Share News

మిర్చి మార్కెట్లో అనధికారిక ‘కోత’!

ABN , Publish Date - Feb 11 , 2024 | 11:46 PM

ఆరుగాలం కష్టపడి మార్కెట్‌కు పంటను తెచ్చిన రైతులు దోపిడీకి గురవుతున్నారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతులకు నగదు చెల్లింపుల్లో కమీషన్‌ పేరిట కోత విధిస్తోండటంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. కేవలం ఎనిమిది రోజుల్లోనే రైతుల నుంచి కమీషన్‌ రూపంలో రూ.33 లక్షలను వ్యాపారులు నగదు చెల్లింపుల్లో కోత విధించడం గమనార్హం.

మిర్చి మార్కెట్లో అనధికారిక ‘కోత’!
కేసముద్రం మార్కెట్‌కు రైతులు తీసుకువచ్చిన మిర్చి బస్తాలు

నగదు చెల్లింపుల్లో 3 శాతం ‘కమీషన్‌’

8 రోజుల్లోనే రైతుల నుంచి రూ.33 లక్షల దోపిడీ

అన్నదాతలకు రోజుకు రూ.4 లక్షల నష్టం

కేసముద్రం, ఫిబ్రవరి11 : ఆరుగాలం కష్టపడి మార్కెట్‌కు పంటను తెచ్చిన రైతులు దోపిడీకి గురవుతున్నారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతులకు నగదు చెల్లింపుల్లో కమీషన్‌ పేరిట కోత విధిస్తోండటంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. కేవలం ఎనిమిది రోజుల్లోనే రైతుల నుంచి కమీషన్‌ రూపంలో రూ.33 లక్షలను వ్యాపారులు నగదు చెల్లింపుల్లో కోత విధించడం గమనార్హం.

మిర్చి ధరలు అధికంగా ఉన్నాయని పైకి చూపుతున్నప్పటికీ మార్కెట్లో నగదు చెల్లింపుల్లో మాత్రం నూటికి మూడు రూపాయల చొప్పున తగ్గించి రైతులకు ఇస్తున్నారు. 2021, జనవరి 28న అప్పటి మార్కెట్‌ చైర్మన్‌ మర్రి నారాయణరావు హయాంలో కేసముద్రం మార్కెట్లో తొలిసారి మిర్చి కొనుగోళ్లను ప్రారంభించారు. అయితే తొలిసారి ప్రయోగాత్మకంగా మిర్చి కొనుగోళ్లను నిర్వహిస్తుండడంతో మహబూబాబాద్‌, వరంగల్‌ మార్కెట్‌లతో పోటీగా రాబడులను పెంచేందుకు వ్యాపారుల కోరిక మేరకు అనధికారికంగా నగదు చెల్లింపుల్లో 3 శాతం కోత విధించడం ప్రారంభించారు. నగదులో 3శాతం కోత ఒక్క ఏడాది కొనసాగించి మార్కెట్‌ పుం జుకున్న తర్వాత బంద్‌ చేయాలనే ఉద్దేశంతో అమలు చేసినట్లు రైతులు చెబుతున్నారు. మిర్చి మార్కెట్‌ ప్రారంభమై నాలుగేళ్లు అవుతున్నా ఈ అనధికారిక కోత పేరుతో దోపిడీ మాత్రం ఆగడం లేదు.

పొరుగు మార్కెట్లలో

కోతలున్నాయనే సాకు..

