,173 ఎకరాల్లో మామిడి, 235 ఎకరాల్లో మొక్కజొన్న, 93 ఎకరాల్లో కూరగాయల పంటలకు నష్టం జరిగినట్లు గుర్తించారు. ఆ తర్వాత పంట నష్టానికి సంబంధించి ఏప్రిల్‌, మే నెలలో సర్వే చేశారు. క్షేత్ర స్థాయిలో వ్యవసాయ విస్తరణాధికారులు, వ్యవసాయాధికారులు పంటలను పరిశీలించి నష్టం అంచనాను లెక్క తేల్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంటలో 33 శాతానికి పైగా నష్టం జరిగితే పంట నష్టంగా లెక్కకట్టారు. దీంతో అధికారికంగా 41,309 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా నిర్ధారించారు.

పరిహారం రూ.41.30 కోట్లు

రెండు విడతల్లో పంట నష్టపరిహారం కింద రూ.41.30 కోట్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ధారించింది. ఈ నిధులను గత ఏడాది జూలై నెలలోనే కలెక్టర్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఖాతాలో జమ చేసింది. కానీ, నిధుల విడుదలకు అనుమతి ఇవ్వలేదు. జూలై నెలలో మొదటి విడత కింద 3,698 మంది రైతులకు గాను రూ.4.61 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. కానీ.. రెండో విడత పరిహారాన్ని ఇంత వరకూ జమ చేయడం లేదు. రెండో విడత కింద జిల్లా వ్యాప్తంగా 20,160 మంది రైతులకు సంబంధించి రూ.36.69 కోట్లు రావాల్సి ఉంది. ఈ డబ్బులు ట్రెజరీలో మూలుగుతున్నప్పటికీ రైతులకు పంపిణీ చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది.

విడుదల చేయకపోతే నిధులు వెనక్కి?

రెండో విడత పరిహారానికి సంబంధించి రైతులకు రావాల్సిన రూ.36.69 కోట్లు ట్రెజరీలో మూలుగుతున్నాయి. కాగా, ఈ డబ్బులను మార్చి నెలాఖరులోగా రైతుల ఖాతాల్లో జమ చేయకపోతే తిరిగి వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగిసి ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విడుదల చేసిన నిధులను వాడుకోకపోతే తిరిగి వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇలా జరిగితే మళ్లీ మొదటి నుంచి ప్రక్రియ ప్రారంభించి ప్రభుత్వానికి లేఖ రాస్తేనే వెనక్కి వెళ్లిన డబ్బులు తిరిగి వస్తాయి. దీంతో మరింత ఆలస్యం అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఉన్నతాధికారులు స్పందించి త్వరితగతిన పరిహారం డబ్బులను విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.

ప్రభుత్వం విడుదల చేయగానే ఖాతాల్లో జమ

- వినోద్‌కుమార్‌, జిల్లా వ్యవసాయ అధికారి

గత ఏడాది మార్చి, ఏప్రిల్‌లో కురిసిన వడగళ్ల వాన కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. మొదటి విడత కింద 3,698 మంది రైతులకు రూ.4.61 కోట్లను గత ఏడాది జూలైలో వారి ఖాతాల్లో జమ చేశాం. రెండో విడత నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో పరిహారం ఫైల్‌ను ట్రెజరీకి పంపాం. ఈలోగా ఎన్నికల కోడ్‌ కూడా అమల్లోకి వచ్చింది. దీంతో కొంత ఆలస్యం అయిందని భావిస్తున్నాం. ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే ట్రెజరీ నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.

Updated Date - Jan 18 , 2024 | 11:54 PM