Share News

కాంగ్రెస్‌లో వరంగల్‌ హీట్‌!

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:59 AM

కాంగ్రెస్‌లో వరంగల్‌ ఎంపీ టికెట్‌ వ్యవహారం హీట్‌ పెంచుతోంది. అభ్యర్థిత్వం విషయంలో అటు సీఎంకు ఇటు మంత్రులకు మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని, తలా ఒకరి పేరు చూపుతుండటంతోనే జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి తనతో పాటు కాంగ్రెస్‌లోకి వచ్చిన దొమ్మాటి సాంబయ్యకు టికెట్‌ ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఇందిరకు టికెట్‌ ఇవ్వాలని మంత్రులు భట్టి, ఉత్తమ్‌ పట్టుబడుతున్నట్టు సమాచారం.

కాంగ్రెస్‌లో వరంగల్‌ హీట్‌!

ఎంపీ టికెట్‌ విషయంలో సీఎం వర్సెస్‌ మంత్రులు?

ఏకాభిప్రాయం కుదరక ఎటూ తేల్చని అధిష్ఠానం

వ్యవహారానికి తెరదించేందుకు ఏఐసీసీ నేతల ప్రయత్నాలు

పొత్తులో భాగంగా టికెట్‌ తమకే కేటాయించాలని సీపీఐ పట్టు

వరంగల్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : కాంగ్రెస్‌లో వరంగల్‌ ఎంపీ టికెట్‌ వ్యవహారం హీట్‌ పెంచుతోంది. అభ్యర్థిత్వం విషయంలో అటు సీఎంకు ఇటు మంత్రులకు మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని, తలా ఒకరి పేరు చూపుతుండటంతోనే జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి తనతో పాటు కాంగ్రెస్‌లోకి వచ్చిన దొమ్మాటి సాంబయ్యకు టికెట్‌ ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఇందిరకు టికెట్‌ ఇవ్వాలని మంత్రులు భట్టి, ఉత్తమ్‌ పట్టుబడుతున్నట్టు సమాచారం. దీంతో సీఎం, మంత్రుల మధ్య వరంగల్‌ సీటు విబేధాలకు బీజం వేస్తుందేమోనన్న చర్చ జరుగుతోంది. వరంగల్‌ స్థానంకాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నప్పటికి సరైన అభ్యర్థి లేరని సర్వేలు రిపోర్టులు వస్తుండటంతో ఎవరికి టికెట్‌ ఇవ్వాలో తేల్చుకోలేకపోతున్న అధిష్ఠానం అభ్యర్థిని ఖరారు చేయకుండా పెండింగ్‌లో పెడుతోందన్న ప్రచారం జరుగుతోంది. ఇదంతా ఇలా ఉంటే సీపీఐ రూపంలో కాంగ్రెస్‌కు మరో సమస్య ఎదురవుతోంది. పొత్తులో భాగంగా వరంగల్‌ సీటును తమకే కేటాయించాలని సీపీఐ కాంగ్రెస్‌పై ఒత్తిడి తెస్తోంది. లేదంటే ఫ్రెండ్లీ పోటీ తప్పదని కమ్యూనిస్టులు కాంగ్రెస్‌ అధినాయకత్వాన్ని కంగారు పెట్టిస్తున్నారు.

మాదిగలకే వరంగల్‌ అభ్యర్థిత్వం

రాష్ట్రంలో మూడు ఎంపీ సీట్లు ఎస్సీలకు రిజర్వు అవగా వీటిలో నాగర్‌కర్నూలు, పెద్దపల్లి ఎంపీ టికెట్లు మాల సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు ఇచ్చారు. ఇక మిగిలింది కేవలం వరంగల్‌ సీటు మాత్రమే. ఇది కచ్చితంగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలకే టికెట్‌ ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో తొలుత వరంగల్‌ సీటుపై సీనియర్‌ నేత అద్దంకి దయాకర్‌కు మాట ఇచ్చిన కాంగ్రెస్‌.. మాల, మాదిగ సామాజిక వర్గాల సమీకరణల నేపథ్యంలో అద్దంకి విషయంలో పునరాలోచన చేస్తోందని తెలుస్తోంది. పైగా వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు కూడా మాల సామాజిక వర్గం వ్యక్తే కావడంతో వరంగల్‌ సీటు కచ్చితంగా మాదిగ సామాజిక వర్గం నేతకే కేటాయించాలని అధిష్ఠానం భావిస్తోంది.