మిర్చి కొనుగోళ్లలో నగదు చెల్లింపుల విషయంలో ఇతర మార్కెట్లలో కూడా నగదు కోతలు ఉన్నాయని, అలాగైతేనే అధిక ధరలు వస్తాయంటూ ఇక్కడ కూడా కమీషన్‌ ఉంటేనే కొనుగోలు చేస్తామని వ్యాపారులు ఈ సీజన్‌ ఆరంభానికి ముందు తెగేసి చెప్పారు. దీంతో పలుమార్లు వ్యాపారులు, రైతు సంఘాల నాయకులు మార్కెట్లో చర్చలు నిర్వహించి, మిర్చి ఖరీదుల్లోని నగదు చెల్లింపుల్లో 3 శాతం కోతకు అనధికారికంగా రైతు సంఘాల నాయకులు అంగీకరించారు. ఈ మేరకు మార్కెట్లో మూడుశాతం కోతతో ఖరీదులు కొనసాగుతున్నాయి. ఉదాహరణకు క్వింటాకు రూ.20 వేల చొప్పున ధర వచ్చిన రైతుకు 3 శాతం అంటే రూ.600 నగదు తగ్గించి ఇస్తారు. నగదు కోత వల్ల రైతుకు క్వింటాకు రూ.19,400 ధర వచ్చినట్లుగా పరిగణించాల్సివస్తోంది. వాస్తవానికి ఎలకా్ట్రనిక్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌ (ఈ-నామ్‌) నిబంధనల్లో కూలీ చార్జీలు, మార్కెట్‌ ఫీజు మినహా నగదు చెల్లింపుల్లో ఇతర కోతలు ఉండడం నిషేధం. దీంతో మార్కెట్‌ తక్‌పట్టీ వచ్చాక అనధికారికంగా 3శాతం కోత విధింపును లెక్కించి నగదు చెల్లింపుల్లో మినహాయిస్తున్నారు.

ఎనిమిది రోజుల్లోనే..

కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఈ మిర్చి సీజన్‌ గతనెల 30వ తేదీన ప్రారంభం కాగా, సెలవులు మినహా ఈనెల 8 వరకు ఎనిమిది రోజులు మార్కెట్‌ కొనసాగింది. ఈ ఎనిమిది రోజుల్లో 4,947 క్వింటాళ్ల తేజ రకం మిర్చి, 923 క్వింటాళ్ల తాలురకం మిర్చిని వ్యాపారులు ఖరీదులు చేశారు. ఈ మిర్చి సగటు ధర ప్రకారం విలువ రూ.11 కోట్లు దీనిపై మార్కెట్‌ ఫీజు ఒక శాతం రూ.11 లక్షలు రాగా రైతుల నుంచి రూ.33 లక్షల వరకు 3 శాతం కమీషన్‌ పేరిట వ్యాపారులు కోత విధించారు. ఒక రోజుకు సగటున రూ.4లక్షలకు పైగా నగదు రైతుల నుంచి దోపిడీకి గురయ్యాయి. ఈ-నామ్‌లో ధరలు వేసి కొనుగోలు చేస్తూ నగదు చెల్లింపుల్లో కోత విధిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా మార్కెట్లో నగదు కోతలు లేకుండా మిర్చి కొనుగోళ్లను నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

రూ.1,240లు కోత విధించారు : కాముని కుమారస్వామి, మిర్చి రైతు, బోడమంచ్యాతండా

కేసముద్రం మార్కెట్‌కు ఈనెల 8న ఏడు బస్తాల్లో 2 క్వింటాళ్ల మిర్చి తీసుకురాగా క్వింటాకు రూ.20521 ధర రావడంతో రూ.41,312 అయినవి. నాకు రావాల్సిన నగదులో 3శాతం రూ.1240ల వ్యాపారి కోత విధించాడు. చెక్కు కావాలంటే 2శాతం కోత విధించి 8 రోజుల తర్వాత తేదీ వేసి ఇస్తానన్నాడు. డబ్బులు అవసరం ఉండడంతో రూ.1240లను వదులుకొని మిగిలిన నగదు తీసుకున్నా. మిర్చి ఖరీదుల్లో అనధికారిక కోతలను నిషేధించి పూర్తి డబ్బులు రైతుకు అందేలా అధికారులు చర్య తీసుకోవాలి.

Updated Date - Feb 11 , 2024 | 11:46 PM