Share News

నేడు ‘ఈద్‌ ఉల్‌ ఫిత్ర్‌’

ABN , Publish Date - Apr 10 , 2024 | 10:59 PM

గత నెల 11న నెలవంక దర్శనంతో 12వ తేదీ నుంచి ప్రారంభమైన రంజాన్‌ ఉపవాసాలు సమాప్తమయ్యాయి. బుధవారం వారం నెలవంక దర్శనంతో సుమారు 30రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలను పాటించిన ముస్లింలు గురువారం ఈద్‌ఉల్‌ఫిత్ర్‌ (రంజాన్‌)ను జరుపుకొనేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో దాదాపు అన్నిచోట్ల బుధవారం సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల మధ్య నెలవంక దర్శనంతోనే మస్జీద్‌లలో సైరన్‌లు మోగించి గురువారం రంజాన్‌ పండుగను జరుపుకొంటున్నట్టు ప్రకటించారు.

నేడు ‘ఈద్‌ ఉల్‌ ఫిత్ర్‌’
మానుకోట కొత్త బజారులోని ఈద్గా వద్ద ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న చైర్మన్‌ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ మార్నేని వెంకన్న, ముస్లిం మతపెద్దలు

నెలవంక దర్శనంతో రంజాన్‌ సందడి

నమాజ్‌ కోసం ఈద్గాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు

ముగిసిన 30 రోజుల కఠిన ఉపవాస దీక్షలు

మహబూబాబాద్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి) : గత నెల 11న నెలవంక దర్శనంతో 12వ తేదీ నుంచి ప్రారంభమైన రంజాన్‌ ఉపవాసాలు సమాప్తమయ్యాయి. బుధవారం వారం నెలవంక దర్శనంతో సుమారు 30రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలను పాటించిన ముస్లింలు గురువారం ఈద్‌ఉల్‌ఫిత్ర్‌ (రంజాన్‌)ను జరుపుకొనేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో దాదాపు అన్నిచోట్ల బుధవారం సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల మధ్య నెలవంక దర్శనంతోనే మస్జీద్‌లలో సైరన్‌లు మోగించి గురువారం రంజాన్‌ పండుగను జరుపుకొంటున్నట్టు ప్రకటించారు. ఇక ఎండల తీవ్ర దృష్ట్యా ఉమ్మడి జిల్లాలోని వివిధ మస్జీద్‌లలో ఆయా ప్రాంతాలను బట్టి ఉదయం 8.30 నుంచి 9.30 వరకు నమాజ్‌లు జరుపుతుండగా.. ఈద్గాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల సమీపంలోని ఈద్గా మైదానంలో ఉదయం 9.30 గంటలకు, కంకరబోడ్‌లోని నూతన ఈద్గాలో కూడా 8.45 గంటలకు, తహసీల్దార్‌ కార్యాలయం వద్ద గల జామియ మస్జీద్‌ మహబూబియాలో ఉదయం 9.30 గంటలకు ఈదుల్‌ ఫిత్ర్‌ నమాజ్‌ ఉంటుందని ముస్లిం పెద్దలు ప్రకటించారు.

మత సామరస్యం, భక్తిభావం...

ముస్లింలు.. పవిత్ర మాసం రంజాన్‌ సందర్భంగా నెల రోజుల పాటు ఉపవాసాలు ఉండి పేదల ఆకలి గుర్తెరుగుతూ ఆపై రంజాన్‌ పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు. మత సామరస్యానికి, భక్తి భావానికి ప్రతీకగా నిలిచే విశిష్టమైన శుభప్రదమైన రంజాన్‌ మాసానికి స్వాగతం పలకడానికి షాబాన్‌ మాసం నుంచే అన్ని విధాల ముస్లింలు సిద్ధపడి ఉంటారు. చంద్రదర్శనాన్ని బట్టి ఈ ఉపవాసాల మాసం 29 లేదంటే 30 రోజుల పాటు కొనసాగుతుంది. గతేడాది మాత్రం 29రోజుల ఉపవాస దీక్షలు కొనసాగగా.. ఈ ఏడాది ఏప్పట్లాగే 30 రోజుల ఉపవాసాలు జరిగాయి. ఈ రంజాన్‌ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. ‘రమ్జ్‌’ అంటే అరబిక్‌ భాషలో ‘కాలడం’ అని అర్థంగా పెద్దలు విశ్లేషిస్తారు. ఈ 30 రోజుల ఉపవాస దీక్షలో శరీరాన్ని సుష్కింపజేయడం ద్వారా ఆత్మప్రక్షాళనతో సర్వపాపాలు సమసిపోతాయని ముస్లింల విశ్వాసం. ఆ క్రమంలోనే అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అదుపులో ఉంటాయని.. దీనికి తోడు మనోనిగ్రహం కలుగుతుందని విశ్వసిస్తారు. మానవుడిలో ప్రేమాభిమానాలు, క్రమశిక్షణ, కర్తవ్యపరాయణత్వం, సహనం, దాతృత్వం, పవిత్ర జీవనం, న్యాయమార్గానుసరణం, ఆర్థిక సమానత్వం, సర్వమానవ సాభ్రాతృత్వం తదితర ఉత్తమ గుణాలు ఆలవడుతాయని చెబుతారు. ఈ అలవాటు చేసేందుకు దేవుడైన అల్లాహ్‌ ప్రతీయేడు మానవ జాతికి రంజాన్‌ మాసాన్ని ప్రసాదించాడని ముస్లింలు భావిస్తారు.

ఆకలి బాధను గుర్తెరిగే రోజా..

రంజాన్‌ ఉపవాస దీక్షగా వ్యవహరించే ‘రోజా’ను అరబిక్‌ భాషలో ‘సౌమ్‌’, ‘సియామ్‌’ అని అంటారు. సౌమ్‌ అంటే మానుకొనుట, ఆపుట, ఆగుట, కట్టుబడి ఉండుట అనే అర్థాలు వస్తాయి. ఉపవాసిని ‘సాయమ్‌’ అని అంటారు. ఇస్లామియా పరిభాషలో ప్రభాత పూర్వ సమయం నుంచి సూర్యాస్తమయం వరకు అన్నపానియాలు త్యజించడం ఈ ఉపవాస దీక్షకు పరమార్థంగా పేర్కొంటారు. ఈ ఉపవాసదీక్షల వల్ల నిర్మలమైన, నిశ్చలమైన భక్తిభావం ఏర్పడడమే కాకుండా అకలి బాధతో అల్లాడే దీనజనుల కష్టాలను స్వయంగా ఉపవాస దీక్షల ద్వారా గుర్తించే అవకాశం లభిస్తుందని విశ్వసించి నెలరోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు పూర్తి చేసుకున్నారు. ఆ క్రమంలోనే రోజూ ఐదుసార్లు దైవారాధన (నమాజ్‌) చేశారు. రాత్రి వేళల్లో తరావి నమాజ్‌లు చేశారు. అంతేకాకుండాపవిత్ర ఖురాన్‌ గ్రంథాన్ని పారాయణం చేసి, దాన్ని అర్ధం చేసుకుని గురువారం (నేడు) రంజాన్‌ పండుగ జరుపుకుంటున్నారు.

Updated Date - Apr 10 , 2024 | 10:59 PM