సీటుపై కాంగ్రెస్‌లో భేదాభిప్రాయాలు..

వరంగల్‌ ఎంపీ సీటు సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రు లకు మధ్య విభేదాలను తీసుకొస్తోందన్న చర్చ జరు గుతోంది. దొమ్మాటి సాంబయ్యకు ఇప్పించేందుకు రేవంత్‌రెడ్డి ప్రతిపాదనలు చేయగా.. మంత్రి కొండా సురేఖ తీవ్రంగా వ్యతిరేకించినట్టు ప్రచారం జరుగు తోంది. ఆమె జన్ను పరంజ్యోతికి టికెట్‌ ఇవ్వాలని కోరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి రేవంత్‌రెడ్డితో చర్చించిన అనంతరం కాంగ్రెస్‌లో చేరా రు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సురేఖతో ఉన్న సత్సం బంధాలతో తెరపై దయాకర్‌ పేరు చక్కర్లు కొట్టింది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్‌ఘనపూర్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన శనిగపురం ఇందిర వరంగల్‌ ఎంపీ టికెట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ సభ్యుడు, మంత్రి ఉత్తమ్‌కు మార్‌రెడ్డితో పాటు డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క కూడా ఇందిర అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతున్న ట్టు సమాచారం. సినీనటుడు శింబుతో కలిసి కర్నాట క ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను బెంగళూరు లో కలిసిన ఇందిర వరంగల్‌ టికెట్‌పై ఒత్తిడి తీసు కరాగా, డీకే కూడా ఇందిరా పేరును ప్రతిపాదిస్తున్న ట్టు ప్రచారం జరుగుతోంది. వరంగల్‌ పార్లమెంట్‌ పరి ధిలోని ఎమ్మెల్యేలు మాత్రం ఎన్నికల ఖర్చు తాము భరించే పరిస్థితిలో లేమని, ఆర్థిక, అంగ బలం ఉన్న వారిలో ఎవరికి టికెట్‌ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని మెజార్టీ ఎమ్మెల్యేలు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారా ల ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌మున్షికి ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన అభిప్రాయ సేకరణలో తేల్చి చెప్పారట. వీరి తో పాటు వైద్యులు రాగమల్ల పరమేశ్వర్‌, పెరు మాండ్ల రామకృష్ణ, సునితలతో పాటు ఆర డజను మంది ఆశావహులు కాంగ్రెస్‌ పెద్ద చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ క్రమంలో టికెట్‌ ఆశిస్తున్న దొమ్మాటి సాంబయ్య, జన్ను పరంజ్యోతి, పసునూరి దయాకర్‌, ఇందిరతో పాటు మరో నలుగురైదుగురిని అధిష్ఠానం పిలిచి చర్చలు జరిపినట్టు సమాచారం. సునిల్‌ కనుగోలు సర్వే రిపోర్టు కూడా ఆశావహుల ముందుంచి పోటీపై వారి అభిప్రాయాలు సేకరించిందని, త్వరగా వరంగల్‌ సీటుపై తేల్చాలని సీఎం రేవంత్‌రెడ్డి కూడా సూచించినట్టు తెలిసింది.

వరంగల్‌ కోసం సీపీఐ పట్టు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పని చేసిన సీపీఐ లోక్‌సభ ఎన్నికల్లోనూ పొత్తు కొనసాగించాలని, అందులో భాగంగా తమకు వరంగల్‌ సీటు ఇవ్వాలని లేదంటే కరీంనగర్‌ ఇవ్వాలని, దీనిపై ఒకట్రెండు రోజుల్లో తేల్చాలని కోరుతోంది. కానీ కాంగ్రెస్‌ జనరల్‌ స్థానమైన కరీంనగర్‌ను వదులుకునే అవకాశం లేకపోవటంతో ఎస్సీ రిజర్వుడు స్థానమైన వరంగల్‌ తమకు దక్కుతుందనే ధీమాలో కమ్యూనిస్టులున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వం నుంచి కడియం కావ్య తప్పుకోవడం, ఆమె తండ్రి కడియం శ్రీహరి, ఆమె త్వరలోనే కాంగ్రెస్‌లో చేరాతారన్న ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్‌ అభ్యర్థిత్వం ఎవరికి దక్కుతుందోనన్న చర్చ జరుగుతోంది.

తెరపైకి కడియం..

వరంగల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిపై ఉత్కంఠ పెరుగుతుంది. ఇప్పటికే ఎవరికి వారు కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తుండటం, సీఎం, మంత్రులతో పాటు పీసీసీ, ఏఐసీసీ నేతల మధ్య అభ్యర్థుల విషయమై ఏకాభిప్రాయం రాకపోవడం లాంటి పరిణామాల నేపథ్యంలోనే.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కడియం కావ్య ఎన్నికల బరి నుంచి తప్పుకోవటంతో కాంగ్రెస్‌ ఆశావహుల్లో టెన్షన్‌ మొదలైంది. స్టేషన్‌ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కాంగ్రెస్‌ పార్టీలోకి తీసుకవచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్‌ అధిష్ఠానం.. కడియం శ్రీహరి కాంగ్రెస్‌లోకి వస్తే అయననే వరంగల్‌ ఎంపీ అభ్యర్థిగా బరిలో దించాలని యోచిస్తోంది. 2014లో కడియం శ్రీహరి వరంగల్‌ ఎంపీగా విజయం సాధించారు. దీంతో పాటు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండటంతో ఉమ్మడిజిల్లాలోని అన్ని పార్టీల నేతలతో శ్రీహరికి పరిచయాలున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీహరిని ఎంపీగా పోటీ చేయించి, ఆయన గెలిచిన తర్వాత స్టేషన్‌ఘనపూర్‌కు వచ్చే ఉపఎన్నికల్లో కడియం శ్రీహరి కుమార్తె కావ్యను ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారనే ప్రచారం జరుగుతుంది. ఒకవేళ శ్రీహరి పోటీ చేయకపోతే కావ్యనే ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపవచ్చుననే చర్చ కూడా జరుగుతోంది. అయితే పార్టీ మారే విషయంలో తాము ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదని కడియం శ్రీహరి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. దీంతో కాంగ్రెస్‌ టికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న నేతల్లో కడియం ఎపిసోడ్‌ ఉత్కంఠ రేపు తోంది. వరంగల్‌ టికెట్‌ ఎవరికి దక్కుతుందనే టెన్షన్‌ నెలకొంది.

కావ్య లేఖతో బీఆర్‌ఎస్‌కు షాక్‌..

పార్లమెంట్‌ ఎన్నికల ముంగిట బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. వరంగల్‌ పార్లమెంట్‌ అభ్యర్థిగా ఖరారైన డాక్టర్‌ కడియం కావ్య తాను బీఆర్‌ఎస్‌ తరపున ఎన్నికల్లో పోటీ చేయలేనని అధినేత కేసీఆర్‌ లేఖ రాయటం సంచలనంగా మారింది. ఇప్పటి వరకు నేతలు మాత్రమే పార్టీని వీడి వెళ్లగా.. ఇప్పుడు ఏకంగా ఎంపీ అభ్యర్థి తాను పోటీ చేయలేనంటూ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయతే కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై వస్తున్న అవినీతి, భూకబ్జాలు, ఫోన్‌ ట్యాపింగ్‌ లాంటి వ్యవహరాలు, లిక్కర్‌ స్కాం లాంటివి పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని, జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేదని, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్నారని, ఇది పార్టీకి మరింత నష్టం చేస్తుందని, ఈ పరిస్థితుల్లో తాను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నానని, అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలని, తన నిర్ణయం పట్ల కేసీఆర్‌తో పాటు కార్యకర్తలు మన్నించాలని కడియం కావ్య ఆ లేఖలో కోరారు.

Updated Date - Mar 29 , 2024 | 12:59 AM